‘దక్షిణాది మంత్రి అయినా.. అక్కడ కీలుబొమ్మే’

5 Jul, 2019 15:56 IST|Sakshi

కేంద్ర బడ్జెట్‌పై ఎంపీ రేవంత్‌ అసంతృప్తి

సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పూర్తిస్థాయి బడ్జెట్‌ను శుక్రవారం లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దాదాపు ఐదు దశాబ్దాల తర్వాత ఒక మహిళా ఆర్థిక మంత్రి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం ఇది ప్రప్రథమం. కాగా, కేంద్ర బడ్జెట్‌పై కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. బడ్జెట్‌లో దక్షిణాది రాష్ట్రాలపై వివక్ష చూపారని విమర్శించారు. విద్యా, ఉద్యోగాల్లో ఎలాంటి ప్రోత్సహకాలు ఇచ్చే పథకాలు లేవని అన్నారు. దక్షిణాది రాష్ట్రాలు రూపాయి పన్ను చెల్లిస్తే తిరిగి కేవలం 65 పైసలు మాత్రమే ఇక్కడివారికి కేటాయిస్తున్నారని అన్నారు.

దక్షిణాదిపై ఉత్తర భారత నాయకుల వివక్ష స్పష్టంగా అర్థం అవుతోందని, దక్షిణాది రాష్ట్రాల నేతలు కూడా ఆలోచించి కేంద్ర వైఖరిని ఖండించాలని పిలుపునిచ్చారు. తెలంగాణకు తీరని అన్యాయం జరుగుతున్నా కేసులకు భయపడి సీఎం కేసీఆర్‌ పార్లమెంట్‌లో టీఆర్‌ఎస్‌ ఎంపీలను నోరుమెదపనీయడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదాయపు పన్నులో పేద, మధ్యతరగతి వారికి ఎలాంటి ఉపశమనం ఇవ్వలేదని అన్నారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి దక్షిణాదికి చెందిన వ్యక్తి అయిన ప్రధాని మోదీ చేతిలో కీలుబొమ్మ అయ్యారని ఎద్దేవా చేశారు.

మరిన్ని వార్తలు