యువ నేతలను రాహుల్‌ ఎదగనీయడం లేదు: ఉమా భారతి

13 Jul, 2020 14:42 IST|Sakshi

న్యూఢిల్లీ: సంక్షోభం దిశగా పయనిస్తున్న రాజస్తాన్‌ రాజకీయాలపై బీజేపీ నాయకురాలు ఉమా భారతి స్పందించారు. రాజస్తాన్‌లో నెలకొన్న రాజకీయ సంక్షోభానికి కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధే ప్రధాన కారణమని ఆమె ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీలోని యువ నేతలను రాహుల్ గాంధీ ఎదగనీయడంలేదన్నారు. ప్రస్తుతం రాజస్తాన్, మధ్యప్రదేశ్‌లో జరుగుతున్న పరిణామాలకు రాహులే కారణమని ఆమె విమర్శించారు. ‘విద్యావంతులు, ఆదరణ ఉన్న నేతలైన సచిన్ పైలట్, జ్యోతిరాదిత్య సింధియా వంటి వారికి ఉన్నత పదవులు ఇస్తే తనకు ఆదరణ తగ్గుతుందన్న అభద్రతా భావంలో రాహల్ గాంధీ ఉన్నారు’ అని ఉమా భారతి ఎద్దేవా చేశారు. (ప్రియాంక రాయబారం : మెత్తబడిన పైలట్‌)

ఇదిలా ఉండగా జైపూర్‌లో జరిగే కాంగ్రెస్‌ లెజిస్లేటివ్‌ పార్టీ (సీఎల్పీ) భేటీలో పాల్గొనేది లేదని ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పీసీసీ చీఫ్‌ సచిన్‌ పైలట్‌ మరోసారి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మాటలు అబద్ధమని అన్నారు. తన వెంట 25 మంది ఎమ్మెల్యేలు ఉంటే.. గహ్లోత్‌కు 102 ఎమ్మెల్యేల మద్దతు ఎలా సాధ్యమని ప్రశ్నించారు. గహ్లోత్‌ ప్రభుత్వం మైనారిటీలో ఉందని సచిన్‌ వెల్లడించారు. కాగా, 200 మంది సభ్యులున్న రాజస్తాన్‌ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రస్తుతం 107 మంది, బీజేపీకి 72 మంది సభ్యులున్నారు. రాష్ట్రీయ లోక్‌తాంత్రిక్‌ పార్టీకి చెందిన ముగ్గురు ఎమ్మెల్యేలు బీజేపీకి మద్దతిస్తున్నారు. 13 మంది స్వతంత్ర ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్‌కు మద్దతిస్తున్నారు. అయితే, సీఎల్పీ భేటీ అనంతరం రాజకీయ సమీకరణాలు మారనున్నాయి.

మరిన్ని వార్తలు