జగన్‌ పాదయాత్ర చరిత్రాత్మకం

5 Jan, 2019 04:33 IST|Sakshi

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ వెల్లడి  

చంద్రబాబు పాలనంతా కుంభకోణాలమయం 

శ్వేతపత్రాలపై చర్చకు ప్రభుత్వం సిద్ధమా?  

సాక్షి, విశాఖపట్నం: వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కొనసాగిస్తున్న ప్రజాసంకల్ప యాత్ర నిజంగా చరిత్రాత్మకమని, ఇలాంటి పాదయాత్రను తాను గతంలో ఎన్నడూ చూడలేదు.. వినలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ చెప్పారు. వేల కిలోమీటర్లు నడవడం, వందల సభల్లో మాట్లాడడం, కోట్ల మందితో మమేకం కావడం నిజంగా గొప్ప విషయమని అన్నారు. ఇంతటి ప్రజాస్పందన లభిస్తున్న పాదయాత్రను ఇంతవరకు దేశంలో ఏ నాయకుడూ చేయలేదని పేర్కొన్నారు. ఉండవల్లి అరుణ్‌కుమార్‌ శుక్రవారం విశాఖ జర్నలిస్ట్‌ ఫోరం(వీజేఎఫ్‌) ఆధ్వర్యంలో విశాఖపట్నం ప్రెస్‌క్లబ్‌లో మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమంలో మాట్లాడారు. జగన్‌ పాదయాత్ర ప్రభావం రానున్న ఎన్నికల్లో కచ్చితంగా ఉంటుందన్నారు.

రాష్ట్రంలో ప్రస్తుతం వైఎస్సార్‌సీపీకి అనుకూల వాతావరణం ఉందని స్పష్టం చేశారు. దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డిపై ప్రభుత్వంలోని కొందరు చేసిన అవినీతి ఆరోపణలపై తాను ఇప్పటికీ చర్చకు సిద్ధంగా ఉన్నానన్నారు. వారి దగ్గర ఆధారాలు ఉంటే తీసుకురావాలని, కాదని తాను నిరూపిస్తానని సవాల్‌ విసిరితే ఎవరూ స్పందించలేదని పేర్కొన్నారు. వైఎస్‌ జగన్‌పై జరిగిన హత్యాయత్నం కేసును న్యాయస్థానం ఎన్‌ఐఏకు అప్పగించడంపై ఉండవల్లి స్పందిస్తూ... ఈ కేసులో ‘సిట్‌’ విచారణ సందేహాలకు తావిచ్చిందని, హైకోర్టు ఈ కేసును ఎన్‌ఐఏకు అప్పగించడం ద్వారా వైఎస్సార్‌సీపీ చేస్తున్న వాదన నిజమని తేలిందని అభిప్రాయపడ్డారు.  

మేలో నీళ్లిస్తామంటూ అబద్ధాలు 
పోలవరం ప్రాజెక్టు నుంచి మే నెలలో నీరు ఇస్తామని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందని ఉండవల్లి పేర్కొన్నారు. మేలో గోదావరిలో ఇన్‌ఫ్లో ఉండదని, ఒకవేళ వరదలొచ్చినా గ్రావిటీ ద్వారా నీరివ్వడం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదని తేల్చిచెప్పారు. చంద్రబాబు మళ్లీ అధికారంలోకి వస్తారో రారో తెలియదని, అందుకే నోటికొచ్చిన ఆబద్ధాలు చెబుతున్నారని మండిపడ్డారు. చంద్రబాబు పాలన మొత్తం కుంభకోణాలమయంగా మారిపోయిందని ధ్వజమెత్తారు.  

మైండ్‌ గేమ్‌ ఆడుతున్న చంద్రబాబు 
పవన్‌ కల్యాణ్‌ విషయంలో చంద్రబాబు మైండ్‌గేమ్‌ ఆడుతున్నారని ఉండవల్లి ఆరోపించారు. నిన్నమొన్నటి వరకు మోదీతో పవన్‌ జతకట్టాడని ఆరోపించిన ఆయన ఇప్పుడు తనతో కలిసి రావాలని పిలుపునివ్వడం వెనుక మైండ్‌గేమ్‌ ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల తర్వాత మళ్లీ టీడీపీ–బీజేపీ కలిసిపోయినా ఆశ్చర్యపోనవసరం లేదని చెప్పారు. కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చినా రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చే అవకాశం లేదన్నారు. 

అటెండర్‌ను పంపినా చర్చకు సిద్ధం  
సీఎం చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాల్లో అసత్యాలే ఉన్నాయని ఉండవల్లి విమర్శించారు. ఆ శ్వేతపత్రాలపై చర్చకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు వెనుకడుగు వేస్తోందో అర్థం కావడం లేదన్నారు. ప్రభుత్వ ప్రతినిధిగా అటెండర్‌ను పంపినా తాము చర్చకు సిద్ధమేనని తేల్చిచెప్పారు. రోజుకో సబ్జెక్టుపై చర్చిద్దామని, చంద్రబాబు విడుదల చేసిన శ్వేతపత్రాల్లో ఉన్నవి వాస్తవాలే అయితే తన తప్పును ఒప్పుకొని క్షమించమని కోరుతానని తెలిపారు. 

మరిన్ని వార్తలు