దళితులపై ‘దేశం’ దాడి

2 Apr, 2019 08:24 IST|Sakshi
దళిత యువకులపై దాడి చేస్తున్న గన్ని వీరాంజనేయులు వర్గీయులు

ప.గో జిల్లా పెదలింగంపాడులో టీడీపీ వర్గీయుల వీరంగం 

సమస్యలపై నిలదీసిన దళిత యువకులను చితకబాదిన వైనం

పలువురికి గాయాలు.. బాధితులకు

వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల పరామర్శ 

సాక్షి ప్రతినిధి, ఏలూరు : ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ టీడీపీ నేతల అరాచకాలు పెచ్చుమీరుతున్నాయి. సమస్యలపై నిలదీశారనే అసహనంతో పశ్చిమగోదావరి జిల్లాలోని ఉంగుటూరు నియోజకవర్గం పరిధిలోని పెదలింగంపాడు గ్రామంలో దళిత యువకులపై టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు వర్గీయులు దాడికి దిగారు. ఈ ఘటన సోమవారం రాత్రి చోటు చేసుకుంది. ఐదేళ్లుగా ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు తమ గ్రామాన్ని పట్టించుకోలేదని, రోడ్లు, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించలేదంటూ పెదలింగంపాడు దళితులు వినతిపత్రమిస్తుండగా ఆయన కాన్వాయ్‌ వెంట వచ్చిన అనుచరులు వారిపై దౌర్జన్యానికి పాల్పడ్డారు. దళిత యువకులపై పిడిగుద్దులు కురిపించారు. వారిని చితకబాదారు. ఈ ఘటనలో పలువురు దళిత యువకులకు గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి..

ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి టీడీపీ అభ్యర్థి గన్ని వీరాంజనేయులు తన కాన్వాయ్‌తో దళితగ్రామమైన పెదలింగంపాడుకు చేరుకున్నారు. ఆ సమయంలో మద్యం మత్తులో ఉన్న ఆయన అనుచరులు జై గన్ని అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. కాన్వాయ్‌ గ్రామంలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్దకు చేరుకోగా.. పలువురు దళిత యువకులు తమ గ్రామ సమస్యలపై విన్నవిస్తూ వినతిపత్రం ఇచ్చేందుకు వచ్చారు. ఐదేళ్లకాలంలో తమ సమస్యలు పట్టించుకోలేదని ఎమ్మెల్యేను వారీ సందర్భంగా ప్రశ్నించారు. మరో ఐదేళ్లపాటు అధికారమిస్తే ఏమి చేస్తారంటూ గ్రామంలోని మురుగునీరంతా రోడ్డుపై రావడాన్ని చూపుతూ నిలదీశారు. దీనిపై ఆగ్రహించిన ఎమ్మెల్యే అనుచరులు టి.వెంకటేశ్వరరావు, ఆర్‌.బుజ్జిగోపాల్‌ తదితరులు దళిత యువకులపై వీరంగం వేశారు. వారిపై దాడికి దిగి పిడిగుద్దులు కురిపించారు. చితకబాదారు. టీడీపీ వర్గీయుల దాడిలో దళిత యువకులు గంటా జగదీష్, కురమా సువర్ణరాజు, పులిపాటి సునీల్‌కు గాయాలయ్యాయి. మరికొందరికి స్వల్పగాయాలయ్యాయి. దీంతో అక్కడ ఉద్రిక్తత చోటు చేసుకుంది. తమ గ్రామానికొచ్చి తమవారిని చితకబాదడమేంటంటూ గ్రామస్తులు ఆందోళన చేశారు. దీంతో గన్ని తన కాన్వాయ్‌తో వెనుతిరిగి వెళ్లిపోయారు. గాయపడిన యువకులను చికిత్స నిమిత్తం భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. వారిని వైఎస్సార్‌సీపీ ఉంగుటూరు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుప్పాల వాసుబాబు తదితరులు పరామర్శించారు. ఎన్నికల్లో గెలిచేందుకు టీడీపీవారు గ్రామాల్లో అరాచక శక్తులతో విధ్వంసకర వాతావరణాన్ని సృష్టిస్తున్నారని, బాధ్యులైన వారిపై కేసులు నమోదు చేయాలని, బాధితులకు న్యాయం చేయాలని నేతలు డిమాండ్‌ చేశారు. 

మరిన్ని వార్తలు