పోలవరం, పట్టిసీమపై చర్చకు సిద్ధం

16 Sep, 2018 04:38 IST|Sakshi

మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌

సాక్షి, రాజమహేంద్రవరం:  పోలవరం, పట్టిసీమ, అమరావతి బాండ్లు, పేదల ఇళ్ల నిర్మాణానికి అధిక ధర, రూ.18 లక్షల కోట్ల పెట్టుబడులు ఎక్కడున్నాయి.. తదితర అంశాలపై చర్చకు తాను ఎప్పుడు.. ఎక్కడకు రావాలో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చెరుకూరి కుటుంబరావు చెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌ కోరారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. అమరావతి బాండ్లలో అవినీతి జరిగిందన్నది తన వాదన కాదని, 10.36 శాతం ఎక్కువ వడ్డీకి ఎందుకు తీసుకున్నారనేదే తన వాదనని పునరుద్ఘాటించారు. వడ్డీ 8 శాతానికి మించి తీసుకోకూడదని జీవో జారీచేసిన ఆరు నెలలకే 10.36 శాతానికి ఎలా తీసుకుంటారని ప్రశ్నించారు.  

చెల్లింపులపై ఆడిట్‌ అభ్యంతరాలివిగో..
రాజధాని మీటింగ్‌కు మోదీ వచ్చినప్పుడు రూ.4.98 లక్షల ఖర్చవగా.. అందులో కాంట్రాక్టర్‌ ప్రాఫిట్‌ అని రూ.70 లక్షలు ఇచ్చినట్టు రాశారని తెలిపారు. బిల్డింగ్‌లు కట్టడం కోసం రూ.53.74 కోట్లకు షెడ్యూల్‌ ఆఫ్‌ రేట్లు రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిందని, అయితే పల్లోంజి కంపెనీ రూ.103.42 కోట్లకు, ఎల్‌ అండ్‌ టీ అయితే రూ.106 కోట్లు ఇస్తే చేస్తామని చెప్పాయని.. నిబంధనల ప్రకారం ఐదు శాతం ఎక్కువ వస్తే టెండర్లు రద్దు చేయాల్సి ఉందన్నారు. కానీ వాళ్లను బేరానికి పిలిచి 25 శాతం అదనంగా చెల్లించేందుకు రెండు పనులు, 26 శాతం అదనానికి ఒక పని కేటాయించడంపై ఆడిట్‌ కార్యాలయం ప్రశ్నించిన విషయాన్ని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టులో పనులు చేయకుండా.. చేసినట్లు చూపించి రూ.101 కోట్లు చెల్లించారని 2018 జూలై 10న పోలవరం పే అండ్‌ అకౌంట్‌ అధికారి.. ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌కు లేఖ రాసిన విషయం నిజం కాదని కుటుంబరావు చెప్పాలన్నారు. 

మరిన్ని వార్తలు