బిహార్‌ సీఎం అభ్యర్థిగా ఆమె..!

9 Mar, 2020 09:54 IST|Sakshi

పట్నా: అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ బిహార్‌లో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అధికార జనతాదళ్‌(యు) మాజీ ఉపాధ్యక్షుడు, ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ కిషోర్‌.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టేందుకు సిద్ధపడిన విషయం తెలిసిందే. బాత్‌ బిహార్‌ కీ పేరిట కార్యక్రమాన్ని చేపట్టి... యువతను రాజకీయాల్లో భాగస్వామ్యం చేస్తానని ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో తాజాగా తాను బిహార్‌ ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎన్నికల బరిలో దిగనున్నట్లు లండన్‌లో నివసిస్తున్న పుష్పం ప్రియా చౌదరి అనే మహిళ ప్రకటన చేయడం చర్చకు దారితీసింది.‘‘ బిహార్‌కు మార్పు అవసరం, బిహార్‌కు రెక్కలు అవసరం. చెత్తరాజకీయాలను తిరస్కరించండి. 2020లో ఎగిరేందుకు, పరిగెత్తేందుకు ప్లూరల్స్‌తో చేతులు కలపండి. ఎందుకంటే బిహార్‌ మెరుగైనవి పొందేందుకు అర్హత కలిగి ఉంది. ఆ మార్పు సాధ్యమవుతుంది’’ అంటూ ట్విటర్‌లో ఆమె పేర్కొన్నారు. (‘బాత్‌ బిహార్‌ కీ’: ప్రశాంత్‌ కిషోర్‌ కీలక ప్రకటన!)

అదే విధంగా హెరాల్డ్‌ లాస్‌వెల్‌ చెప్పినట్లుగా... రాజకీయాల్లో ఎవరు, ఎప్పుడు, ఎలా ప్రవేశిస్తారో తెలియదు. 2025- 2030లో బిహార్‌ అభివృద్ధికై బ్లూప్రింట్‌, రోడ్‌మ్యాప్‌ను పూరల్స్‌ సిద్ధం చేసిందని పార్టీ పేరును ప్రకటించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం ఈ మేరకు ఆమె ట్వీట్‌ చేశారు. కాగా బిహార్‌లోని దర్భాంగా గ్రామంలో జన్మించిన ప్రియా చౌదరి ప్రస్తుతం లండన్‌లో నివసిస్తున్నారు. ఆమె తండ్రి వినోద్‌ చౌదరి గతంలో జేడీయూ ఎమ్మెల్సీగా పనిచేశారు. ఇక లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ అండ్‌ పొలిటికల్‌ సైన్స్‌లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో మాస్టర్స్‌ చేసిన ప్రియ... గత కొంత కాలంగా తన రాజకీయ రంగ ప్రవేశం గురించి వరుస ట్వీట్లు చేస్తున్నారు.

మరిన్ని వార్తలు