కొలువుతీరిన ఠాక్రే సర్కార్‌

29 Nov, 2019 04:19 IST|Sakshi
సీఎంగా ప్రమాణంచేశాక అభివాదం చేస్తున్న ఉద్ధవ్, కొడుకు ఆదిత్య. పక్కనే ఉద్ధవ్‌ భార్య రశ్మి

శివాజీ పార్క్‌లో ముఖ్యమంత్రిగా ఉద్ధవ్‌ ఠాక్రే ప్రమాణ స్వీకారం

మంత్రులుగా ఇద్దరు చొప్పున శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ నేతల ప్రమాణం

హాజరైన శరద్‌ పవార్, సీనియర్‌ కాంగ్రెస్‌ నేతలు, ముకేశ్‌ అంబానీ కుటుంబం

సాక్షి, ముంబై/న్యూఢిల్లీ: అనేకానేక ఉత్కంఠభరిత మలుపుల అనంతరం, మహారాష్ట్ర రాజకీయ డ్రామా ప్రస్తుతానికి ముగిసింది. శివసేన, ఎన్సీపీ, కాంగ్రెస్‌ల కూటమి మహా వికాస్‌ ఆఘాడి తరఫున రాష్ట్ర ముఖ్యమంత్రిగా సేన చీఫ్‌ ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం సాయంత్రం ప్రమాణ స్వీకారం చేశారు. స్థానిక శివాజీ పార్క్‌ గ్రౌండ్‌లో భారీగా తరలి వచ్చిన నేతలు, అభిమానుల మధ్య, అంగరంగ వైభవంగా జరిగిన కార్యక్రమంలో ఛత్రపతి శివాజీ, తన తండ్రి బాల్‌ ఠాక్రేలను స్మరిస్తూ ఉద్ధవ్‌ ఠాక్రే సీఎంగా ప్రమాణం చేశారు. ఉద్ధవ్‌ ప్రమాణ స్వీకారం అనంతరం శివసేనకు చెందిన ఏక్‌నాథ్‌ షిండే, సుభాష్‌ దేశాయి, ఎన్సీపీ నేతలు జయంత్‌ పాటిల్, ఛగన్‌ బుజ్‌బల్, కాంగ్రెస్‌ నుంచి బాలాసాహెబ్‌ తోరట్, నితిన్‌ రౌత్‌లతో మంత్రులుగా గవర్నర్‌ భగత్‌ సింగ్‌ కోశ్యారీ ప్రమాణ స్వీకారం చేయించారు.

ప్రమాణ స్వీకారం అనంతరం ప్రజలకు ఉద్ధవ్‌ శిరసు వంచి నమస్కరించారు. తర్వాత తల్లి మీనాతాయి సొంత చెల్లెలు, మహారాష్ట్ర నవ నిర్మాణ సేన అధ్యక్షుడు రాజ్‌ ఠాక్రే తల్లి కుందాతాయి కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. కార్యక్రమానికి మాజీ సీఎం, బీజేపీ నేత ఫడ్నవీస్‌ హాజరయ్యారు. మహారాష్ట్ర నవ నిర్మాణ సేన చీఫ్‌ రాజ్‌ ఠాక్రే కుటుంబ సమేతంగా హాజరయ్యారు. ఎన్సీపీ చీఫ్, మహా వికాస్‌ ఆఘాడి ఏర్పాటు సూత్రధారి శరద్‌ పవార్,  కాంగ్రెస్‌ నుంచి సీనియర్‌ నేతలు ఖర్గే, అహ్మద్‌ పటేల్, కపిల్‌ సిబల్, మధ్యప్రదేశ్‌ సీఎం కమల్‌ నాథ్, డీఎంకే నేత స్టాలిన్, ఎన్సీపీ నేత అజిత్‌పవార్, శరద్‌ పవార్‌ కూతురు సుప్రియ సూలే హాజరయ్యారు. రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ చైర్మన్‌∙ముకేశ్‌ అంబానీ, భార్య నీతా, కొడుకు అనంత్‌ వచ్చారు.  

బంతిపూల రహదారి
ఠాక్రే కుటుంబం నుంచి తొలిసారి ముఖ్యమంత్రి అవుతుండటంతో ప్రమాణ స్వీకారం కోసం శివాజీ పార్క్‌లో భారీ వేదికను ఏర్పాటు చేశారు. వేదికపైననే కీలక నేతలు కూర్చొని ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వీక్షించారు. ప్రమాణ స్వీకారం పూర్తి కాగానే భారీగా హాజరైన శివసైనికులు నినాదాలతో సభాప్రాంగణాన్ని హోరెత్తించారు. భారీగా బాణాసంచా పేల్చి పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఠాక్రే నివాసం మాతోశ్రీ నుంచి శివాజీపార్క్‌ వరకు రహదారి పొడవునా బంతిపూలు చల్లి  శివసేన అభిమాని ఒకరు తన అభిమానం చాటుకున్నాడు.

మోదీ, సోనియా అభినందనలు
మహారాష్ట్ర కొత్త సీఎం ఉద్ధవ్‌కు ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు. ‘మహారాష్ట్ర ఉజ్వల భవిష్యత్తు కోసం ఉద్ధవ్‌ అవిరళ కృషి చేస్తారన్న విశ్వాసం నాకు ఉంది’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ఉద్ధవ్‌ ఠాక్రేకు శుభాకాంక్షలు తెలుపుతూ కాంగ్రెస్‌ చీఫ్‌ లేఖ పంపించారు. మంత్రులుగా ప్రమాణం చేసిన కాంగ్రెస్‌ నేతలను సైతం ఆమె అభినందించారు. ప్రమాణ స్వీకారానికి స్వయంగా హాజరుకాలేకపోయిన మాజీ పీఎం మన్మోహన్‌ సింగ్, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ కూడా ఉద్ధవ్‌కు అభినందనలు తెలిపారు. కార్యక్రమానికి హాజరు కాలేకపోయినందుకు చింతిస్తున్నానన్న రాహుల్‌.. ఉద్ధవ్‌ ఠాక్రే చేపట్టిన కొత్త బాధ్యతల ప్రయాణం విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు. ప్రజాస్వామ్యాన్ని అవమానించేందుకు ప్రయత్నించిన బీజేపీని ఎదుర్కొని మహా వికాస్‌ ఆఘాడీని ఏర్పాటు చేసినందుకు మూడు పార్టీల నేతలకు శుభాకాంక్షలు తెలిపారు.

సిద్ధి వినాయకుడికి విశేష పూజలు
సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన తరువాత ఉద్ధవ్‌ ఠాక్రే ప్రఖ్యాత సిద్ధివినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఠాక్రే భార్య రష్మీ, వారి ఇద్దరు కుమారులు కూడా పూజల్లో పాల్గొన్నారు.

అజిత్‌ పవార్‌ విషయంలో ఉత్కంఠ
ఉద్ధవ్‌తో పాటు ఎన్సీపీ తరఫున డిప్యూటీ సీఎంగా అజిత్‌ పవార్‌ ప్రమాణం చేస్తారని గురువారం ఉదయం వరకు అంతా భావించారు. అయితే, తాను ప్రమాణ స్వీకారం చేయబోవడం లేదని, ఎన్సీపీ, కాంగ్రెస్, శివసేనల తరఫున ఇద్దరు చొప్పున మంత్రులుగా ప్రమాణం చేస్తారని అజిత్‌ గురువారం ఉదయం మీడియాకు చెప్పారు. అయితే, త్వరలోనే ఉపముఖ్యమంత్రిగా అజిత్‌ పవార్‌ ప్రమాణస్వీకారం చేస్తారని ఎన్సీపీ వర్గాలు తెలిపాయి.

తొలి కేబినెట్‌ భేటీ
ప్రమాణ స్వీకారం తరువాత ముఖ్యమంత్రి హోదాలో ఉద్ధవ్‌ ఠాక్రే గురువారం రాత్రి తొలి కేబినెట్‌ భేటీ నిర్వహించారు. మూడు పార్టీలకు చెందిన నూతన మంత్రులు సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌లో జరిగిన ఈ భేటీకి హాజరయ్యారు. ఈ సందర్బంగా సహ్యాద్రి గెస్ట్‌హౌజ్‌కు అజిత్‌ పవార్‌ కూడా రావడం విశేషం.

ఉద్ధవ్‌ నంబర్‌ 8
మహారాష్ట్ర శాసన సభలో కానీ, శాసన మండలిలో కానీ సభ్యుడు కాకుండా ముఖ్యమంత్రి అయినవారిలో ఉద్ధవ్‌ ఠాక్రే 8వ నేత. అంతకుముందు, కాంగ్రెస్‌ నేతలు ఏఆర్‌ ఆంతూలే, వసంతదాదా పాటిల్, శివాజీరావు నిలాంగేకర్‌ పాటిల్, శంకర్‌రావు చవాన్, సుశీల్‌ కుమార్‌ షిండే, పృథ్వీరాజ్‌ చవాన్‌లు కూడా ఏ సభలోనూ సభ్యులు కాకుండానే సీఎంలుగా ప్రమాణ స్వీకారం చేశారు. ఈ జాబితాలో ప్రస్తుత ఎన్సీపీ చీఫ్, అప్పట్లో కాంగ్రెస్‌ నేత అయిన శరద్‌పవార్‌ కూడా ఉండటం విశేషం. ఎమ్మెల్యే కానీ ఎమ్మెల్సీ కానీ కాకుండా సీఎంగా ప్రమాణం చేసిన వ్యక్తులు, ఆరు నెలల్లోగా శాసన సభకు కానీ, శాసనమండలికి కానీ ఎన్నిక కావాల్సి ఉంటుంది. కేంద్రంలోని పీవీ నరసింహరావు ప్రభుత్వంలో రక్షణ మంత్రిగా ఉన్న శరద్‌ పవార్‌ను 1993లో మహారాష్ట్రకు ముఖ్యమంత్రిగా పంపించారు. ముంబై అల్లర్ల నేపథ్యంలో అప్పటి సీఎం సుధాకర్‌ రావు నాయక్‌ను తొలగించి శరద్‌ పవార్‌కు ఆ బాధ్యతలు అప్పగించారు.  

అజిత్‌ అసమ్మతికి ‘పవార్‌’ కారణమా?
వారం రోజుల క్రితం శుక్రవారం రాత్రి శివసేన, కాంగ్రెస్, ఎన్సీపీల ‘మహారాష్ట్ర వికాస్‌ ఆఘాడీ(మహారాష్ట్ర ప్రోగ్రెసివ్‌ ఫ్రంట్‌)’ మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు విషయాన్ని చర్చించేందుకు సమావేశమయ్యేంత వరకు అంతా బాగానే ఉంది. అయితే సాయంత్రం అయ్యేకొద్దీ ఎన్సీపీ  శాసనసభాపక్ష నేత అజిత్‌ పవార్‌ మొహంలో మారుతున్న రంగులను ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అంతేకాదు.. సమావేశం నుంచి హఠాత్తుగా అజిత్‌ వెళ్ళిపోయిన సంగతిని కూడా ఎవ్వరూ పెద్దగా పట్టించుకోలేదు. అయితే తెల్లవారాక కానీ గత రాత్రి అజిత్‌పవార్‌లో కనపడిన అసహనానికి పర్యవసానం ఏమిటో వారికి అర్థమైంది. శనివారం తెల్లవారుజామున.. దేశమింకా పూర్తిగా నిద్రలేవకముందే.. బీజేపీ నేత ఫడ్నవీస్‌ ముఖ్యమంత్రిగా, అజిత్‌ పవార్‌ ఉప ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడం అందర్నీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అప్పటి నుంచి అజిత్‌ పవార్‌ ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నారన్న ప్రశ్న అందరినీ వేధిస్తోంది.

డిప్యూటీ సీఎం పదవిపై నోరు విప్పని శరద్‌
శివసేనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలను కున్నప్పుడు, ఎన్సీపీ శాసనసభాపక్ష నేతనైన తనకు డిప్యూటీ సీఎం పదవి లభిస్తుందని అజిత్‌ ఆశించారు. అయితే, కూటమి చర్చల్లో ఎన్సీపీ అధినేత శరద్‌పవార్‌ ఈ విషయం లేవనెత్తక పోవడం అజిత్‌ని బాగా గాయపరిచింది. అయితే వీరిద్దరి మధ్యా కోల్డ్‌ వార్‌ ఇప్పటిది కాదు. 2009లో మహారాష్ట్రకు అశోక్‌ చవాన్‌ రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఇద్దరు పవార్‌ల మధ్య కోల్డ్‌ వార్‌ ప్రారంభం అయ్యింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి 82, ఎన్సీపీకి  62 అసెంబ్లీ స్థానాలు వచ్చాయి. అప్పుడు కూడా డిప్యూటీ సీఎం పదవిని ఎంచుకునే అవకాశం శరద్‌ పవార్‌కి వచ్చింది.

అయితే అనూహ్యంగా, అజిత్‌ను కాదని డిప్యూటీ సీఎం పదవిని చగన్‌ భుజ్‌బల్‌కి శరద్‌ కేటాయించారు. ఇప్పుడు, 2019లో కూడా అదే పరిస్థితి ఎదురవనుందా? అనే అనుమానమే అజిత్‌ పవార్‌ను బీజేపీకి దగ్గర చేసిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. 2000 సంవత్సరంలో కాంగ్రెస్‌తో ఎన్నికల పొత్తుకి ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ నిర్ణయించుకున్నప్పటి నుంచి ఆర్‌ఆర్‌ పాటిల్, జయంత్‌ పాటిల్, ధనుంజయ్‌ ముండే, సుప్రియాసూలే వంటి ఇతర ద్వితీయ శ్రేణి నాయకులతో సమానంగా అజిత్‌ పవార్‌ని చూశారు. దీంతో ఎన్సీపీలో తాను నంబర్‌ 2 కావడంపై అజిత్‌ పవార్‌లో అనుమానాలు ప్రారంభమయ్యాయి. అజిత్‌ కుమారుడికి ఇస్తానన్న ఎంపీ సీటు ఆలస్యంగా ఇవ్వడం, ఆ తరువాత అతను ఓడిపోవడం కూడా అజిత్‌లో అసహనానికి మరో కారణంగా భావిస్తున్నారు.

కాషాయం మసకబారుతోంది!
న్యూఢిల్లీ: కాషాయ వికాసం క్రమేపీ మసకబారుతోంది. మహారాష్ట్ర సీఎం పీఠం కూడా ప్రతిపక్షం చేతుల్లోకి వెళ్లిపోవడంతో దేశంలో బీజేపీ పాలిత ప్రాంతం మరింత తగ్గిపోయింది. 2018 మార్చిలో బీజేపీ పలుకుబడి పతాకస్థాయికి చేరుకుంది. ఆ సమయంలో బీజేపీ, దాని మిత్రపక్షాలు దేశంలోని 76 శాతం భూభాగాన్ని, 69 శాతం ప్రజలను పరిపాలించాయి. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో మధ్యప్రదేశ్, రాజస్తాన్‌ వంటి పెద్ద రాష్ట్రాల్లో బీజేపీ అధికారం కోల్పోయింది. తాజాగా, 2019 నవంబర్‌లో మహారాష్ట్రలోనూ కాషాయ దళం అధికారానికి దూరమయింది. ప్రస్తుతం బీజేపీ పాలిత ప్రాంతం దేశంలో వైశాల్యం రీత్యా 37.4 శాతం, జనాభాపరంగా చూసుకుంటే 45.6 శాతానికి పడిపోయింది.

మరిన్ని వార్తలు