కిడ్నీ వ్యాధికి మూలకారణాలేమిటో అంతుచిక్కడం లేదు..

28 Mar, 2018 16:17 IST|Sakshi
ఆరోగ్య శాఖ మంత్రి అనుప్రియా పటేల్, విజయసాయి రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: శ్రీకాకుళంలోని ఉద్దానం, ప్రకాశం, కృష్ణా జిల్లాల్లో ప్రబలుతున్న కిడ్నీ వ్యాధికి మూలకారణాలేమిటో అంతుచిక్కడం లేదని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి అనుప్రియా పటేల్ వెల్లడించారు. రాజ్యసభలో నిన్న (మంగళవారం) వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు మంత్రి రాతపూర్వక సమాధామిచ్చారు. ఆయా ప్రాంతాల్లో రోజు రోజుకు తీవ్ర రూపం దాలుస్తున్నవ్యాధులకు మూలకారణాలేమిటో విచారించడానికి కేంద్ర బృందం శ్రీకాళంలో పర్యటించిందనీ, కానీ దానికి గల కారణాలు వెల్లడి కాలేదన్నారు.

ఉద్దాన ప్రాంతంలో కిడ్నీ వ్యాధిగ్రస్తుల కోసం డయాలసిస్‌ కేంద్రాలను ప్రారంభించాలని కేంద్రం నిర్ణయించిందా? అన్న ప్రశ్నకు ఆరోగ్య మంత్రి జవాబిస్తూ... శ్రీకాళంలో ఇప్పటికే అయిదు డయాలసిస్‌ కేంద్రాలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపారు. రాజీవ్‌ గాంధీ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌(రిమ్స్‌), టెక్కలి, పాలకొండ, పలాసలోని ఏరియా ఆస్పత్రుల్లో, సోంపేటలోని కమ్యూనిటీ హెల్త్‌ సెంటర్‌లో డయాలసిస్‌ కేంద్రాలు పనిచేస్తున్నట్లు తెలిపారు. కిడ్నీ వ్యాధి మరింతగా ముదరకుండా చూడడానికి 15 ప్రత్యేక మొబైల్‌ మెడికల్‌ క్లినిక్‌లను ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. అలాగే ఆంధ్ర ప్రదేశ్‌లోని విశాఖపట్నంలోగల కింగ్‌ జార్జి హాస్పిటల్‌ కిడ్నీ వ్యాధిగ్రస్తులకు రిఫరెల్‌ కేంద్రంగా పనిచేస్తున్నట్లు మంత్రి తెలిపారు.

నీటి వనరులను సమర్థవంతంగా వినియోగించుకోవడానికి వీలుగా కేంద్ర జల వనరుల మంత్రిత్వ శాఖ పలు రాష్ట్ర ప్రభుత్వాలకు అనేక కేంద్ర ప్రభుత్వ పథకాల కింద సాంకేతక, ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఈ పథకాల కింద దేశంలో 99 ప్రాజెక్ట్‌లను ప్రాధాన్యం కలిగిన ప్రాజెక్టులుగా గుర్తించినట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లోని 8 ఇరిగేషన్‌ ప్రాజెక్టులను ప్రాధాన్య ప్రాజెక్టులుగా గుర్తించామన్నారు.  అయితే అందులో ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వం వెలిగోడు ప్రాజెక్టును ప్రతిపాదించలేదని మరో ప్రశ్నకు సమాధానంగా అనుప్రియ వెల్లడించారు.

మరిన్ని వార్తలు