‘అమరావతి శిల్పి కాదు.. అమరావతి దొంగ’

5 Dec, 2019 16:17 IST|Sakshi

సాక్షి, అమరావతి: చంద్రబాబు నాయుడికి రాజధానిపై  ప్రేమ ఉంటే అక్కడ శాశ్వత భవనం ఎందుకు నిర్మించలేదని వైఎస్సార్‌ కాంగ్రెస్‌పార్టీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి మండిపడ్డారు. ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ.. 40 ఏళ్ల అనుభవం ఉన్న చంద్రబాబు పై రాళ్లు ఎందుకు పడుతున్నాయని విమర్శించారు. ఏడాది అనుభవం ఉన్న ఎమ్మెల్యేగా తనపై  రాజధాని ప్రజలు పూల వర్షం కురిపించారని పేర్కొన్నారు. చంద్రబాబుకు ధైర్యంలేక అఖిలపక్ష సమావేశం తుళ్లూరులో నిర్వహించలేక విజయవాడలో పెట్టారని శ్రీదేవి ఎద్దేవా చేశారు. తాము 119 సంక్షేమ పథకాలతో ప్రజలు ముందుకు వెళ్తున్నామని, ఎల్లో మీడియాకు ఈ పథకాలు చూసి పక్షవాతం వచ్చిందని ఆమె ధ్వజమెత్తారు. అధికారంలో ఉండగా అమరావతికి గెజిట్ నోటిఫికేషన్ ఎందుకు జారీ చేయలేదని చంద్రబాబును నిలదీశారు.

చంద్రబాబు దళిత ద్రోహి అని.. దళితుల ఎస్సైన్డ్ భూములకు అన్యాయం చేశారని తీవ్రంగా మండిపడ్డారు. దళితుల్ని పక్కన ఏనాడు కూర్చోబెట్టుకోని చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే శ్రవణ్ కుమార్ ఎక్కడ కూర్చున్నారని శ్రీదేవి ప్రశ్నించారు. చంద్రబాబు బీఆర్ అంబేడ్కర్‌ సిద్దాంతాలకు వెన్నుపోటు పొడిచారని విమర్శించారు. అంబేడ్కర్ భారీ విగ్రహం నిర్మాణం చేస్తామని చెప్పి చంద్రబాబు విస్మరించారని ఆమె పేర్కొన్నారు. చంద్రబాబు పోలీస్ వ్యవస్థను నమ్మరని దుయ్యబట్టారు. చంద్రబాబు ఇన్ సైడ్ ట్రేడింగ్‌లో కొట్టేసింది బయటకు వస్తుందని, ఆయన త్వరలో జైలుకు వెళ్లటం ఖాయమన్నారు. చంద్రబాబు పాలనలో అక్రమాల చిట్టా లిమ్కాబుక్ రికార్డులో ఎక్కుతుందని వ్యాఖ్యానించారు. చంద్రబాబును అమరావతి శిల్పి కాదు.. అమరావతి దొంగ అంటున్నారని ఎమ్మెల్యే శ్రీదేవి విరుచుకుపడ్డారు.

మరిన్ని వార్తలు