వైద్యం అందక చచ్చిపోతున్నామయ్యా..

1 Jan, 2019 04:10 IST|Sakshi
శ్రీకాకుళం జిల్లా చీపురుపల్లిలో ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌కు తమ సమస్యలు వివరిస్తున్న కిడ్నీ వ్యాధి బాధితులు

ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌తో గోడు వెళ్లబోసుకున్న ఉద్దానం కిడ్నీ బాధితులు

కూలి డబ్బులు డయాలసిస్‌కు చాలడం లేదని ఆవేదన  

ఇంట్లో ఇద్దరు ముగ్గురు బాధితులున్నా ఒక్కరికే డయాలసిస్‌ 

వారిలో ఒకరు మరణిస్తే తప్ప మరొకరికి ఆ సౌకర్యం లేదు 

మా ఆశలన్నీ మీ పైనే.. మీరే కాపాడాలంటూ వేడుకోలు  

ప్రతి కిడ్నీ బాధితునికి రూ.10 వేల పింఛన్‌ ఇస్తామని జగన్‌ హామీ

200 పడకలతో రీసెర్చ్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని భరోసా

ప్రజా సంకల్ప యాత్ర నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: ‘అయ్యా.. మా ఆశలన్నీ మీపైనే.. మమ్మల్ని మీరే కాపాడాలి.. వైద్యం అందక చచ్చిపోతున్నామయ్యా..’ అంటూ ఉద్దానం ప్రాంత కిడ్నీ సంబంధిత వ్యాధిగ్రస్తులు ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి మొర పెట్టుకున్నారు. రోజంతా కష్టపడి సంపాదించుకున్న కూలి డబ్బులు డయాలసిస్‌కే సరిపోక ఇబ్బంది పడుతున్నామని, ఇట్టాగైతే ఎలా బతకాలని బావురుమన్నారు. బతుకులు దుర్భరమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 334వ రోజు సోమవారం శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గంలో జగన్‌ పాదయాత్ర సాగించారు. తిత్లీ తుపానుతో అతలాకుతలమైన గ్రామాల మీదుగా పాదయాత్ర సాగింది. అక్కడి కుటుంబాలు సర్వస్వం కోల్పోయాయి. అసలే కిడ్నీ జబ్బులతో కునారిల్లుతున్న తమ ప్రాంతాన్ని తిత్లీ మరింత కుంగదీసిందని బాధితులు ఆవే దన వ్యక్తం చేశారు. డెప్పూరు క్రాస్‌ వద్ద పలువురు కిడ్నీ వ్యాధిగ్రస్తులు, వారి కుటుంబీకులతో జగన్‌ ముఖాముఖి మాట్లాడారు. వారి కష్టాలు ఓపిగ్గా విన్నారు. డెప్పూరు, గునుపల్లి, మెట్టూరు, గడూరు, డోకులపాడు, హరిజనపేట, తోటూరు గ్రామాలకు చెందిన బాధితులు తమ కష్టాలు చెప్పుకున్నారు.
 
బతుకు భారమైందయ్యా.. 
ప్రభుత్వం ఇస్తున్న రూ.1000 పింఛన్‌ మందులకు కూడా చాలడం లేదని, బతుకు భారమైందని సంక లోలాక్షి ఆవేదన వ్యక్తం చేసింది. డయాలసిస్‌ కోసం దాదాపు 100 నుంచి 250 కిలోమీటర్ల మేర ప్రయాణించడం కష్టంగా ఉందని గేదెల పున్నాలమ్మ అనే మహిళ వాపోయింది. ‘దూరంగా ఉన్న డయాలసిస్‌ కేంద్రానికి వెళ్లి రావడానికి ఆరోగ్యం సహకరించడం లేదయ్యా.. ఎన్నాళ్లు బతుకుతానో’ అంటూ పుక్కళ్ల ఎల్లమ్మ కన్నీటిపర్యంతమైంది. గునుపల్లి, మెట్టూరు గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున కిడ్నీ  సంబంధిత వ్యాధిగ్రస్తులు ఉండగా, ఈ ప్రభుత్వం ఇంటికొకరికే డయాలసిస్‌ చేస్తోందని పలువురు ఆందోళన వ్యక్తం చేశారు. ఒక రేషన్‌ కార్డుపై ఒక కిడ్నీ రోగికే డయాలసిస్‌ చేస్తున్నారని, కొన్ని కుటుంబాల్లో ఇద్దరు, ముగ్గురు చొప్పున బాధితులున్నాని, వారిలో ఒకరు మరణిస్తే తప్ప మరొకరికి డయాలసిస్‌ సౌకర్యం కలగడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. డయాలసిస్‌ కోసం శ్రీకాకుళం, విశాఖపట్నం ప్రాంతాలకు వెళ్లి రావడానికి అవస్థలు పడుతున్నామన్నారు. ఈ ప్రాంతంలో కిడ్నీ బాధితుల మరణాల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. మత్స్యకారులు అధికంగా ఉన్న ఈ ప్రాంతంలో కిడ్నీ వ్యాధి వల్ల వేటకు వెళ్లలేని పరిస్థితి ఉందని, ఒక వేళ సముద్రంలోకి వెళ్లినా వ్యాధి కారణంగా మళ్లీ తిరిగొస్తారన్న నమ్మకం లేదని ఆందోళన వ్యక్తం చేశారు.   
 
అన్ని విధాలా ఆదుకుంటాం 
ఉద్దానం కిడ్నీ బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని వైఎస్‌ జగన్‌ వారికి భరోసా ఇచ్చారు. ప్రతి కిడ్నీ బాధితుడికి రూ.10 వేల పింఛన్‌ మంజూరు చేస్తామన్నారు. రోగులకు అందుబాటులో 200 పడకలతో కూడిన కిడ్నీ డయాలసిస్, రీసెర్చి సెంటర్‌ను ఏర్పాటు చేసి మెరుగైన సేవలందిస్తామని హామీ ఇచ్చారు. వ్యాధిని ప్రాథమిక దశలోనే నిర్ధారించి.. చికిత్స చేయడానికి ఈ పరి«శోధనా కేంద్రంలో వసతులుంటాయని చెప్పారు.
 
ఉద్దానంలో వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం 
ఉద్దానం పల్లెల్లో ప్రజలు వైఎస్‌ జగన్‌కు బ్రహ్మరథం పట్టారు. వజ్రపుకొత్తూరు మండలం రాజాం కాలనీ, ధర్మపురం, గరుడభద్ర, తర్లగడూరు క్రాస్, అక్కుపల్లి, గడూరు, చీపురుపల్లి జంక్షన్‌ మీదుగా డెప్పూరు జంక్షన్‌ వరకు పెద్ద సంఖ్యలో మహిళలు ఎదురేగి ఘన స్వాగతం పలికారు. యువకులు పెద్ద సంఖ్యలో ఆ ప్రాంతాల్లో సందడి చేశారు. ఊళ్లకు ఊళ్లు తరలి వచ్చి జగన్‌కు సంఘీభావం ప్రకటించాయి. ప్రతి గ్రామంలోనూ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఆయన చేతుల మీదుగా ఆవిష్కరింపజేశారు. ఇటీవల తిత్లీ తుపాను బీభత్సానికి ఈ ప్రాంతమంతా ధ్వంసమైంది. జీడి మామిడి తోటలు, కొబ్బరి, మునగ, అరటి, పనస తోటలు నేలకొరిగాయి. స్థానికులు ఒకవైపు జగన్‌కు ఘన స్వాగతం పలుకుతూనే.. మరోవైపు తమ కష్టాలూ చెప్పుకున్నారు. తుపాను తాకిడికి చెట్లు కూకటి వేళ్లతో పెకిలించుకుపోయిన తోటల్లో ఆయన రైతులతో మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన నష్ట పరిహారం.. పడిపోయిన చెట్లను తొలగించడానికి అయ్యే ఖర్చుకు కూడా సరిపోదని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే పింఛన్‌లు, రేషన్‌ అందడం లేదని, వైఎస్సార్‌సీపీ సానుభూతిపరులమని టీడీపీ నాయకులు అక్రమ కేసులు పెడుతున్నారని, ఏళ్ల తరబడి పని చేస్తున్నా ఈ ప్రభుత్వం తమ ఉద్యోగాలను రెగ్యులరైజ్‌ చేయడం లేదని.. ఇలా పలువర్గాల ప్రజలు తమ కష్టాలు చెప్పుకుని వినతిపత్రాలిచ్చారు. అందరి సమస్యలను ఓపికగా విన్న జగన్‌.. మనందరి ప్రభుత్వం రాగానే అందరికీ మంచి జరుగుతుందని భరోసా ఇచ్చారు.
 
నవరత్నాలతో మైనార్టీలకు ఎంతో మేలు  
నవరత్నాల ద్వారా ముస్లిం మైనార్టీలకు ఎంతో మేలు జరుగుతుందని పార్టీ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వి.ఖాదర్‌బాష అన్నారు. తాము నవరత్నాల కార్యక్రమాన్ని ముస్లింలలోకి ఎలా తీసుకెళుతున్నదీ సోమవారం ఆయన జగన్‌కు వివరించారు. ఇప్పటికే 25 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని మైనారిటీ ప్రాంతాల్లో పాదయాత్ర చేయాలని నిర్ణయించి.. 22 నియోజకవర్గాల్లో పూర్తి చేశామని తెలిపారు. ‘హర్‌ దిల్‌ మే వైఎస్సార్‌’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ఇంకా ఉధృతంగా కొనసాగిస్తామన్నారు. నవరత్నాలతో అన్ని వర్గాలకూ ఎంతో మేలు జరుగుతుందని, ఇదో విప్లవాత్మక కార్యక్రమమని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ మైనార్టీ విభాగం నేతలు సయ్యద్‌ షఫి అహ్మద్‌ ఖాద్రి, బర్కత్‌ అలీ, వి.మహ్మద్‌ షబ్బీర్‌ తదితరులు పాల్గొన్నారు.
 
వైఎస్సార్‌సీపీలోకి మాజీ ఎమ్మెల్యే గుర్నాథరెడ్డి 
శ్రీకాకుళం అర్బన్‌:  అనంతపురం అర్బన్‌ మాజీ ఎమ్మెల్యే బి.గుర్నాథరెడ్డి  ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమక్షంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. సోమవారం ఆయన ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైఎస్‌ జగన్‌ను శ్రీకాకుళం జిల్లా పలాస నియోజకవర్గం వజ్రపుకొత్తూరు మండలంలోని అక్కుపల్లి వద్ద కలుసుకున్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌.. గుర్నాథరెడ్డికి కండువా వేసి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా గుర్నాథరెడ్డి మాట్లాడుతూ.. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్న వైఎస్‌ జగన్‌ ఆశయాలు, సిద్ధాంతాలు నచ్చే వైఎస్సార్‌సీపీలో చేరానన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదాతోనే సాధ్యమన్నారు. ప్రత్యేక హోదా కోసం మొదటి నుంచి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నన్నది వైఎస్‌ జగన్‌ అన్నారు.

దివంగత ముఖ్యమంత్రి డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి హయాంలో ప్రాజెక్టులకు, రైతులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఇదే రీతిలో జగన్‌ అన్ని వర్గాల వారికి అండగా ఉంటారన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో అసలు ప్రభుత్వం ఉందా? అనే అనుమానం కలుగుతోందన్నారు. చంద్రబాబు దుర్మార్గపు పాలన సాగిస్తున్నారని, ఏ నియోజకవర్గంలో కూడా ప్రజలు సంతోషంగా లేరన్నారు. బాబు పాలనలో ఆయన కుటుంబ సభ్యులు, కార్యకర్తలు, నాయకులు మాత్రమే సంతోషంగా ఉన్నారన్నారు. వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే తమ సమస్యలు పరిష్కారమవుతాయని ప్రజలు నమ్ముతున్నారని చెప్పారు. రానున్న ఎన్నికల్లో జగన్‌కు పట్టం కట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. పార్టీలో చేరిన వారిలో గుర్నాథరెడ్డితోపాటు బి.ఎర్రిస్వామిరెడ్డి, బి.రెడ్డప్పరెడ్డి, హెచ్‌.ఆనందరెడ్డి తదితరులు ఉన్నారు.  

నవరత్నాల క్యాలెండర్‌ ఆవిష్కరణ 
శ్రీకాకుళం అర్బన్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించిన నవరత్నాల పథకాల వివరాలతో ఆకర్షణీయంగా రూపొందించిన క్యాలెండర్‌ను పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. హైదరాబాద్‌కు చెందిన గోసంగి శ్రీనివాసులరెడ్డి రెండు లక్షల క్యాలెండర్‌ ప్రతులను ముద్రించారు.  

మార్పు కోరే గుండె చప్పుళ్లతో.. హ్యాపీ న్యూ ఇయర్‌ 
సాక్షి, అమరావతి: పరుగులు పెట్టే కాల గమనంలో ఎదురయ్యే ప్రతీ సంవత్సరాన్ని వేడుకగానే స్వాగతిస్తాం. ఆశావాహ ధృక్పథంతో ఆహ్వానిస్తాం. సరికొత్త మార్పునకు నాందిగా భావిస్తాం. ఈ నేపథ్యంలో చిరునవ్వుల సవ్వడి చేస్తూ 2019 మనముందుకొచ్చింది. ప్రతి ఒక్కరిలో ఆశల ఊసులు రేకిత్తిస్తోంది. తియ్యటి ఆనందాన్ని పంచుతానని ప్రమాణం చేస్తోంది. రాజకీయ అవనికలో నేనో చరిత్ర సృష్టిస్తాననే నమ్మకం కల్గిస్తోంది. భూత, వర్తమాన కాలాల కొలమానంలోంచి బంగారు భవిష్యత్‌ అందే వీలుందన్న సంకేతాలిస్తోంది. రాష్ట్ర స్థితిగతులు మార్చే యువ నాయకత్వాన్ని యావత్‌ ఆంధ్రప్రదేశ్‌ కోరుకుంటోంది. ఆ సుమధుర ఘట్టానికి 2019 నాంది కాబోతోందన్నది అందరి విశ్వాసం. జనం మెచ్చిన ఎజెండాతో పాలన ఆరంభమవుతుందనేది ప్రతి ఒక్కరి సంకల్పం. ప్రగతి కోరుకునే పౌరులకు మంచి రోజులొస్తాయనేది చిలక జోస్యం కాదు. దీనికో శాస్త్రీయత ఉంది.

రాజకీయ విశ్లేషణా ఉంది. 2019లో ప్రజాస్వామ్య కురుక్షేత్రం జరగబోతోంది. పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి రాబోతున్నాయి. ఐదేళ్ల వంచనకు తగిన బుద్ధి చెప్పేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి సుదీర్ఘ అనుభవం అక్కరకు రాకపోగా, తెచ్చి పెట్టిన తంటాలేంటో అందరికీ తెలుసు. అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, దుర్మార్గాలు. రోదించే పల్లెలు తొలిపొద్దు కోసం వేయి కళ్లతో వేచి చూస్తున్నాయి. అందరి ఆశలు, ఆలోచనలకు 2019 కొత్త రూపం ఇవ్వబోతోంది. రావాలి జగన్‌.. కావాలి జగన్‌.. అనేది ఓ నినాదమైంది. ప్రజల అస్త్రమైంది. ప్రజా క్షేత్రంలో తిరుగుతూ, కష్టాలు, కన్నీళ్లు దోసిట పడుతున్న వైఎస్‌ జగన్‌.. 2019లో సుస్థిర పాలన అందించాలనేది ప్రజాభిమతం. తానొస్తే ఏం చేస్తానో చెప్పారు. జన జీవితంలో ఏం మార్పు తీసుకొచ్చేదీ వివరించారు. ప్రతీ నవరత్నం ప్రజల హృదయాల్లో పదిలమైంది. ఇచ్చిన ప్రతి హామీ అమలవుతుందనే నమ్మకం ఏర్పడింది. సరికొత్త సమాజాన్ని చూడాలన్న జగన్‌ ఆశయ సాధనకు 2019 వేదిక కానుంది.  

అక్రమ కేసులు పెడుతున్నారన్నా.. 
అన్నా.. వైఎస్సార్‌సీపీ తరఫున పనిచేస్తున్నామని టీడీపీ నాయకులు కక్ష సాధిస్తున్నారు. అక్రమంగా పోలీసు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. ఏ పాపం చేయని నా భర్త శ్రీనుపై హత్య కేసు నమోదు చేయించారు. మా మావయ్య మాజీ సర్పంచ్‌ కావడంతో ఆయననూ వేధిస్తున్నారు. మీరే మాకు దిక్కన్నా.  
–కర్రి భాగ్యలక్ష్మి, శ్రీను, ఉద్దాన గోపినాథపురం, పలాస నియోజకవర్గం. 

వేలి ముద్రలు పడటం లేదని పింఛన్, రేషన్‌ ఇవ్వడం లేదయ్యా..  
అయ్యా.. మేమంతా వృద్ధులం. జీడి పిక్కలు ఒలిచే పని నమ్ముకుని ఉన్నాం. ఏళ్ల తరబడి ఇదే పనిచేస్తుండటంతో మా చేతి రేఖలు అరిగిపోయి వేలి ముద్రలు పడటం లేదు. దీంతో పింఛన్, రేషన్‌ అందుకోలేకపోతున్నాం. ఈ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోవడం లేదు.  
–జుత్తు నూకమ్మ, మద్దిల జానకి, సార అప్పమ్మ, జీడి కార్మికులు, మామిడిపల్లి గ్రామం. పలాస మండలం. 

108ను నిర్వీర్యం చేస్తున్నారు  
సార్‌.. 108ను నిర్వీర్యం చేస్తున్నారు. వాహనాలు పనిచేయడం లేదు.. కనీసం వాటికి మరమ్మతులు కూడా చేయడం లేదు. ఉద్యోగులకు భద్రత లేదు. మా సమస్యలపై ఫిర్యాదు చేసినా.. ప్రశ్నించినా సస్పెండ్‌ చేస్తామంటూ బెదిరిస్తున్నారు. షోకాజ్‌ నోటీసులిస్తున్నారు. 12 ఏళ్లుగా ఇదే ఉద్యోగం చేస్తున్నా జీతాలు కూడా సక్రమంగా రావడం లేదు. మీరొచ్చాక న్యాయం చేయండి.  
 – హెచ్‌.జగదీష్, 108 సిబ్బంది సంఘాధ్యక్షుడు, టెక్కలి. 

మరిన్ని వార్తలు