బాబు తప్పిదాలపై నోరు పెగలదేం పవన్‌?

26 Nov, 2018 05:07 IST|Sakshi

పవన్‌కళ్యాణ్‌పై వైఎస్సార్‌సీపీ నేత ఉమ్మారెడ్డి ప్రశ్నల వర్షం

ప్రశ్నించేందుకు పార్టీ అని చంద్రబాబుకు మద్దతా?

ఎవరి డైరెక్షన్‌ కోసం ఎదురుచూస్తున్నావ్‌?

రాజధానిలో మల్లెపూల రైతులకు మాట ఇచ్చి తప్పలేదా?

సుజనా దోపిడీపై ఎందుకు స్పందించడంలేదు?

సాక్షి, అమరావతి: ప్రజాస్వామ్యం అపహాస్యం, ఆర్థిక నేరస్తులకు అండ, రాజ్యాంగ వ్యవస్థల నిర్వీర్యం, అవినీతి, ఆశ్రిత పక్షపాతం, కుల మతాల మధ్య చిచ్చు పెడుతున్న చంద్రబాబు అరాచకాలు, అప్రజాస్వామిక విధానాలపై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ నోరెందుకు మెదపడం లేదని వైఎస్సార్‌ సీపీ సీనియర్‌ నాయకుడు, శాసనమండలిలో ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు మండిపడ్డారు. ప్రశ్నించేందుకు పార్టీ పెట్టానని చెప్పిన పవన్‌కు ప్రస్తుత రాజకీయ పరిణామాలు కనిపించడం లేదా? లేక స్పష్టత లోపించిందా? లేక మరెవరి డైరెక్షన్‌ కోసమైనా ఎదురుచూస్తున్నావా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పవన్‌ కళ్యాణ్‌కు పలు ప్రశ్నలు సంధించారు. 

- ప్రశ్నిస్తానని పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాణ్‌కు చంద్రబాబు అవినీతి కనిపించడం లేదా? 
ప్రత్యేక హోదాపై జగన్‌ పోరాటం చేస్తూ యువభేరీలు నిర్వహిస్తుంటే వాటిల్లో పాల్గొనే వారిపై పీడీ యాక్ట్‌ పెడతామని చంద్రబాబు హెచ్చరిస్తుంటే పవన్‌ నోరు విప్పాల్సిన అవసరం ఉందా? లేదా? పవన్‌ ప్రశ్నించలేదంటే వారిద్దరి మధ్య అనుబంధం ఉన్నట్టే కదా?
జనసేన పుట్టిన తరువాత సొంతంగా పోటీకి దిగాలి. లేదా ఎవరితోనైనా పొత్తుపెట్టుకుంటే సీట్ల సర్దుబాటు జరగాలి. కానీ పవన్‌ సొంతంగా అభ్యర్థులను పెట్టలేదు. టీడీపీకి మద్దతిచ్చారు.  
రాజధాని పేరిట 19 గ్రామాల్లో భూసేకరణ చేస్తుంటే బేతపూడి గ్రామంలో మల్లెపూల తోటల్ని సాగుచేస్తున్న రైతులు తమ భూములు ఇవ్వబోమని ఆందోళన చేశారు. జేసీబీలు, బుల్డోజర్లతో భూములు అక్రమంగా దున్నుతున్న విధానాన్ని చూసిన పవన్‌.. సీఎంని ప్రశ్నిస్తానంటూ మల్లెపూల తోటల రైతులకు వాగ్దానం ఇచ్చారు. ఆ తర్వాత హైదరాబాద్‌ వచ్చి భూసేకరణ మంచిదని ప్రకటన ఇచ్చిన మాట నిజం కాదా? అది టీడీపీకి అందించిన స్నేహహస్తం కాదా?
సర్పంచ్‌లను పక్కకునెట్టి జన్మభూమి కమిటీలు వేసి పాలన చేస్తుంటే ప్రశ్నించావా? జన్మభూమి కమిటీల అక్రమాలపై ఏనాడైనా మాట్లాడావా? ఇసుక దగ్గర నుంచి నీరు–చెట్టులో మట్టి అమ్మకాలు, బెల్టుషాపులు, ప్రాజెక్టుల అంచనాలు పెంచి దోచుకుంటున్నా, పోలవరంపై కాగ్‌ ఇచ్చిన రిపోర్టుపై, అమరావతి భూసేకరణ, విశాఖ భారీ భూ కుంభకోణంపై ప్రశ్నించిన దాఖలాలు ఉన్నాయా? 
చంద్రబాబుతో స్నేహబంధం సజావుగా ఉండాలనే ఉద్దేశంతోనే పవన్‌ రాజకీయం చేస్తున్నది నిజంకాదా?. 
స్థానిక సంస్థలు, పార్టీ ఫిరాయింపులు, రాజ్యాంగ వ్యవస్థలను చంద్రబాబు సర్కార్‌ తూట్లు పొడుస్తుంటే ప్రశ్నించాల్సిన బాధ్యత పవన్‌కు లేదా?
మీకు ఇల్లు, స్థలం ఇచ్చిన లింగమనేని వారు దౌత్య నడుపుతూ ఉంటే వాళ్లు ఏమి చెబితే అదే చేస్తావా?
బాబే నిన్ను (పవన్‌) అడ్డంపెట్టి నాటకాలు ఆడుతున్నట్టు జనం అనుకుంటున్నారు. అది నిజమా? కాదా?
పన్నులు ఎగ్గొట్టిన వాళ్లపై ఐటీ దాడులు చేస్తుంటే నీవు నోరు మెదపకపోవడానికి కారణం నీ వాళ్లకు ఉపయోగపడుతుందనా?
సీబీఐని రాష్ట్రంలోకి రానివ్వనని సీఎం అంటుంటే అది మంచిది కాదని ఎందుకనలేదు?
రూ.6వేల కోట్ల ప్రజాధనాన్ని కొల్లగొట్టిన సుజనాకి ఈడీ ఇస్తే ఇప్పటి దాకా ఎందుకు నోరు విప్పలేదు?
గత నెల 25న వైఎస్‌ జగన్‌పై హత్యాయత్నం జరిగితే దానిపై సమగ్ర విచారణ జరపాలని ఎన్నడైనా ముఖ్యమంత్రిని డిమాండ్‌ చేశావా? దాన్ని కోడికత్తి డ్రామా అన్నప్పుడైనా ప్రజాజీవితంలోకి వస్తున్న పవన్‌ కళ్యాణ్‌ ఖండించాల్సిన పని లేదా? చంద్రబాబుకు కోపం వస్తుందని మాట్లాడడం లేదా?
జనసేనను పిల్ల టీడీపీగా భావించాలా? బాబు రుణమాఫీ చేయకపోయినా, కాపుల్ని బీసీల్లో చేర్చకపోయినా పవన్‌ మాట్లాడలేదన్నది నిజంకాదా?
నాలుగేళ్లు చంద్రబాబును ఎందుకు పొగిడారో, ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారో పవన్‌ చెప్పాలి? ఇద్దరి మధ్య అవినాబంధం లేకుండానే చంద్రబాబు పంపిన ప్రత్యేక హెలికాఫ్టర్లు, విమానాలలో ఎందుకు తిరిగారు? రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, అక్రమాలపై మాట్లాడకపోవడం అంటే బాబుకు ఆమోద ముద్ర వేస్తున్నట్టు కాదా?
టీడీపీ అన్యాయాలు, అక్రమాలపై నాలుగున్నర ఏళ్లుగా వైఎస్సార్‌సీపీ పోరాడుతుంటే సమర్థించాల్సింది పోయి వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేస్తావా?
రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించిన ముఖ్యమంత్రిని వదిలి ప్రజల కోసం పోరాడుతున్న ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌పై విమర్శలు చేయడం ఎందుకో ఆత్మవిమర్శ చేసుకో అంటూ పవన్‌కు ఉమ్మారెడ్డి సూచించారు.  

జనసేన టిక్కెట్లు బాబే ఇస్తారేమో!
రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ రహస్య మిత్రుడని, వచ్చే ఎన్నికల్లో జనసేన టిక్కెట్లను టీడీపీ అధినేత చంద్రబాబు ఇచ్చినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే కన్నబాబు విమర్శించారు. ప్రజలు కష్టపడి బ్యాంకుల్లో దాచుకున్న డబ్బు రూ. 6,700 కోట్లను దోచుకున్న సుజనా చౌదరి లాంటి వాళ్ల మోసాన్ని ఖండించడానికి కూడా పవన్‌ కళ్యాణ్‌కు నోరు రావడం లేదా? అని ప్రశ్నించారు. హైదరాబాద్‌లోని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆదివారం కన్నబాబు మీడియాతో మాట్లాడారు. టీడీపీ దోపిడీకి సాక్ష్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. రాష్ట్రంలోకి సీబీఐని ఎందుకు రానివ్వనని చంద్రబాబు చెప్పారో, సీబీఐ, ఈడీ అంటే ఎందుకు కంగారు పడుతున్నారో సుజానా చౌదరి కుంభకోణం వెలుగులోకి వచ్చిన తర్వాత ప్రజలకు అర్థమవుతోందన్నారు.

126 డొల్ల కంపెనీలతో ప్రజల సొమ్మును టీడీపీ ఎంపీ దోపిడీ చేసినట్టు అంకెలు, సంఖ్యలతో సహా బయటకు వస్తుంటే దాన్ని పట్టించుకోకుండా.. తూర్పుగోదావరి జిల్లాలో వైఎస్‌ జగన్‌ను పవన్‌ విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. మద్యం ఏరులై పారుతున్నా, మైనింగ్‌ అక్రమాలు యథేచ్ఛగా సాగుతున్నా పట్టించుకోకుండా రాజకీయం చేస్తావా పవన్‌ అని ప్రశ్నించారు. 2019 ఎన్నికల్లో టీడీపీకి మేలు చేసేందుకే ఆ పార్టీతో విడిపోయినట్టుగా నమ్మించడానికి ప్రయత్నాలు చేస్తున్నారని పవన్‌పై మండిపడ్డారు. కోట్ల రూపాయలు విలువ చేసే ఎకరం భూమిని రూ. 20 లక్షలకే లింగమనేని రమేష్‌ జనసేన అధినేత పవన్‌కు ఎందుకిచ్చారో ప్రజలు అర్థంచేసుకున్నారని, పవన్‌ నిర్మాత ఎవరో తేలిపోయిందని వివరించారు. ఇవన్నీ మరిచి ఎవరి మీదనో బురద జల్లే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. కానిస్టేబుల్‌ కొడుకు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నట్లే.. స్కూటర్‌పై తిరిగిన తాను ఎమ్మెల్యే కావాలనుకుంటున్నానని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.   

మరిన్ని వార్తలు