దళితులు నా ఇంట్లో భోజనం చేస్తే..

3 May, 2018 09:25 IST|Sakshi
ఉమా భారతి

సాక్షి, న్యూఢిల్లీ : దళితుల ఇళ్లకు వెళ్లి.. వారితో భోజనం చేసినంత మాత్రాన తాము పవిత్రులం కాబోమని, అదే దళితులను తన ఇంటికి ఆహ్వానించి.. వారికి తన స్వహాస్తాలతో భోజనం వడ్డించినప్పుడే.. పవిత్ర భావం కలుగుతుందని కేంద్రమంత్రి ఉమాభారతి తెలిపారు.

మధ్యప్రదేశ్‌ నౌగావ్‌లోని గాధ్మౌవ్‌ గ్రామంలో ఆమె సామాజిక సామూహిక భోజన కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, దళితుల ఇంటికి వెళ్లి.. వారితో భోజనం చేసినంత మాత్రాన దళితులకు గౌరవం లభించడంగానీ, సామాజిక సామరస్యం ఏర్పడటంగానీ జరగదని ఆమె అన్నారు. ‘ నేను వెళ్లి దళితుల ఇళ్లలో భోజనం చేసినంతమాత్రాన వారు పవిత్రులు అవ్వడానికి నేనేమీ రాముడ్ని కాదు. అందుకు బదులు నేనే దళితులను నా ఇంటికి పిలిచి.. వారికి స్వయంగా భోజనం వడ్డించినప్పుడు.. అది నన్ను పవిత్రురాలిని చేస్తుంది’ అని ఆమె అన్నారు.

‘నన్ను నేను శ్రీరాముడినని భావించుకోను. అందుకే సామాజిక సామూహిక భోజనాల్లో నేను పాల్గొనను’ అని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నప్పటికీ.. ఆమె దళితులతో కలిసి భోజనం చేయలేదు. వేరే ప్రభుత్వ కార్యక్రమాలు ఉండటంతో త్వరగా వెళ్లాల్సి వచ్చిందని, అందుకే భోజనంలో పాలుపంచుకోలేదని ఆమె తర్వాత వివరణ ఇచ్చారు. ‘దళితులను అంటరానివారిగా చూసే రోజులు.. వారితో కలిసి భోజనం చేస్తే.. వారు ఆనందపడి.. స్వాధికారిత వస్తుందనుకునే రోజులు పోయాయి. దళితులు ఇప్పుడు ఆర్థిక, సామాజిక సావలంబన కోరుకుంటున్నారు. ప్రభుత్వ, పరిపాలనలో భాగం కోసం తపిస్తున్నారు’ అని ఆమె తెలిపారు.

మరిన్ని వార్తలు