రామ మందిరం కట్టకపోతే బీజేపీ కథ అంతే!

25 Nov, 2018 15:05 IST|Sakshi

రామమందిరం నిర్మించకపోతే బీజేపీకి అధికారం దక్కదని ఉద్ధవ్‌ఠాక్రే హెచ్చరిక.

లక్నో : అయోధ్యలో రామమందిరం నిర్మించకపోతే బీజేపీకి అధికారం దక్కదని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే హెచ్చరించారు. రెండు రోజుల అయ్యోధ్య పర్యటనలో భాగంగా ఆయన చేసిన వ్యాఖ్యలు బీజేపీని ఇరుకున పెడుతున్నాయి. ఆదివారం ఉదయం వివాదాస్పద రామమందిరం-బాబ్రీ ప్రాంతాన్ని సందర్శించిన ఆయన బీజేపీని టార్గెట్‌ చేస్తూ విమర్శలు గుప్పించారు.  ‘రామ మందిర నిర్మాణం ఎప్పుడు చేపడతారో బీజేపీ చెప్పాలి. రాష్టంలో, కేంద్రంలో అధికారంలో ఉన్నది మీరే. దశాబ్దాలుగా రామమందిర విషయాన్ని కేవలం ఎన్నికల్లో ఓట్ల కోసమే వాడుకుంటున్నారు. ప్రజల మనోభావాలతో ఆడుకోవద్దు’  అని ఘాటుగా వ్యాఖ్యానించారు.

మాజీ ప్రధాని వాజ్‌పేయి కాలంలో మందిర నిర్మాణం కష్టమే కానీ ప్రస్తుత బీజేపీ ప్రభుత్వానికి కావాల్సిన మెజార్టీలో ఉందన్నారు. ఆర్డినెన్స్‌ తెస్తారో చట్టం చేస్తారో మాకనవసరమని, రామ మందిర నిర్మాణం ఎప్పుడు మొదలు పెడతారో మాత్రమే చెప్పండంటూ నిలదీశారు.‘ రామ మందిరాన్ని ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం నిర్మించాలి, ఆ ఘనతను వారేనే తీసుకోమనండి. వారు నిర్మించకపోయినా.. రామమందిర నిర్మాణం జరుగుతుంది, కానీ బీజేపీ మాత్రం అధికారంలో కొనసాగదు’ అని హెచ్చరించారు. రామమందిరం ముందుండేది, ఇప్పుడు, ఎప్పుడు ఉంటుందని ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యానాథ్‌ వ్యాఖ్యలపై కూడా ఠాక్రే స్పందించారు. ఈ ఆలయ నిర్మాణం హిందువుల మనోభావాలకు సంబంధించిందని, ఇంకెప్పుడు నిర్మిస్తారని, తామెప్పుడు చూడాలని ప్రశ్నించారు. తొలుత ఆర్‌ఎస్సెస్‌‌(రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్‌‌) రామమందిర నిర్మాణనికి ఆర్డినేన్సు తిసుకురావలంటూ డిమాండ్‌ చేయగా.. తాజాగా విశ్వహిందూ పరిషత్‌, శివసేనలు సైతం ఆలయ నిర్మాణం చేపట్టాలని బీజేపీ ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నాయి.

ఈ ఆలయ స్థలం వివాదం కేసు సుప్రీంకోర్టులో పెండింగ్‌లో ఉండగా, న్యాయస్థానం ఈ కేసును జనవరికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.

మరిన్ని వార్తలు