సీఎం పదవి ఊడకుండా కాపాడండి: ఠాక్రే

30 Apr, 2020 10:29 IST|Sakshi

రాజకీయ సంక్షభం తలెత్తకుండా చూడండి

ప్రధాని మోదీకి ఉద్ధవ్‌ ఠాక్రే ఫోన్‌

సాక్షి, ముంబై : మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రేకు పదవీ గండం ముంచుకొస్తున్న తరుణంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహాయాన్ని కోరారు. ప్రస్తుతం ఉన్న కరోనా క్లిష్ట పరిస్థితుల్లో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం తలెత్తకుండా జోక్యం చేసుకోవాలని ఠాక్రే మోదీకి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు బుధవారం రాత్రి ఫోన్లో మాట్లాడారు. తనను శాసనమండలికి నామినేట్‌ చేస్తూ మంత్రిమండలి తీసుకున్న నిర్ణయాన్ని గవర్నర్‌ పరిశీలించేలా చూడాలని విన్నివించారు. ప్రస్తుత సంకట కాలంలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం సరైనది కాదని మోదీ దృష్టికి తీసుకెళ్లారు. కాగా గత ఏడాది నవంబర్‌ 28న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు ఆయన ఏ సభకూ ఎన్నిక కాలేదు. (సీఎం పదవికి ఉద్ధవ్‌ రాజీనామా తప్పదా?)

మే 28తో ఆయన సీఎంగా బాధ్యతలు చేపట్టి... ఆరు నెలల సమయం ముగియనుంది. ఈ నేపథ్యంలో మండలికి ఎన్నిక కాకపోతే పదవి ఊడిపోవడం ఖాయం. మరోవైపు కరోనా వైరస్‌ కారణంగా రాష్ట్రంలో జరగాల్సిన ఎమ్మెల్సీ ఎన్నికలు వాయిదా పడ్డాయి. ఇక గవర్నర్‌ కోటాలోనైనా ఉద్ధవ్‌ను మండలికి నామినేట్‌ చేయాలని మంత్రివర్గం తీర్మానించగా.. దీనిపై భగత్‌సింగ్‌ కోశ్యారీ ఇంత వరకు స్పందించలేదు. ఈ క్రమంలోనే రాష్ట్ర రాజకీయాల్లో జోక్యం చేసుకోవాలని ఠాక్రే ప్రధానిని కోరారు. (వైన్‌ షాపులు తెరవండి.. ఖజానా నింపుకోండి)

మరోవైపు ఈ విషయంలో తమ ప్రమేయం ఏమీలేదని బీజేపీ శాసనసభాపక్షనేత దేవేంద్రఫడ్నవిస్‌ స్పష్టం చేశారు. ఠాక్రేను మండలికి పంపడంతో గవర్నర్‌ ఎందుకు  ఆలస్యం చేస్తున్నారో తమకు తెలీదన్నారు. ప్రజలు ఇచ్చిన తీర్పు మేరకు ప్రతిపక్షంలోనే ఉంటామని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో కరోనా వైరస్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరగడం తీవ్ర  ఆందోళన కలిగిస్తోంది. గురువారం ఉదయం నాటికి కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పదివేలకు దాటింది. (భారత్‌లో పెరుగుతున్న కరోనా మృతుల సంఖ్య)

మరిన్ని వార్తలు