ఉండల్లి అరుణ్‌కుమార్‌ ఘాటు వ్యాఖ్యలు

4 Jan, 2019 12:36 IST|Sakshi

సాక్షి, విశాఖపట్నం: మే నెలలో పోలవరం నీరు ఇస్తామని చెబుతున్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుకి ఆ సమయంలో గోదావరిలో నీళ్లు ఉండవన్న సంగతి తెలియదా అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ ప్రశ్నించారు. గోదావరి నుంచి గ్రావీటితో నీళ్లు రావని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం విశాఖలో మీట్‌ ది ప్రెస్‌లో ఆయన మాట్లాడుతూ.. లక్షా 45వేల కోట్ల రూపాయలతో పరిశ్రమలు ప్రారంభమని ప్రభుత్వం చెబుతున్నదంతా అబద్ధమేనని అన్నారు. ఇప్పటి వరకు కడుతున్నవి తాత్కాలిక భవనాలేనని.. ఆంధ్ర ప్రజలకు ఎందుకు ఈ ఖర్మ అని వ్యాఖ్యానించారు. (చంద్రబాబుకు ఉండవల్లి సూటి ప్రశ్న)

శ్వేతపత్రాలపై చర్చకు ప్రభుత్వం తరఫున ఎవరు స్పందించడం లేదన్నారు. మోసం చేయడానికే శ్వేతపత్రాలు అంటే ఎవరేం చేసేది లేదని వ్యాఖ్యానించారు. శ్వేతపత్రాలపై ఐఏఎస్‌ అధికారులతో చర్చ పెట్టాలని కోరారు. ప్రభుత్వ అధికారులు ఎవరు వచ్చినా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు పేర్కొన్నారు. పోలవరం, ఇరిగేషన్‌, ఆదరణ, ఎల్‌ఈడీ బల్బులు, అన్నా క్యాంటీన్‌ సహా వేటిపైనైనా చర్చకు సిద్ధంగా ఉన్నట్టు స్పష్టం చేశారు. 600 రూపాయలు ఖరీదు చేసే ఎల్‌ఈడీ బల్బు అని.. 7వేల రూపాయలు ఖరీదు చేసే సెల్‌ఫోన్‌ను 12వేల రూపాయలని శ్వేత పత్రంలో చూపారని అన్నారు. ప్రతి రంగంలో జరుగుతున్నా అవినీతి అద్దం పట్టేలా కనిపిస్తున్నా.. చంద్రబాబు ఎందుకు పట్టించుకోరని ప్రశ్నించారు. ఆరోపణలపై స్పందించే పరిస్థితిలో కూడా ప్రభుత్వం లేదని అన్నారు. 

మరిన్ని వార్తలు