సాయంత్రం పవన్‌ ఫోన్‌ చేశారు: ఉండవల్లి

7 Feb, 2018 20:45 IST|Sakshi

సాక్షి, రాజమండ్రి: సినీ నటుడు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ మళ్లీ మీడియా ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇన్నాళ్లూ అధికార టీడీపీని, కేంద్రంలోని బీజేపీ పల్లెత్తు మాట కూడా అనని పవన్‌.. ఇప్పుడు ప్రత్యేక హోదా కోసం జేఏసీని ఏర్పాటు చేయాలని భావిస్తున్నట్టు చెప్పుకొచ్చారు. రాజకీయ అనుభవం లేకపోవడం వల్లే గతంలో బీజేపీకి, టీడీపీకి మద్దతు ఇచ్చానని చెప్పిన పవన్‌..  ఉన్నట్టుండి కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌కుమార్‌కు ఫోన్‌ చేసి మాట్లాడారు. తాను ఏర్పాటు చేస్తున్న జేఏసీకి అండగా నిలబడాలని ఆయన కోరారు. దీనిపై ఉండవల్లి అరుణ్‌కుమార్‌ మీడియాతో స్పందిస్తూ.. 'సాయంత్రం పవన్ కల్యాణ్ ఫోన్ చేశారు. ఈ నెల 11న హైదరాబాద్‌లో భేటీ అవ్వబోతున్నాం' అని తెలిపారు.

'నేను మేధావిని కాదు. నాకు ఎలాంటి ఆశయాలు లేవని పవన్‌కు చెప్పాను. ప్రత్యేక హోదా సాధన కోసం కలిసి పనిచేయాలని ఆయన నన్ను కోరారు' అని తెలిపారు. తనకు ఎలాంటి పరిచయం లేని పవన్ తన పేరును ప్రకటించడం గౌరవంగా భావిస్తున్నానని చెప్పారు. జేఏసీ ఏర్పాటు, విధివిధానాలు పవన్ భేటీ తర్వాత తేలుతాయని చెప్పారు.

మరిన్ని వార్తలు