శివసేనకు ట్విస్ట్‌ ఇచ్చిన కాంగ్రెస్‌..!

11 Nov, 2019 18:23 IST|Sakshi

ముంబై: మహారాష్ట్రలో సంకీర్ణ రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీతో దూరం జరిగిన శివసేన.. ఎన్సీపీ, కాంగ్రెస్‌ పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసేందుకు చకచకా పావులు కదుపుతుండగా.. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఇంకా మీనమేషాలు లెక్కపెడుతోంది. శివసేన సర్కారుకు మద్దతునివ్వాలా? వద్దా? అన్నది ఇంకా తేల్చుకోలేకపోతోంది. శివసేన ప్రభుత్వాన్ని బయటినుంచి మద్దతునివ్వాలని కాంగ్రెస్‌ పార్టీ సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు కథనాలు వచ్చాయి. అయితే, కాంగ్రెస్‌ పార్టీ మాత్రం ఈ విషయంలో మరిన్ని సంప్రదింపులు అవసరమని, ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌తో చర్చించిన మీదటే తుది నిర్ణయం తీసుకుంటామని అధికారికంగా ఒక ప్రకటనలో తెలిపింది. ప్రభుత్వ ఏర్పాటుకు ఉవ్విళ్లూరుతున్న శివసేనకు ఈ మేరకు ట్విస్ట్‌ ఇచ్చింది.

అంతకుముందు సోనియాగాంధీ నివాసంలో పార్టీ అగ్రనాయకులు భేటీ అయి.. మహారాష్ట్ర పరిణామాలు, శివసేన సంకీర్ణ ప్రభుత్వానికి మద్దతునిచ్చే అంశంపై చర్చించారు. సోనియా అధ్యక్షతన జరిగిన ఈ భేటీలో ఏకే ఆంథోని, అహ్మద్‌ పటేల్‌ వంటి అగ్రనేతలు పాల్గొన్నారు. ఈ భేటీ జరుతుండగానే శివసేన అధినేత ఉద్ధవ్‌ ఠాక్రే సోనియాగాంధీకి ఫోన్‌ చేసి మాట్లాడినట్టు సమాచారం. శివసేన ప్రభుత్వానికి మద్దతునివ్వాల్సిందిగా ఈ సందర్భంగా సోనియాను ఠాక్రే కోరారు. అయితే, పార్టీ ముఖ్య నేతలతో సోనియా భేటీ అనంతరం సీడబ్ల్యూసీ అధికారిక ప్రకటన విడుదల చేసింది. మహారాష్ట్ర పరిణామాలపై సీడబ్ల్యూసీ సుదీర్ఘంగా చర్చించిందని, అనంతరం మహారాష్ట్ర పార్టీ నేతలతోనూ చర్చలు జరపామని, ఈ విషయంలో శరద్‌ పవార్‌తో చర్చించిన అనంతరమే నిర్ణయం తీసుకుంటామని సీడబ్ల్యూసీ స్పష్టం చేసింది.

మరోవైపు గవర్నర్‌ ఆహ్వానం మేరకు శివసేన నేతలు ఆదిత్య ఠాక్రే, ఏక్‌నాథ్‌ షిండే రాజ్‌భవన్‌ చేరుకున్నారు. గవర్నర్‌ను కలిసి వారి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. ఇక, శివసేన-ఎన్సీపీ-కాంగ్రెస్‌ కూటమిపై బీజేపీ చిటపటలాడుతోంది. ఒకప్పుడు బాబా సాహెబ్‌ సేనగా ఉన్న శివసేన ఇప్పుడు సోనియా సేనగా మారిపోయిందంటూ బీజేపీ నేత మినాక్షి లేఖి ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

మరిన్ని వార్తలు