నిరుద్యోగ భారతం

19 Mar, 2019 09:17 IST|Sakshi

గరిష్ట స్థాయికి నిరుద్యోగ సమస్య

ఈ ఎన్నికల్లో ఎవరికి ఎసరు పెట్టేనో?

విశాల్‌ చౌధరీ. చురుకైన యువకుడు. ఎంబీఏ పూర్తయి రెండేళ్లయింది. ఖాళీగా ఉన్నాడు. గత ఏడాదిలో 50 ఇంటర్వ్యూలకు హాజరయ్యాడు. అయినాఉద్యోగం రాలేదు. అటెండర్‌ పని చేయడానికీ సిద్ధపడ్డాడు. అదీ రాలేదు. చుట్టాలు పక్కాలు ఇప్పుడేం చేస్తున్నావని ప్రశ్నిస్తే జాబు లేదన్న జవాబు చెప్పలేక ఇబ్బందిపడుతున్నాడు. ఆ ఆక్రోశం అంతా ఉద్యోగాలు కల్పించలేని కేంద్ర ప్రభుత్వంపైఆగ్రహంగా మారుతోంది. ఇది కేవలం విశాల్‌ కథ మాత్రమే కాదు.దేశంలోని కోట్లాదిమంది నిరుద్యోగుల వ్యధ. మరి వీరి ఆగ్రహ జ్వాలలుప్రధానమంత్రి మోదీ పీఠాన్ని తాకుతాయా? ఈ ఎన్నికల్లో నిరుద్యోగంఎంత మేరకు ప్రభావితం చేస్తుంది?

ఉద్యోగం.. ఉద్యమం
నిరుద్యోగుల్లో గూడుకట్టుకున్న అసంతృప్తి ఆందోళనల రూపంలో బయటకి వస్తోంది. అదీ కులపరమైన రిజర్వేషన్లు కల్పించాలంటూ రోడ్డెక్కుతున్నారు. గుజరాత్‌లో పాటీదార్లు, మహారాష్ట్రలో మరాఠాలు, హరియాణా, రాజస్తాన్‌లో జాట్లు, ఆంధ్రప్రదేశ్‌లో కాపులు రిజర్వేషన్లుకల్పించాలంటూ చేస్తున్న ఉద్యమాలన్నీ ఉద్యోగాలకోసం చేస్తున్నవే.యూపీఏ పదేళ్ల పాలనలో అంతూదరీ లేకుండా పెరిగిపోయిన నిరుద్యోగంతో నిరాశ నిస్పృహల్లో కూరుకుపోయిన యువతరానికి 2014 ఎన్నికల్లో నరేంద్ర మోదీ ఓ ఆశాదీపంలా కనిపించారు. కోటి ఉద్యోగాలు కల్పిస్తామన్న బీజేపీ ఎన్నికల హామీ మోదీని ప్రధాని పీఠానికి దగ్గర చేసింది. కానీ ఈ అయిదేళ్లలో నిరుద్యోగ సమస్య తగ్గకపోగా పెరిగిపోయింది. పెద్దనోట్ల రద్దుతో చిన్న, మధ్య తరగతి పరిశ్రమలు కుదేలయ్యాయి. గత 40 ఏళ్లలో ఎన్నడూ లేనంతగా నిరుద్యోగం గరిష్ట స్థాయికి చేరిందని 2017–18లో  కేంద్ర ప్రభుత్వ సర్వేలోనే వెల్లడైంది.

నేషనల్‌ శాంపిల్‌ సర్వే సంస్థ ప్రకారం 1977–2012 మధ్యకాలంలో నిరుద్యోగం ఎప్పుడూ 2.6 శాతం దాటలేదు. 2018లో 6.10 శాతానికి చేరుకుని కమలనాథుల్లో ఆందోళన పెంచితే, ఫిబ్రవరి నాటికి ఇది 7.2 శాతంగా మారి మరింత గుబులెత్తిస్తోంది. కేంద్రం అధికారికంగా ఈ సర్వే వివరాలు బయటపెట్టకున్నా.. కొన్ని మీడియా సంస్థలు నివేదికను బట్టబయలు చేయడంతో నిరుద్యోగం ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. కొత్త ఉద్యోగాలు రాకపోగా ఉన్న ఉద్యోగాలు ఊడిపోయే దుస్థితి నెలకొంది. పెద్ద నోట్ల రద్దుతో అసంఘటిత రంగం అల్లకల్లోలమైంది. సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ సర్వే ప్రకారం డిసెంబర్‌ 2017, డిసెంబర్‌ 2018 మధ్య కోటి మందికి పైగా ఉద్యోగాలు కోల్పోయి రోడ్డున పడ్డారని తేలింది. ఏటా 10 లక్షల మంది కొత్త యువకులు డిగ్రీలు చేతపట్టి ఉద్యోగాల కోసం కాళ్లరిగేలా తిరుగుతున్నారు. ఏడాదికి 81 లక్షల ఉద్యోగాల కల్పన జరిగితేనే భారత్‌ నిరుద్యోగ సమస్యను అధిగమించగలదని అంచనా. అన్ని ఉద్యోగాల్ని ఒకేసారి మోదీ సర్కార్‌ సృష్టించగలదా? మోదీ సర్కార్‌ మేకిన్‌ ఇండియా, స్టార్టప్‌ ఇండియా వంటి పథకాలు ఉద్యోగాల కల్పనలో  విఫలమయ్యాయి.

సర్వేలు ఏం చెబుతున్నాయంటే..
నిరుద్యోగ సమస్య ఉత్తరభారతంలో ఉన్నంతగా దక్షిణాదిన లేదు. ఈ ఎన్నికల్లో నిరుద్యోగమే అత్యధిక ప్రభావాన్ని చూపించే అంశమని ఉత్తరాది రాష్ట్రాల్లో 37 శాతం మంది లోక్‌నీతి–సీఎస్‌డీఎస్‌ సర్వేలో అభిప్రాయపడ్డారు. అదే దక్షిణంవైపు వచ్చేసరికి 16 శాతం మంది మాత్రమే నిరుద్యోగ ప్రభావం ఎన్నికల్లో ఉంటుందన్నారు. ఇండియా టుడే–కార్వి సర్వే ప్రకారం ఏకంగా 60 శాతం మంది ఉద్యోగాల కల్పనకు మోదీ సర్కార్‌ చేసిందేమీ లేదని నిందించారు. సీ ఓటరు సర్వేలో 23 శాతం మంది నిరుద్యోగమే ప్రధాన అంశమన్న అభిప్రాయాన్నే వెల్లడించారు. ఓ రకంగా ఈ ఫలితాలు బీజేపీకి నిరాశ కలిగించేవే. బీజేపీ తిరిగి గద్దెనెక్కడానికి ఉత్తరాదినే నమ్ముకుంది. దక్షిణాది రాష్ట్రాల్లో ఆ పార్టీ ఇంకా పట్టు బిగించలేకపోతోంది. గత ఎన్నికల్లో ఉత్తరాది రాష్ట్రాల్లో 151 స్థానాలకు 131 చోట్ల బీజేపీ జయకేతనం ఎగురవేసింది. అందుకే నిరుద్యోగ సమస్యను ఎదుర్కోవడం కమలనాథులకు కఠిన పరీక్షగా మారింది.

ప్రభుత్వ వాదన ఏమిటంటే..
రకరకాల సర్వేలు చెబుతున్నట్టు నిరుద్యోగ సమస్య అంత తీవ్రంగా లేదంటూ కేంద్రం సమర్థించుకునే ప్రయత్నాలే చేస్తోంది. దీనికి ఉదాహరణగా ప్రభుత్వ పీఎఫ్‌ ఖాతాలను పెరగడాన్ని, ముద్ర రుణాలను చూపిస్తోంది. ఎంప్లాయ్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) లెక్కల ప్రకారం 2017 సెప్టెంబర్‌– 2018 నవంబర్‌ మధ్య కాలంలో 73.5 లక్షల మంది కొత్త ఖాతాదారులు వచ్చి చేరారు. అంటే అన్ని ఉద్యోగాలు ఇచ్చినట్టే కదా అన్నది ప్రభుత్వ వాదన. కానీ ఆ వాదనలో పస లేదన్న అభిప్రాయాలున్నాయి. ఎందుకంటే కొందరు ఉద్యోగులు సంస్థలు మారినప్పటికీ మళ్లీ కొత్తగా పీఎఫ్‌ ఖాతా ప్రారంభించాలి. అలా కొత్త ఖాతాలు తెరిచిన వారిలో 24 శాతం మంది ఉద్యోగులు మారిన వారేనని బిజినెస్‌ స్టాండర్డ్‌ చేసిన సర్వేలో తేలింది. ఇక చిన్నతరహా పరిశ్రమల స్థాపన కోసం కేంద్ర ప్రభుత్వం ముద్ర రుణాల్ని మంజూరు చేస్తోంది. ఈ రుణాలు తీసుకున్న వారి డేటా చూస్తే ఎన్డీయే ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పిస్తోందో తెలుస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాదన. అయితే ఆర్‌టీఐ ద్వారా దీనికి సంబంధించి సమాచారం తెలుసుకోవాలని కొందరు ప్రయత్నిస్తే ప్రభుత్వం నుంచి సమాధానం రాలేదు.. నిరుద్యోగ సమస్యను ప్రభుత్వం  బాగా తగ్గించి చూపించే ప్రయత్నాలు చేస్తోంది. పకోడీలు అమ్ముకోవడం కూడా ఒక ఉద్యోగమేనంటూ ప్రధానమంత్రి ఒక టీవీ ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలపై దుమారమే రేగింది. ఇప్పటికే భారత్‌లో ఉద్యోగం చేస్తున్న వారిలో 77 శాతం మంది అతి తక్కువ వేతనాలకు చిన్నా చితకా ఉద్యోగాలు చేస్తున్నవారే కావడంతో కాంగ్రెస్‌ ఈ ఎన్నికల్లో నిరుద్యోగాన్నే అస్త్రంగా చేసుకుంది.

కాంగ్రెస్‌ క్యాష్‌ చేసుకోగలదా?
ఉగ్రవాదం కంటే నిరుద్యోగం భయంకరమైన సమస్య అంటూ రాహుల్‌గాంధీ ఈ అంశాన్ని గట్టిగానే పట్టుకున్నారు. ప్రతీ ఎన్నికల సభలోనూ దానినే ప్రస్తావిస్తున్నారు. మధ్యప్రదేశ్, రాజస్తాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ గెలుపునకు నిరుద్యోగుల ఓట్లే కారణమన్న అంచనాలున్నాయి. అందుకే ఈసారి ఎన్నికల్లో రఫేల్‌ అంశానికి బదులుగా నిరుద్యోగం, రైతు సమస్యలు, గ్రామీణ సంక్షోభాన్నే అస్త్రాలుగా చేసుకోవాలని నిర్ణయించింది. గతంలో పంజాబ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఇంటికో ఉద్యోగం అన్న హామీ ఇస్తే, ఛత్తీస్‌గఢ్‌ ఎన్నికల్లో రూ.2,500 నిరుద్యోగ భృతి ఇస్తామని హామీనిచ్చింది. ఇక మధ్యప్రదేశ్‌ ఎన్నికల్లో ఏ కంపెనీలైనా యువతకు ఉద్యోగాలు కల్పిస్తే వేతనాల గ్రాంట్లు ఇస్తామని హామీ ఇచ్చింది. ఈసారి ఎన్నికల్లో నిరుద్యోగం, గ్రామీణ సంక్షోభం, రైతు సమస్యలన్నింటినీ కలిపి కొట్టేలా ఒక్కటే పరిష్కారంగా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కనీస ఆదాయ పథకాన్ని తాము అధికారంలోకి వచ్చిన వెంటనే అమలు చేస్తామని ఇప్పటికే హామీ ఇచ్చారు. ఎన్నికల సభల్లో పదేపదే ఆ హామీనే ప్రస్తావిస్తూ ప్రతీ కుటుంబానికి నెలవారీ ఆదాయంపై భరోసా ఉంటుందని అంటున్నారు. మరి నిరుద్యోగ యువత ఈసారి ఎటు మళ్లుతారో వేచి చూడాలి.

ఆఫీస్‌బాయ్‌ పోస్టుకు 23 వేల మంది..
భారతీయ రైల్వే గత ఏడాది 63 వేల ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేస్తే ఏకంగా కోటీ 90 లక్షల మంది దరఖాస్తు చేశారు.
మహారాష్ట్రలో ఆఫీస్‌ బాయ్‌ ఉద్యోగాలు అయిదు ఖాళీలు ఉన్నాయంటూ వాంటెడ్‌ ప్రకటన వెలువడితే ఏకంగా 23 వేల మంది పట్టభద్రులు, ఇంజనీరింగ్‌ చదివిన వారు దరఖాస్తు చేశారు.
సెంటర్‌ ఫర్‌ మానిటరింగ్‌ ఇండియన్‌ ఎకానమీ అంచనాలప్రకారం ప్రస్తుతం 3.1 కోట్ల మంది ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్నారు.
35 ఏళ్ల కంటే తక్కువ వయసు ఉన్నవారిలో ఏకంగా 65 శాతం మందికి ఉద్యోగాలు లేక నిరాశా నిçస్పృహల్లో ఉన్నారు.
వరల్డ్‌ బ్యాంకు అంచనాల ప్రకారం ఏడాదికేడాది మహిళా ఉద్యోగులు తగ్గిపోతున్నారు. 2005లో మహిళా ఉద్యోగుల శాతం 38.7 ఉంటే 2017 నాటికి 28.6 పడిపోయింది.
రైల్వేలో నాలుగేళ్లుగా పోస్టులు భర్తీ కాకపోవడంతో ముంబైలో రైల్వే ట్రాక్‌లపై వేలాది మంది చేరి నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ఉద్యోగాలు రావన్న ఆందోళనతో 10 మందికి పైగా ఆత్మహత్య చేసుకున్నారు.  

వీళ్లకి ‘టైమ్‌’ వచ్చిందా?
జనరేషన్‌ టైమ్‌పాస్‌.. ఈ మాట ఎప్పుడైనా విన్నారా. అదేదో సినిమాలో హీరోయిన్‌ అన్నట్టు పనీపాటా లేకుండా ఖాళీగా తిరిగే బ్యాచ్‌ అన్న మాట. ఇంకా సరిగ్గా చెప్పాలంటే.. వీరందరికీ పెద్ద డిగ్రీలు ఉంటాయి. కానీ విద్యలో నాణ్యత ఉండదు. పొట్టపొడిస్తే అక్షరం ముక్క రాదు.  అందుకే చదువుకి తగ్గ ఉద్యోగాలు దొరకవు. అన్ని విద్యార్హతలుండీ నిరుద్యోగులుగా ఉన్నవారిది ఒక వ్య«థ అయితే, వీరిది మరో రకం బాధ. యూపీలోని మీరట్‌లో 2004–05లో కొందరు నిరుద్యోగులంతా కలసి జనరేషన్‌ టైమ్‌పాస్‌ అనే గ్రూప్‌గా ఏర్పడ్డారు. ఊరూరా తిరుగుతూ తమ గోడు వెళ్లబోసుకున్నారు. ప్రభుత్వ విధానాలను దుయ్యబడుతూ వార్తల్లోకెక్కారు. వీళ్ల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఈ ఎన్నికల్లో వీళ్లు కీలకంగా మారనున్నారు. 2004–05లో వీరి సంఖ్య 7 కోట్లు ఉంటే 2017–18 నాటికి 11.6 కోట్లకి చేరుకుంది.

ఉత్తరాదినే ఎక్కువ..
జనరేషన్‌ టైమ్‌పాస్‌ వర్గం ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా నిరాదరణకు  గురవుతోంది. ఉత్తరాది రాష్ట్రాల్లో విద్యలో నాణ్యతా ప్రమాణాలు కనిపించవు. ఆర్యోగ రంగ సేవలు అందుబాటులో ఉండవు. మౌలిక సదుపాయాలు సున్నా. ప్రభుత్వ అధికారుల్లో అవినీతి అలసత్వం ఎక్కువ. ఇవన్నీ వీరికి ఉద్యోగాలు రాకపోవడానికి కారణాలే. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన కులాల వారికి టైమ్‌పాస్‌ ఒక అలవాటుగా మారింది. 2010 వరకు వీరంతా తమ వాయిస్‌ బలంగా వినిపించేవారు. విద్యార్థి రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ, సభలు, సమావేశాలు ఏర్పాటు చేస్తూ ప్రభుత్వ విధానాలను ప్రశ్నించేవారు. ఇటీవల కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం యూనివర్సిటీల్లో రాజకీయాలను కట్టడి చేయడంతో వీరి వాయిస్‌ వినిపించడం లేదు. ఇప్పుడీ జనరేషన్‌ టైమ్‌ పాస్‌ వర్గం లోక్‌సభ ఎన్నికల్లో ఎలాంటి పాత్ర పోషించనుందో చూడాలి.

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు