50:50 ఫార్ములా?

25 Oct, 2019 03:52 IST|Sakshi

ముందే ఒప్పందం కుదిరింది: శివసేన

అమిత్‌ షా దీనికి అంగీకరించారు: ఉద్ధవ్‌

మా సంఖ్యేమీ తగ్గిపోలేదు: ఫడ్నవిస్‌

15 మంది రెబెల్స్‌ టచ్‌లోనే ఉన్నారని వెల్లడి  

ముంబై: మహారాష్ట్రలో భారతీయ జనతా పార్టీ, శివసేన అధికారాన్ని చెరి సగం పంచుకుంటాయా? ఫడ్నవీస్‌ రెండున్నరేళ్లు పాలించిన తర్వాత శివసేన తరఫున సీఎం కుర్చీపై ఠాక్రే వారసుడు ఆదిత్య ఠాక్రే కూర్చుంటారా? ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఇదే చర్చ జరుగుతోంది. ఈ సారి ఎన్నికలకు ముందే బీజేపీ, శివసేన కూటమిగా ఏర్పడ్డాయి కానీ గత ఎన్నికలతో పోల్చి చూస్తే బీజేపీ 20కి పైగా స్థానాలను కోల్పోయింది. ఇక శివసేన తన స్థానాలను ఇంచుమించుగా నిలబెట్టుకోవడంతో ఆ పార్టీ స్వరం పెంచింది.

288 అసెంబ్లీ స్థానాలకు గానూ తాజా ఫలితాల్లో బీజేపీ 103 సీట్లలో, శివసేన 56 సీట్లలో విజయం సాధించాయి. సాధించిన సీట్లను బట్టి అవసరమైతే శివసేనకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ భావించింది. కానీ సేన తన దారి మార్చుకొని ఏకంగా సీఎం పీఠంపైనే కన్నేసింది. మహారాష్ట్రలో బీజేపీ, శివసేన అధికారాన్ని సగం సగం పంచుకోవాలని ఎన్నికలకు ముందు పొత్తు కుదుర్చుకున్నప్పుడే నిర్ణయించుకున్నాయని శివసేన నాయకుడు సంజయ్‌ రౌత్‌ పేర్కొనటం ఈ సందర్భంగా గమనార్హం. రొటేషన్‌ పద్ధతిలో సీఎం పీఠాన్ని పంచుకోవాలని శివసేన అధ్యక్షుడు ఉద్ధవ్‌ ఠాక్రే, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా మధ్య అవగాహన ఉన్నట్లు సంజయ్‌ వెల్లడించారు.

ఇదే విషయాన్ని ఎన్నికల ఫలితాల అనంతరం శివసేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే కూడా చెప్పారు. ‘కూటమి ఏర్పాటు సమయంలో బీజేపీ అధ్యక్షుడు అమిత్‌ షా మా ఇంటికి వచ్చారు. అప్పుడు జరిగిన చర్చల్లో అధికారం సమానంగా పంచుకోవాలనే 50– 50 ఫార్ములాకు ఆయన అంగీకారం తెలిపారు. ఈ విషయాన్ని ఇప్పుడు గుర్తు చేస్తున్నాను’ అని ఉద్ధవ్‌ ఠాక్రే వ్యాఖ్యానించారు. ‘సీట్ల సర్దుబాటు సమయంలో బీజేపీ కన్నా తక్కువ సీట్లలో పోటీకి అంగీకరించాం. కానీ ప్రతీసారీ అలా బీజేపీకి అవకాశం ఇవ్వలేం. మా పార్టీ కూడా విస్తరించాలి కదా’ అన్నారు. అయితే ఫడ్నవీస్‌ మాత్రం దీనికి విరుద్ధంగా వ్యాఖ్యలు చేశారు. 15 మంది రెబెల్స్‌ తమతో టచ్‌లో ఉన్నారని అందుకే తమ సంఖ్య తగ్గే అవకాశం లేదని అన్నారాయన.  

వీలుకాకుంటే కాంగ్రెస్‌తో దోస్తీ?
2014 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ, శివసేన విడివిడిగా పోటీ చేశాయి. బీజేపీ 122 స్థానాలు          గెలుచుకోవడంతో ఎన్నికల అనంతరం శివసేన మద్దతు ఇచ్చినప్పటికీ కమలదళమే పెద్దన్న పాత్రని పోషించింది. కానీ ఈ సారి ఆ పరిస్థితి లేదు. బీజేపీ కాదంటే కాంగ్రెస్‌ – ఎన్‌సీపీతో కలిసి అధికారాన్ని పంచుకునే అవకాశం కూడా శివసేనకు ఉంది. అందుకే బీజేపీని అభ్యర్థిస్తున్నట్లు కాకుండా డిమాండ్‌ చేస్తున్నట్టుగా శివసేన నేతలు  మాట్లాడుతున్నారు.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా