రాజధాని కడుతున్నారా? వ్యాపారం చేస్తున్నారా?

11 Sep, 2018 12:26 IST|Sakshi

ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఉండవల్లి

సాక్షి, రాజమండ్రి : సీఎం చంద్రబాబు నాయుడు అమరావతిలో రాజధాని నిర్మిస్తున్నారా? లేక వ్యాపారం చేస్తున్నారా? అని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ ప్రశ్నించారు. అమరావతి బాండ్లపై అధిక వడ్డీ ఇవ్వాల్సిన అవసరం ఏంటని ప్రశ్నించారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా అమరావతి బాండ్లున్నాయన్నారు. హడ్కో తక్కవ వడ్డీకి రుణం ఇస్తున్నా ఎందుకు తీసుకోలేదో చెప్పాలన్నారు. సీఆర్డీఏను కంపెనీగా మార్చేసి అప్పులు తెచ్చుకుంటే బాగుంటుందని ఎద్దేవా చేశారు.

గవర్నర్‌ పాలనలో కూడా ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం అప్పు తీసుకుందన్నారు. అమరావతి బాండ్లు, పోలవరం, పట్టిసీమతో సహా రాష్ట్రంలో జరిగిన పంపింగ్‌ స్కీమ్స్‌‌, బలహీన వర్గాల కోసం నిర్మిస్తున్న ఇళ్లు, సీఎం చెప్పిన 18 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు అనే ఆరు అంశాలపై ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు తనతో చర్చకు సిద్దమా అని సవాల్‌ విసిరారు. వీటిపై తను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెబితే అక్కడే క్షమాపణలు చెప్పి మళ్లీ ఎన్నికల వరకు మాట్లాడనన్నారు. చదరపు గజానికి రూ.1500లతో నిర్మిస్తున్న ఇళ్లను ప్రభుత్వం మూడువేలకు కట్టబెడుతుందన్నారు. ఇక సీఎం చెప్పిన 18 లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలు ఎక్కడ ఉన్నాయో చూపించాలన్నారు. అసెంబ్లీలో సీఎం ఏమో పరిశ్రమలు వచ్చాయంటారని, రాజ్యసభలో మాత్రం సుజనా చౌదరి ఒక్క పరిశ్రమ రాలేదంటారని తెలిపారు. హెరిటేజ్‌ 30 ఏళ్ల చరిత్ర చూస్తే ఎన్ని డెయిరీలు మూతపడ్డాయో తెలుస్తుందన్నారు. 

మరిన్ని వార్తలు