సీఎంను కలసిన ఉగ్రనరసింహారెడ్డి

24 Aug, 2018 03:17 IST|Sakshi

టీడీపీలో చేరడానికి రంగం సిద్ధం!

సాక్షి, అమరావతి: కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కోండ్రు మురళి, ఉగ్రనరసింహారెడ్డి తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. కనిగిరి మాజీ ఎమ్మెల్యే ముక్కు ఉగ్రనరసింహారెడ్డి గురువారం అమరావతిలో సీఎం చంద్రబాబును కలిశారు. ఇప్పటికే ఉగ్రనరసింహారెడ్డి పార్టీ మారతారన్న ప్రచారం ఉండటంతో సీఎంతో భేటీ అనంతరం ఆయన టీడీపీలో చేరబోతున్నారని విషయం స్పష్టమవుతోందని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి.

టీడీపీలో చేరాలని సీఎం కూడా కోరినట్లు చెబుతున్నారు. అయితే తన భార్య ప్రమోషన్‌ విషయమై సీఎంతో మాట్లాడేందుకే ఆయన్ని కలశానని ఉగ్ర చెబుతున్నారు.  అయితే ఆయన పార్టీ మారినా కాంగ్రెస్‌కు నష్టంలేదని ఆ పార్టీ నేతలు అభిప్రాయపడుతున్నారు. గత ఎన్నికల్లో పోటీ చేసినపుడు ఉగ్రకు కేవలం 2,663 ఓట్లు మాత్రమే వచ్చాయని, అలాంటి నేత పార్టీ మారడం వల్ల జిల్లాలో ఎటువంటి ప్రభావం ఉండదని ప్రకాశం జిల్లా నేతలు చెబుతున్నారు.

మంత్రి కళాతో కోండ్రు మంతనాలు
మరోవైపు ఉత్తరాంధ్రకు చెందిన కాంగ్రెస్‌ నేత, మాజీ మంత్రి కోండ్రు మురళి కూడా టీడీపీలో చేరబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఆయన మంత్రి కిమిడి కళావెంకటరావును కలసి మంతనాలు సాగించడంతో ఆ ప్రచారం నిజమేనని చెబుతున్నారు.  రాజాం నియోజకవర్గంలో పోటీ చేసిన కోండ్రుకు కేవలం 4,790 ఓట్లు మాత్రమే వచ్చాయని, ఆయన పార్టీని వీడినా నష్టంలేదని కార్యకర్తలే పేర్కొంటున్నారు.   

మరిన్ని వార్తలు