అమెరికా అధ్యక్షుడిపై ఉద్ధవ్‌ ఠాక్రే సెటైర్లు

22 Jul, 2020 16:51 IST|Sakshi

కరోనాతో ప్రజలు బాధపడుతోంటే చూడలేను : మహా సీఎం ఠాక్రే

నేనేమీ ట్రంప్‌ను కాను

సాక్షి, ముంబై: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే కరోనా కట్టడికి సంబంధించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌పై సెటైర్లు వేశారు. తన కళ్లముందు రాష్ట్ర ప్రజలు బాధలు పడుతోంటే చూస్తూ ఊరుకోవడానికి తానేమీ డొనాల్డ్‌ ట్రంప్‌ను కాదంటూ వ్యాఖ్యానించారు.  దీనికి సంబంధించిన వీడియోను ఇపుడు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

కరోనా కారణంగా, ప్రజలు తన కళ్ళముందే బాధపడుతూ ఉంటే చూడలేనని, తాను డొనాల్డ్‌ ట్రంప్‌ను కాదనీ మహా సీఎం పేర్కొన్నారు. శివసేన అధికారపత్రిక "సామ్నా" కోసం పార్టీ ఎంపీ, సామ్నా ఎడిటర్‌ సంజయ్ రౌత్‌కు ఇచ్చిన  ఇంటర్వ్యూలో ఠాక్రే ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్వ్యూ రెండు భాగాలుగా త్వరలో వెల్లడి కానుంది. ఈ కార‍్యక్రమానికి సంబంధించిన టీజర్‌ వైరల్‌గా మారింది. ఈ సందర్భంపై పూర్తి స్పష్టత లేనప్పటికీ  లాక్‌డౌన్‌ ఎత్తివేత, పాపులర్‌ "వడా పావ్" ముంబై వీధుల్లో మళ్లీ ఎప్పుడు లభిస్తుందని సంజయ్ రౌత్ అడిగిన ప్రశ్నకు ముఖ్యమంత్రి  ఇలా స్పందించినట్టు భావిస్తున్నారు. లాక్‌డౌన్‌ ఆంక్షల  అమలులో కొన్ని మినహాయింపులున్నప్పటికీ లాక్‌డౌన్‌ ఇప్పటికీ  కొన్నిచోట్ల కొనసాగుతోందన్నారు. ఉద్ధవ్ ఠాక్రే  60(జూలై 27)వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఇంటర్వ్యూ మరాఠీ దినపత్రికలో జూలై 25  జూలై 26న ప్రచురితం కానుంది. 

కాగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కోవిడ్-19 మహమ్మారిని నిలువరించడంలో విఫలమయ్యారన్న విమర్శలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా కఠినమైన ఆంక్షల అమలు, నిబంధనల ఎత్తివేతలో సరిగ్గా వ్యవహరించని కారణంగానే, రెండవ దశలో కూడా కరోనా విజృంభించిదన్న ఆరోపణలు ట్రంప్‌ సర్కార్‌పై వెల్లువెత్తిన సంగతి తెలిసిందే..
 

మరిన్ని వార్తలు