పద్మావతి వివాదంపై స్పందించిన ఉమా భారతి

4 Nov, 2017 09:20 IST|Sakshi

జైపూర్‌ : పద్మావతి చిత్ర వివాదంపై కేంద్ర మంత్రి ఉమా భారతి స్పందించారు. అభ్యంతరాలు లేవనెత్తున్న వారికి ఈ చిత్రాన్ని ప్రదర్శించి చూపాలని పద్మావతి చిత్ర మేకర్లను ఆమె డిమాండ్ చేస్తు‍న్నారు. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఆమె తన ట్విట్టర్‌లో వరుస ట్వీట్లు చేశారు.

‘‘ఈ విషయంపై నేను మౌనంగా చూస్తూ ఉండలేను. తమ మనోభావాలు దెబ్బతినేలా అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయంటూ కొందరు వాదిస్తున్నారు. చరిత్రకారులు, చిత్ర నిర్మాతలు, నిరసనకారులు, సెన్సార్ బోర్డు వీరందరితో కలిపి ఓ కమిటీని నియమిస్తే సమస్య పరిష్కారం అవుతుంది కదా’’ అని అర్థం వచ్చేలా ఆమె పేర్కొన్నారు. అదే సమయంలో భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాల్లో మహిళల గౌరవాన్ని దెబ్బతీసే యత్నం జరగకూడదని ఉమా భారతి అభిప్రాయపడ్డారు.

చిత్తోర్‌ఘడ్‌ మహరాణి పద్మిని కథాంశంతో సంజయ్‌ లాలా భన్సాలీ పద్మావతిని తెరకెక్కించిన విషయం తెలిసిందే. చరిత్రను వక్రీకరించి అల్లావుద్దీన్‌ ఖిల్జీ-పద్మిని పాత్రల మధ్య కొన్ని అభ‍్యంతరకర సన్నివేశాలు చిత్రీకరించాడంటూ శ్రీ రాజ్‌పుత్‌ కర్ణి సేన మొదటి నుంచి ఆరోపిస్తూ వస్తోంది. ఈ జనవరిలో దర్శకుడు భన్సాలీతోపాటు చిత్ర యూనిట్‌పై దాడి చేసి కెమెరాలను ధ్వంసం చేశారు. ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ముందు తమకు ప్రదర్శించాలంటూ డిమాండ్ చేస్తోంది. సినిమాకు మేం వ్యతిరేకం కాదు. కానీ, భన్సాలీ బృందం మేధావులకు, చరిత్రకారుల సమక్షంలో ఈ చిత్రాన్ని ప్రదర్శించాలని కోరుతున్నాం అని రాజ్‌పుత్‌ కర్ణి అధికార ప్రతినిధి విశ్వబంధు రాథోడ్‌ చెబుతున్నారు. ఈ మేరకు పలు సంఘాల మద్దతుతో శనివారం చిత్తోర్‌ఘడ్‌ బంద్ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. 

మరోవైపు బీజేపీ కూడా చిత్రంపై అభ్యంతరం లేవనెత్తుతోంది. క్షత్రియ మనోభావాలను దెబ్బతీసేలా సన్నివేశాలు ఉన్నాయో లేదో తెలియాలంటే ముందుగా ప్రదర్శించాలని, లేకపోతే ఆ ప్రభావం గుజరాత్‌ ఎన్నికలపై పడే అవకాశం ఉంటుందంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌కు బీజేపీ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ బీజేపీ చర్యలను ఖండిస్తూనే చిత్రాన్ని ప్రదర్శించి తీరాలని కోరటం విశేషం. అయితే అహ్మదాబాద్ యువత మాత్రం సినిమా రిలీజ్‌ను అడ్డుకోవటం కళను అవమానించినట్లే అవుతుందన్న అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సినిమాలను రాజకీయాలకు వాడుకోవటం సరికాదని వారు పార్టీలకు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు