జీవోతో రాష్ట్ర ప్రభుత్వ పరువు పోయింది  

17 Nov, 2018 03:53 IST|Sakshi

సీబీఐ, ఈడీ, ఐటీ విచారణంటే వణుకెందుకు?

చంద్రబాబుకు మాజీ ఎంపీ ఉండవల్లి ప్రశ్న 

రాష్ట్రంలో సీబీఐ విచారణకు అనుమతి లేదనే జీవో హాస్యాస్పదం

రాష్ట్రసర్కారుపై అవినీతి ఆరోపణల నేపథ్యంలో ఈ జీవో జారీ అనుమానాలకు తావిస్తోంది

సాక్షి, రాజమహేంద్రవరం: సీబీఐ, ఈడీ, ఐటీ విచారణ సంస్థలంటే సీఎం చంద్రబాబు ఎందుకు గజగజ వణుకుతున్నారని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. రాష్ట్ర భూభాగ పరిధిలో సీబీఐ విచారణ చేసేందుకు అనుమతి లేదంటూ దేశంలోనే మొదటిసారిగా జీవో జారీ చేసిన సీఎంను ఈయన్నే చూస్తున్నామన్నారు. మేము అవినీతికి పాల్పడతాం.. మాపై విచారణ జరపకూడదన్న విధంగా సీఎం జీవో జారీ చేసిన తీరును ఆయన తప్పుపట్టారు. రాష్ట్రప్రభుత్వంపై వస్తున్న అవినీతి ఆరోపణలు, ఇతర ఆరోపణల నేపథ్యంలో ఈ జీవో జారీ చేయడం పలు అనుమాలకు తావిస్తోందన్నారు. ఉండవల్లి తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో శుక్రవారం విలేకర్లతో మాట్లాడారు. రాష్ట్రం జారీ చేసిన జీవో హాస్యాస్పదమైందన్నారు. కేంద్రప్రభుత్వ సంస్థలమీద, రాష్ట్రప్రభుత్వం కోరితే రాష్ట్ర వ్యవహారాలపై, న్యాయస్థానాల ఆదేశాల మేరకు ఎక్కడైనా విచారణ జరిపే హక్కు సీబీఐకు ఉంటుందని స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాదులు ఆ జీవోను వాడిపడేసే(టిష్యూ) పేపర్‌తో సమానమంటున్నారని చెప్పారు.

మంచోళ్లయితే పోలీసులు వస్తే ఇబ్బందేమిటి? 
మా ఊర్లో అందరూ మంచోళ్లే.. పోలీసులు మా ఊరికి రావాల్సిన అవసరం లేదంటే ఎలా? అంటూ ఉండవల్లి సీఎం తీరును తప్పుపట్టారు. ఊర్లో అందరూ మంచివాళ్లయితే పోలీసులొచ్చి మీ ఇంట్లో ఉన్నా ఇబ్బందేముంటుందన్నారు. వ్యాపారాలు చేసే టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులపై ఐటీ సోదాలు చేస్తే తనపై దాడి చేసినట్లుగా సీఎం ఎలా మాట్లాడతారని ప్రశ్నించారు. కోటీశ్వరులపై దాడులు జరిగితే వచ్చే నష్టం ఏమిటన్నారు. చంద్రబాబు తన వెనకున్న కోటీశ్వరుల తరఫునా? లేక సామాన్య ప్రజల పక్షమా? చెప్పాలన్నారు. సెక్షన్‌ 6 ఏమి చెబుతుందో తెలుసుకోకుండా జారీ చేసిన జీవో వల్ల రాష్ట్రప్రభుత్వం పరువుపోయిందన్నారు. విచారణ చేస్తామంటే తొడకొట్టి ఆహ్వానించాలిగానీ మావాళ్లను బెదిరిస్తున్నారని మాట్లాడుతుంటే ప్రజలు నవ్వుతున్నారన్నారు.

మీరే కోర్టులని జీవో ఇవ్వండి... 
గతంలో రాజకీయ కారణాలతో సీబీఐ విచారణకు ప్రభుత్వాలు ఆదేశించినా.. సీబీఐ విచారణపై ప్రజల్లో నమ్మకం ఉందని ఉండవల్లి అన్నారు. వైఎస్‌ జగన్‌పై కాంగ్రెస్, టీడీపీ కేసులు వేశారని, చంద్రబాబుపైనా విచారణకు ఆదేశించాలని వైఎస్‌ విజయమ్మ కోరితే కోర్టుల ద్వారా ఆ విచారణ నుంచి బయటపడ్డారని గుర్తు చేశారు. మాకు కోర్టులు అవసరం లేదు, మా ఎమ్మెల్యేలే కోర్టు, లోకేష్‌ అప్పీల్‌ కోర్టు, చంద్రబాబు సుప్రీంకోర్టు అని జీవో జారీ చేయిస్తే సరిపోతుందని ఎద్దేవా చేశారు. ఈ దేశంలో రాజ్యాంగం ఉందన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని హితవు పలికారు.

అప్పుడు చేసిన తీర్మానాలేమయ్యాయి?
నాలుగున్నరేళ్లు కాపురం చేసి పిల్లల్ని కని, ఏదో మనస్పర్థలు వస్తే కోర్టుకెళ్లిన భార్య.. తన భర్త నపుంసకుడు అన్న రీతిలో సీఎం చంద్రబాబు ప్రధాని మోదీ పట్ల వ్యవహరిస్తున్నారని ఉండవల్లి అభివర్ణించారు. మోదీ ప్రధాని అయ్యాక భారతదేశం ప్రపంచంలో వెలిగిపోతోందంటూ రాష్ట్ర అసెంబ్లీలో చేసిన తీర్మానాలు ఇప్పుడేమయ్యాయని ప్రశ్నించారు. సీఎం స్థాయి వ్యక్తి బ్యాలెన్స్‌గా మాట్లాడాలన్నారు. మీరు తప్పు చేయకుండా విచారణ సంస్థలను పంపితే మోదీ మిగులుతాడా? మోదీ ఏమి చేయకుండానే ఎందుకు కంగారు పడుతున్నారని ప్రశ్నించారు. కేంద్రం అనుకుంటే తన పరిధిలోని పోలవరం ప్రాజెక్టు అవినీతిపై విచారణకు ఆదేశించవచ్చన్నారు. చంద్రబాబు పాలన సమర్థతను పక్కనపెడితే ఆయన రాజకీయ సమర్థతపై ఎవరికీ అపనమ్మకం లేదన్నారు. దేశంలో అన్ని పార్టీలతో కలసినవారు ఎవరైనా ఉన్నారంటే అది ఒక్క చంద్రబాబేనని వ్యాఖ్యానించారు. 

మరిన్ని వార్తలు