దేశంలో అప్రకటిత అత్యయిక స్థితి

20 Sep, 2018 01:42 IST|Sakshi
గులాంనభీ ఆజాద్‌

నాలుగేళ్లుగా ఇదే పరిస్థితి

ప్రధాని మోదీపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఆజాద్‌ ధ్వజం

రాఫెల్‌ ఒప్పందంతో దేశ రక్షణలో మోదీ రాజీ పడ్డారు

రూ.520 కోట్ల విమానాన్ని రూ.1,670 కోట్లకు కొనేలా ఒప్పందం.. ఈ విషయంలో ఆయనది ఏకపక్ష నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: దేశంలో గత నాలుగేళ్లుగా అప్రకటిత అత్యయిక స్థితి నెలకొందని, ప్రధాని నరేంద్రమోదీ నిరంకుశత్వంతో వ్యవహరి స్తున్నారని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి, రాజ్య సభలో విపక్షనేత గులాంనబీ ఆజాద్‌ ఆరోపిం చారు. ప్రధాని మీడియాను గుప్పిట్లో పెట్టుకుని, విపక్షాలు మాట్లాడింది చూపించకుండా గొంతు నొక్కుతున్నారని విమర్శించారు. గత యూపీఏ ప్రభుత్వం రూ.520 కోట్లకు ఒక రాఫెల్‌ విమానం చొప్పున మొత్తం 126 విమానాల కొనుగోలుకు ఒప్పందం చేసుకోగా, ప్రధాని మోదీ ఏకంగా రూ.1,670 కోట్లకు ఒక విమానం చొప్పున కేవలం 36 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదుర్చుకున్నారని దుయ్యబట్టారు. ఒకే రకమైన విమానాన్ని 300 శాతం అధిక ధరతో కొనుగోలు చేయడం కుంభకోణం కాదా? ప్రజలపై పడిన రూ.41 వేల కోట్ల అదనపు భారానికి బాధ్యులెవరు? అని ప్రశ్నించారు.

టీ కాంగ్రెస్‌ నేతలతో కలిసి బుధవారం ఆయన గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోళ్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం దేశ భద్రత, రక్షణతో రాజీపడిందని విమర్శించారు. పొరుగున ఉన్న చైనా, పాకిస్థాన్‌ నుంచి పొంచి ఉన్న ముప్పును ఎదుర్కొవడానికి 128 యుద్ధ విమానాలు అవసరమని 2007లో వాయుసేన అధిపతి ప్రతిపాదించారని, అప్పటితో పోలిస్తే ఇప్పుడు ముప్పు తీవ్రత ఇంకా పెరిగిందని పేర్కొన్నారు. ఈ పరిస్థితుల్లో రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు సంఖ్యను 128 నుంచి 36కు తగ్గిస్తూ ప్రధాని మోదీ సొంతంగా ఎలా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించారు. ప్రపంచంలో 21 శతాబ్దపు అతిపెద్ద కుంభకోణం రాఫెల్‌ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందమని, దీనిపై జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) వేసి దర్యాప్తు జరిపిస్తేనే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని పేర్కొన్నారు.

 రాఫెల్‌ ఒప్పందంపై ప్రధాని నరేంద్రమోదీ వివరణ ఇవ్వాలని, జేపీసీ ఏర్పాటుచేసి దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ను స్తంభింపజేసినా, ఆయన నోరు మెదపలేదని, జేపీసీ ఏర్పాటు చేయలేదని విమర్శించారు. పార్లమెంటరీ, కార్యనిర్వాహక వ్యవస్థలు విఫలం కావడంతో మరో దారి లేక మీడియా ద్వారా రాఫెల్‌ కుంభకోణాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్తున్నామని అజాద్‌ చెప్పారు. 70 ఏళ్ల దేశ చరిత్రలో తొలిసారిగా ప్రధానమంత్రి విపక్షాల ప్రశ్నలకు సమాధానం ఇవ్వట్లేదన్నారు. నెహ్రు, ఇందిర, వాజ్‌పేయి ఏనాడూ ఇలా చేయలేదని పేర్కొన్నారు. స్వయంగా రాఫెల్‌ ఒప్పందం చేసుకున్న ప్రధాని మోదీ.. సభ లోపల, బయట ఎక్కడా సమాధానం ఇవ్వడానికి ఇష్టపడడంలేదని విమర్శించారు. యూపీఏతో పోలిస్తే 9 శాతం తక్కువ అని న్యాయశాఖ మంత్రి, 20 శాతం తక్కువ అని ఆర్థిక మంత్రి, 40 శాతం తక్కువ అని వాయుసేన అధిపతి అంటారని.. ప్రధాని మోదీకి తప్ప, మరెవరికీ అసలు ధర ఏమిటో తెలియదని ఎద్దేవా చేశారు.

ఎవరికీ చెప్పకుండా సొంతంగా ఒప్పందం...
రక్షణ మంత్రి నేతృత్వంలో వాయుసేన, సైన్యం, నావికాదళం, కోస్ట్‌గార్డ్, డీఆర్‌డీవో, డిఫెన్స్‌ ప్రొడక్షన్స్‌ విభాగాల అధిపతులతో కూడిన డిఫెన్స్‌ అక్విజేషన్‌ కౌన్సిల్‌ 2007లో చేసిన సిఫారసుల ఆధారంగా 126 యుద్ధ విమానాల కొనుగోళ్లకు గత యూపీఏ ప్రభుత్వం 2010లో టెండర్లు నిర్వహించి అతి తక్కువ ధర సూచించిన ఫ్రెంచ్‌ కంపెనీ ‘అస్సాల్ట్‌ ఏవియేషన్‌’తో 2014లో ఒప్పందం కుదుర్చుకుందని అజాద్‌ తెలిపారు. ఎగరడానికి సిద్ధంగా 18 విమానాలను సరఫరా చేయాలని, మిగిలిన 108 విమానాలను ఫ్రెంచ్‌ కంపెనీ పర్యవేక్షణలో హెచ్‌ఏఎల్‌లో తయారుచేయాలని ఒప్పందం చేసుకున్నామని వివరించారు. ఆ తర్వాత అధికారం చేపట్టిన ప్రధాని మోదీ 2015 ఏప్రిల్‌లో ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లి 36 రాఫెల్‌ విమానాల కొనుగోలుకు మరో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆరోపించారు.

డిఫెన్స్‌ అక్విజేషన్‌ కౌన్సిల్, కనీసం కేంద్ర మంత్రివర్గం, సెక్యూరిటీ అఫైర్స్‌ కమిటీ, రక్షణమంత్రి, విదేశాంగ మంత్రిలకు సైతం తెలపకుండా ప్రధాని ఇంత పెద్ద నిర్ణయాన్ని స్వయంగా ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు. ప్రధాని తిరిగి వచ్చిన తర్వాత కేబినెట్‌ ఆమోదం తీసుకున్నారని ఆరోపించారు. హెచ్‌ఏఎల్‌కు బదులు అప్పటికి ఇంకా రిజిస్ట్రర్డ్‌ కాని ఓ ప్రైవేటు కంపెనీ(రిలయన్స్‌ గ్రూపు)కి ప్రయోజనం కలిగించడానికే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నారని ధ్వజమెత్తారు. ప్రధాని 2015 ఏప్రిల్‌లో కొత్త ఒప్పందం కుదుర్చుకుంటే జూన్‌లో పాత ఒప్పందాన్ని రద్దు చేశారని, గ్రామపంచాయతీల్లో జరిగే పనులకు సైతం ఇలా చేయరని అజాద్‌ తప్పుబట్టారు.

హెచ్‌ఏఎల్‌కు అవకాశం ఇచ్చి ఉంటే అత్యాధునిక విమానాల ఉత్పత్తిలో అనుభవం గడించేదని, భవిష్యత్తులో విదేశాల నుంచి విమానాల కొనుగోళ్లకు అవసరం ఉండేది కాదని అభిప్రాయపడ్డారు. కాగా, సీబీఐ, ఈడీ, ఆదాయ పన్ను శాఖలను కేంద్రం కక్షసాధింపు చర్యలకు వాడుకోవడంతో అవి విశ్వనీయత కోల్పోయాయని వ్యాఖ్యానించారు. ఈ విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీనియర్‌ నేతలు కె.జానారెడ్డి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, వీహెచ్, పొన్నం ప్రభాకర్, జీవన్‌రెడ్డి, షబ్బీర్‌ అలీ తదితరులు పాల్గొన్నారు.

సుబ్బరామిరెడ్డికి అజాద్‌ పరామర్శ...
విలేకరుల సమావేశం అనంతరం అజాద్‌.. గాంధీభపన్‌లో టీ కాంగ్రెస్‌ ముఖ్య నేతలతో భేటీ అయి తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. అనంతరం ఇటీవల ఆపరేషన్‌ చేయించుకున్న కాంగ్రెస్‌ సీనియర్‌ నేత సుబ్బరామిరెడ్డి నివాసానికి వెళ్లి ఆయన్ను పరామర్శించారు. తర్వాత షబ్బీర్‌ అలీ మనవడి మొదటి పుట్టినరోజు వేడుకలకు హాజరై, రాత్రికి పార్క్‌ హయత్‌కు హోటల్‌కు వెళ్లి బస చేశారు. గురువారం గాంధీభవన్‌లో మరోసారి టీ కాంగ్రెస్‌ నేతలతో ఆయన సమావేశమవుతారు

>
మరిన్ని వార్తలు