ధర్మశ్రీ చతురత!

16 Mar, 2020 08:29 IST|Sakshi

చోడవరం నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీలు వైఎస్సార్‌సీపీ ఏకగ్రీవం

11 ఎంపీటీసీ స్థానాలు కూడా..

చోడవరం:  జిల్లాలో చోడవరం నియోజకవర్గం ఓ సంచలనం సృష్టించింది. గతంలో ఎప్పుడూలేని విధంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో రెండు జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవం చేయడంలో సీనియర్‌ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ప్రదర్శించిన చతురుత ప్రత్యర్థి పార్టీ నాయకులకు దిమ్మతిరిగేలా చేసింది. గతంలో టీడీపీకి కంచుకోగా ఉన్న చోడవరం నియోజకవర్గంలో ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో భారీ విజయంతో సత్తా చూపిన వైఎస్సార్‌కాంగ్రెస్‌ పార్టీ తాజాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధికంగా ఏకగ్రీవ స్థానాలు దక్కించుకొని మరోసారి ప్రత్యర్థుల స్థానాల్లో పాగా వేసింది. నియోజకవర్గంలో నాలుగు జెడ్పీటీసీ, 77 ఎంపీటీసీ స్థానాలు ఉండగా చరిత్రలో ఎప్పుడూలేని విధంగా రోలుగుంట, రావికమతం మండలాల జెడ్పీటీసీ స్థానాలను ఏకగ్రీవంగా వైఎస్సార్‌సీపీ దక్కించుకుంది. 11 ఎంపీటీసీ స్థానాలు కూడా ఏకగ్రీవం కాగా మరో 30 స్థానాలు టీడీపీ అభ్యర్థులు విత్‌డ్రా అయ్యేలా చేయడంలో ఎమ్మెల్యే ధర్మశ్రీ చేసిన ప్రయత్నం పార్టీ కేడర్‌లో నూతనుత్సాహాన్ని నింపింది.

రోలుగుంట, రావికమతం జెడ్పీటీసీ స్థానాల్లో టీడీపీ అభ్యర్థులు నామినేషన్లు ఉపసంహరించుకునేలా ఆయన పావులు కదిపి విజయం సా«ధించారు. రోలుగుంట జెడ్పీటీసీ స్థానాన్ని ఏకగ్రీవం చేసుకోగా రావికమతం జెడ్పీటీసీ స్థానం టీడీపీ అభ్యర్థి విత్‌డ్రా అయ్యారు. జనసేన అభ్యర్థి విత్‌డ్రాకు సుముఖత వ్యక్తం చేసినప్పటికీ సమాయానికి ఆయన  అందుబాటులో లేకపోవడంతో పోటీ కేవలం నామమాత్రంగానే మారింది. దీనితో జిల్లాలో ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో రెండు జెడ్పీటీసీలను వైఎస్సార్‌సీపీ దక్కించుకున్నట్టయ్యింది. ఇక చోడవరం, బుచ్చెయ్యపేట జెడ్పీటీసీ స్థానాలు కూడా ఆ పార్టీ దక్కించుకునేలా ధర్మశ్రీ చూపిన చొరవ ఆ పార్టీ విజయానికి చేరువ చేసినట్టుగా ఉంది. నాలుగు మండలాల్లో 80 శాతానికి పైగా ఎంపీటీసీ స్థానాలు దర్కించుకుని నాలుగు ఎంపీపీ స్థానాలు కూడా వైఎస్సార్‌సీపీ దక్కించుకునేలా ఎమ్మెల్యే ధర్మశ్రీ పావులు కదిపి ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను సైతం తమకు అనుకూలంగా మార్చుకొని సత్తాచాటారు. ధర్మశ్రీ చొరవ వైఎస్సార్‌సీపీలో నూతనుత్తేజాన్ని నింపింది. స్థానిక ఎన్నికల్లో క్లీన్‌స్వీప్‌ చేస్తామని ఎమ్మెల్యే ధర్మశ్రీ చెప్పారు.

మరిన్ని వార్తలు