అద్నాన్‌ సమీకి పద్మశ్రీనా?

28 Jan, 2020 04:11 IST|Sakshi
అద్నాన్‌ సమీ

కాంగ్రెస్, ఎన్సీపీ విమర్శలు

తిప్పికొట్టిన బీజేపీ, ఎల్జేపీ

1965 యుద్ధంలో పాక్‌ తరఫున పాల్గొన్న సమీ తండ్రి

ముంబై: ప్రముఖ గాయకుడు అద్నాన్‌ సమీకి తాజాగా పద్మశ్రీ ప్రకటించడంపై మాటల యుద్ధం ప్రారంభమైంది. బ్రిటన్‌లో జన్మించిన, పాకిస్తాన్‌ సంతతికి చెందిన అద్నాన్‌ సమీ 2016లో భారత పౌరసత్వం పొందారు. ఈ పురస్కారానికి తనను ఎంపిక చేయడం పట్ల భారత ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూనే.. విమర్శకులపై సమీ ఘాటుగా విరుచుకుపడ్డారు. ముఖ్యంగా ‘భజన’ కారణంగానే ఈ పురస్కారం లభించిందని కాంగ్రెస్‌ నేత జైవీర్‌ షేర్‌గిల్‌ చేసిన ట్వీట్‌పై స్పందిస్తూ.. ‘పిల్లవాడా..! నీ బ్రెయిన్‌ను క్లియరెన్స్‌ సేల్‌లో కొనుక్కున్నావా? లేక సెకండ్‌ హ్యాండ్‌ స్టోర్‌లో కొనుక్కున్నావా? తల్లిదండ్రుల చర్యలకు పిల్లలను బాధ్యులను చేయాలని నీకు బర్కిలీ వర్సిటీలో నేర్పించారా?’ అని మండిపడ్డారు. దీనికి షేర్‌గిల్‌ ట్విటర్‌ వేదికగానే జవాబిచ్చారు. ‘అంకుల్‌జీ! ట్విట్టర్‌లో కొన్ని అభినందనల కోసం సొంత తండ్రినే దూరం పెట్టిన వ్యక్తి నుంచి భారతీయ సంప్రదాయం గురించి పాఠాలు నేర్చుకునే అవసరం నాకు లేదు’ అని ట్వీట్‌ చేశారు. గత ఐదేళ్లలో భారత్‌కు చేసిన ఐదు సేవలను చెప్పాలని సమీకి సవాలు చేశారు.

అద్నాన్‌ సమీ తండ్రి పాకిస్తాన్‌ వైమానిక దళంలో పైలట్‌గా పనిచేశారు. 1965 యుద్ధంలో పాక్‌ తరఫున భారత్‌తో పోరాడారు. భారత్‌కు వ్యతిరేకంగా యుద్ధంలో పాల్గొన్న వ్యక్తి కుమారుడికి ఈ ఉన్నత స్థాయి పురస్కారాన్ని ఇవ్వడంపై పలు విమర్శలు వచ్చాయి. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి సంబిత్‌ పాత్రా స్పందించారు. కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ తండ్రికి నియంతలు ముస్సోలినీ, హిట్లర్‌లతో సంబంధాలున్నాయన్న వార్తలను గుర్తు చేస్తూ.. ఆమెకు భారతీయ పౌరసత్వం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ‘భారతదేశాన్ని, ప్రధాని మోదీని, దేశ వ్యవస్థలను వ్యతిరేకించే ముస్లింలకు మాత్రమే అవార్డులు ఇవ్వాలని విపక్షాలు కోరుకుంటున్నాయి’ అన్నారు. పద్మశ్రీ పురస్కారానికి సమీ పూర్తిగా అర్హుడని సమర్ధించారు.

అద్నాన్‌ సమీ తల్లి నౌరీన్‌ ఖాన్‌ జమ్మూకి చెందిన వ్యక్తి అని గుర్తు చేశారు. ‘ఆ ప్రాంత ముస్లిం మహిళలపై కాంగ్రెస్‌కు గౌరవం లేదా?’ అని ప్రశ్నించారు. లోక్‌జనశక్తి పార్టీ నేత, కేంద్రమంత్రి రామ్‌ విలాస్‌ పాశ్వాన్‌ కూడా సమీకి పద్మశ్రీ ప్రకటించడాన్ని సమర్ధించారు. తన ప్రతిభతో భారత ప్రతిష్టను ఇనుమడింపజేశారని, ఆ పురస్కారానికి సమీ అన్నివిధాలా అర్హుడేనని పేర్కొన్నారు. సోనియాగాంధీపై పాత్రా చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ స్పందించలేదు. కాగా, ఎన్నార్సీ, సీఏఏ, ఎన్పీఆర్‌లపై వెల్లువెత్తుతున్న నిరసనల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చుకునే చర్యల్లో భాగంగానే అద్నాన్‌ సమీకి పద్మశ్రీ పురస్కారం ప్రకటించారని ఎన్సీపీ విమర్శించింది. ఇది 130 కోట్ల భారతీయులను అవమానించడమేనని పేర్కొంది. ‘జై మోదీ’ అని నినదించిన పాక్‌ పౌరుడెవరైనా భారత పౌరసత్వం పొందొచ్చని ఎన్సీపీ అధికార ప్రతినిధి నవాబ్‌ మాలిక్‌ ఎద్దేవా చేశారు.   

మరిన్ని వార్తలు