‘హెరిటేజ్‌పై ఉన్న శ్రద్ద ప్రాజెక్టులపై లేదు’

25 Sep, 2018 12:38 IST|Sakshi
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ (ఫైల్‌ ఫోటో)

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

సాక్షి, రాజమహేంద్రవరం: పోలవరం పనుల విషయంలో సీఎం చంద్రబాబు నాయుడు ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావటం లేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ అనుమానం వ్యక్తం చేశారు. మంగళవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ప్రాజెక్టుల విషయంలో టీడీపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలవరం ప్రాజెక్టు వచ్చే ఏడాది వరకు పూర్తి కావడం కష్టమని కాగ్‌ తేల్చిచెప్పిందని.. అయినప్పటికీ  కాంట్రాక్టర్ల జేబులు నింపడానికి రెట్టింపు పేమెంట్లు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు.

పట్టిసీమ కాంట్రాక్టర్లకు 22 శాతం అదనంగా ఎందుకు ఇచ్చారో సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. మార్చి 31కి ప్రాజెక్టు పనులు పూర్తి చేయాలని నిబంధన ఎందుకు పెట్టుకున్నారు. కాగ్‌ కూడా ఇదే విషయాన్ని ప్రశ్నించిందన్నారు. థర్డ్‌ పార్టీతో పోలవరం పనుల క్వాలిటీ ఎందుకు చెక్‌ చేయించడం లేదని అడిగారు. హెరిటేజ్‌ పనుల మీద పెట్టిన శ్రద్ద పోలవరం పనుల మీద పెట్టాలని చురకలు అంటించారు.

ప్రతీ పథకంలోనూ అవినీతే
టీడీపీ ప్రభుత్వం పేద ప్రజల ఆకలి తీర్చే ఉద్దేశంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టిన అన్న క్యాంటీన్‌లలో అడుగడుగునా అవినీతి జరిగిందని అరోపించారు. ఆదరణ పథకం కూడా అవినీతి మయమేనని తెలిపారు. ఏపీ ప్రణాళిక సంఘం ఉపాద్యక్షుడు కుటుంబరావు అంగీకరిస్తే పోలవరం, ఆదరణ, అన్న క్యాంటీన్లపై చర్చకు సిద్దమని సవాలు విసిరారు. చంద్రబాబు తీసుకునే ప్రతీ నిర్ణయంలో కుటుంబరావు పాత్ర ఉంటుందన్నారు. గోదావరి పుష్కర మరణాల గురించి సమగ్ర విచారణకు ఆదేశిస్తూ సోమయాజులు కమిషన్‌ను ఆనాడు టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. కానీ సోమయాజులు రిపోర్టు మీద సంతకం మాత్రమే పెట్టారని, మిగతా స్కిప్టు వేరేవారు రాశారన్నారు. 

మరిన్ని వార్తలు