ఎమ్మెల్యే కుటుంబానికి 1+1, 1+2 ఆఫర్లు

8 Mar, 2019 07:29 IST|Sakshi

పిల్లి అనంతలక్ష్మికి రెండు ఓట్లు ఆమె భర్తకు మూడు ఓట్లు

వారి కుమారులకు రెండు నుంచి మూడు ఓట్లు

కాకినాడ రూరల్‌ ఓటర్ల జాబితాలో అక్రమాలు

వీటిని తొలగించాలని కోరితే చంద్రబాబు దృష్టిలో నేరం

ఇకనైనా బుకాయింపునకు బ్రేక్‌ పడేనా?

సాక్షి ప్రతినిధి, కాకినాడ: బోగస్‌ ఓట్లు తొలగించాని కోరితే తప్పట! ఒకే వ్యక్తికి రెండు మూడు ఓట్లు ఉండడంపై ఫిర్యాదు చేస్తే నేరమట! ఓట్ల జాబితాలో ఉన్న అక్రమాలను సరిచేయాలని ఫారం–7పై దరఖాస్తు చేస్తే అదేదో అడ్డగోలుతనమట! ఐటీ గ్రిడ్స్, బ్లూఫ్రాగ్‌ సంస్థల ముసుగులో ప్రజల డేటాను చోరీ చేసి, తెలంగాణ పోలీసులకు అడ్డంగా దొరికిపోయిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు ఎదురుదాడిలో భాగంగా చేస్తున్న వ్యాఖ్యలివి. అబద్ధాలను పదేపదే చెప్పి నిజాలుగా నమ్మించడంలో సిద్ధహస్తుడైన ఆయనకు ఫారం–7 ఎన్నికల సంఘం ఇచ్చిన అవకాశమని తెలియకపోవడం ఆశ్చర్యం కలిగించకమానదు. తానేది చెబితే అదే నిజం.. తాను చెప్పిందే వాస్తవం అన్నట్టుగా ప్రజల డేటా చోరీ వ్యవహారం వెలుగు చూసిన నేపథ్యంలో చంద్రబాబు వితండవాదం చేస్తున్నారు. ఇంత అడ్డంగా బుకాయిస్తున్న ఆయన కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో చోటు చేసుకున్న ఓట్ల అక్రమాలపై, ముఖ్యంగా తన ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబంలోనివారికి రెండేసి మూడేసి ఓట్లు ఉండడంపై ఏమంటారో చూడాలి.

ఎన్నికల్లో ఎలాగైనా నెగ్గాలన్న తపనతో కుట్రలు, కుతంత్రాలు చేస్తూ ప్రతిపక్షంపై అక్రమ కేసులు బనాయిస్తున్న తెలుగుదేశం పార్టీ నాయకులకు మాత్రం ఇవేవీ వర్తించవా అనిపిస్తోంది. కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబం మొత్తం దొంగ ఓట్లకు చిరునామాగా మారిన విషయం గురువారం వెలుగులోకి వచ్చింది. కాకినాడ రూరల్‌తో పాటు పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నంలో ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి కుటుంబానికి ఓట్లు నమోదై ఉన్నాయి. అనంతలక్ష్మితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు రెండు నుంచి మూడు ఓట్లు ఉండడం విచిత్రం. ఆమె కుటుంబానికి వివిధచోట్ల ఉన్న ఓట్ల వివరాలివీ..

ఎమ్మెల్యే పిల్లి అనంతలక్ష్మి (రెండు ఓట్లు) : పెద్దాపురం నియోజకవర్గంలోని ఈమె స్వగ్రామమైన మాధవపట్నం బూత్‌ నంబర్‌ 188లో ఓటర్‌ నంబర్‌ హెచ్‌ఎస్‌ఎఫ్‌ 2456226 పేరిట ఎమ్మెల్యే అనంతలక్ష్మికి ఒక ఓటు ఉంది. అలాగే కాకినాడ రూరల్‌ పరిధిలోని బూత్‌ నంబర్‌ 38లో ఓటర్‌ నంబర్‌ ఐఎంజెడ్‌ 2075331పై మరో ఓటు ఉంది.

ఎమ్మెల్యే భర్త సత్యనారాయణమూర్తి (మూడు ఓట్లు) : ఈయనకు కాకినాడ రూరల్‌ బూత్‌ నంబర్‌ 38లో ఓటర్‌ నంబర్‌ ఐఎన్‌జెడ్‌ 2078319లో ఒక ఓటు ఉంది. అలాగే, కాకినాడ రూరల్‌లోని బూత్‌ నంబర్‌ 106లో ఓటర్‌ నంబర్‌ ఐఎన్‌జెడ్‌ 1724087పై మరో ఓటు ఉంది. అలాగే, పెద్దాపురం నియోజకవర్గంలోని మాధవపట్నంలో బూత్‌ నంబర్‌ 188లో ఓటర్‌ నంబర్‌ ఏపీఓ 70430519155పై ఇంకో ఓటు ఉంది.

పిల్లి కృష్ణప్రసాద్‌ (ఎమ్మెల్యే మొదటి కుమారుడు) (రెండు ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం మాధవపట్నంలోని బూత్‌ నంబర్‌ 188లో ఓటర్‌ నంబర్‌ ఏపీఓ 70430519410పై ఒక ఓటు ఉంది. అలాగే కాకినాడ రూరల్‌ నియోజకవర్గం బూత్‌ నంబర్‌ 38లో ఓటర్‌ నంబర్‌ ఐఎంజడ్‌ 2068310పై మరో ఓటు ఉంది.

పిల్లి కృష్ణకళ్యాణ్‌ (ఎమ్మెల్యే రెండో కుమారుడు) (మూడు ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం బూత్‌ నంబరు 188లోని ఓటర్‌ నంబర్‌ హెచ్‌ఎస్‌ఎఫ్‌ 1182708పై ఒకటి, కాకినాడ రూరల్‌ నియోజకవర్గం బూత్‌ నంబర్‌ 38లో ఓటర్‌ నంబర్‌ ఐఎంజడ్‌ 2068211పై మరొకటి, కాకినాడ రూరల్‌ నియోజకవర్గంలో బూత్‌ నంబర్‌ 46, ఓటర్‌ నంబర్‌ ఐఎంజడ్‌ 1493402లో మూడో ఓటు ఉన్నాయి.

పిల్లి రాధాకృష్ణ (ఎమ్మెల్యే మూడో కుమారుడు) (3 ఓట్లు) : ఈయనకు పెద్దాపురం నియోజకవర్గం బూత్‌ నంబరు 188లో ఓటర్‌ నంబర్‌ హెచ్‌ఎస్‌ఎఫ్‌ 1182757పై ఒకటి, కాకినాడ రూరల్‌ నియోజకవర్గం బూత్‌ నంబర్‌ 38లో ఓటర్‌ నంబర్‌ ఐఎంజడ్‌ 2067205పై మరొకటి, కాకినాడ రూరల్‌ నియోజకవర్గం బూత్‌ నంబర్‌ 46లో ఓటర్‌ నంబర్‌ ఐఎంజెడ్‌ 1493550పై మరొకటి ఓట్లు ఉన్నాయి.
ఈ ఒక్క ఎమ్మెల్యే కుటుంబంలోని సభ్యులకే రెండేసి మూడేసి ఓట్లు ఉన్నాయంటే మిగతాచోట్ల, మిగతావారికి ఇంకెన్ని ఉండవచ్చో అర్థం చేసుకోవచ్చు. ఇటువంటి ఓట్లను తొలగించాలని ఫారం–7పై అభ్యర్థన చేస్తే నేరమని చంద్రబాబు చెబుతున్నారు. అసలు ఇలాంటివి తొలగించడం కోసమే ఫారం–7 అవకాశాన్ని ఎన్నికల సంఘం కల్పించింది. ఇవేమీ పట్టించుకోకుండా చంద్రబాబు ఎదురుదాడికి దిగి, ఫారం–7 దరఖాస్తులు చేసినవారిపై చర్యలు తీసుకోవాలని, తీసుకుంటామని బెదిరింపులకు దిగడం ఎంతవరకూ సమంజసమో మరి!

మరిన్ని వార్తలు