అమరావతి భూముల విషయంలో త్యాగమేముందీ..?

7 Feb, 2020 10:14 IST|Sakshi

చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ కోసం ఇదంతా చేశారు

మార్గదర్శిపై సుప్రీం కోర్టులో కేసు వేశాం 

గ్రామ సచివాలయ వ్యవస్థ మంచి నిర్ణయం 

రాజధాని ఎక్కడున్నా అభివృద్ధి చేయవచ్చు 

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

సాక్షి, రాజమహేంద్రవరం: అమరావతి నిర్మాణం కోసం 33 వేల ఎకరాలు సేకరించిన భూముల వ్యవహారం రియల్‌ ఎస్టేట్‌ కోసం ఒప్పంద ప్రాతిపదికగా చేసిందేనని, చంద్రబాబు దీనికి త్యాగం అని పేరు పెట్టడం విచిత్రంగా ఉందని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ పేర్కొన్నారు. గురువారం తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రైతులు మంచి విలువ వస్తుందని భూములు ఇచ్చారని, దానిని చంద్రబాబు త్యాగంగా మాట్లాడటం బాగోలేదన్నారు. త్యాగానికి ప్రతిఫలం ఉండదన్నారు. రైతులు భూములు ఇచ్చేందుకు ప్రభుత్వంతో అగ్రిమెంట్‌ చేసుకున్నారన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన గ్రామ సచివాలయాల ఆలోచన ఎంతో మంచిదన్నారు. చదవండి: మార్గదర్శి కేసుపై త్వరలో పుస్తకం: ఉండవల్లి

రాష్ట్ర రాజధాని ఎక్కడున్నా ఫర్వాలేదని అన్నారు. 2014లో టీడీపీ ఎమ్మెల్యేలు నిండు శాసనసభలో మాట్లాడుతూ రాజధాని విషయంలో హైదరాబాద్‌ లాంటి తప్పు చేయమని, డీ సెంట్రలైజ్‌ చేస్తామని ప్రకటించారని, దానిపై శాసన సభలో చర్చ సాగించాలన్నారు. రామోజీరావు విషయంలో సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది మార్గదర్శి కేసుకు, తనకు ఏవిధమైన సంబంధం లేదన్నారు. బహిరంగంగా జరిగిన సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు మాత్రమే చేశానని, దీంతో పోలీసులు రామోజీపై కేసు పెట్టారన్నారు. హైకోర్టులో 31 డిసెంబర్‌ 2018న కేసు కొట్టేశారని, దీనిపై రెండు ప్రభుత్వాలకు లేఖ రాసినా స్పందించలేదన్నారు.

తాను ఫిర్యాదు చేసిన కేసులో ఏవిధమైన తీర్పు లేకుండా కేసు కొట్టివేయడంతో సుప్రీంకోర్టును ఆశ్రయించానన్నారు. ఈ కేసు వ్యవహారంలో వచ్చే సోమవారం కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. దేశంలో ఈ విధమైన ఆర్థిక నేరాలకు పాల్పడిన వారంతా జైళ్లలో ఉన్నారన్నారు. రామోజీ రావు వేల కోట్లరూపాయలు ఉండబట్టి కేసును పుష్కర కాలం పాటు నెట్టుకు వచ్చారన్నారు. ఈ కేసు వ్యవహారం ట్రైల్‌ కోర్టులో ఒక విధంగానూ, సుప్రీంకోర్టులో ఒక విధంగా రామోజీ ప్రతినిధులు పిటీషన్లు దాఖలు చేశారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా సాగిన ఈ కేసు వ్యవహారంపై 400 పేజీల పుస్తకం రాస్తున్నానని, ఇది నేటితరం న్యాయవాదులకు ఉపయోగపడుతుందన్నారు.

మరిన్ని వార్తలు