ఏపీకి అందని సీతమ్మ వరాలు..

1 Feb, 2020 17:55 IST|Sakshi

కేంద్ర బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి

పోలవరం నిధులపై స్పష్టత కరువు

మరోసారి కేంద్రం దృష్టికి తీసుకెళ్తాం : వైఎస్సార్‌సీపీ

సాక్షి, అమరావతి : కేంద్ర బడ్జెట్‌పై గంపెడు ఆశలు పెట్టుకున్న ఆంధ్రప్రదేశ్‌కు మరోసారి నిరాశే ఎదురైంది. దేశంలో నెలకొన్న ప్రత్యేక ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ఏపీకి మొండిచేయి చూపింది. ముఖ్యంగా విభజన అనంతరం రాజధాని హైదరాబాద్‌ను కోల్పోయి పీకల్లోతు ఆర్థిక లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ ఆశలపై కేంద్రం మరోసారి నీళ్లు చల్లింది. ఐదు కోట్ల ఆంధ్రుల జీవనాడిగా భావిస్తున్న పోలవరం జాతీయ ప్రాజెక్టుకు బడ్జెట్‌లో నిధుల కేటాయింపుపై స్పష్టత లేదు. ప్రాజెక్టుల వారిగా నిధుల కేటాయింపు జాబిత ప్రకటించకపోవడంతో కొంత గందరగోళం నెలకొంది. బడ్జెట్‌కు ముందు జరిగి అఖిలపక్ష సమావేశంలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు కేంద్రం ముందు పలు ప్రతిపాదనలు పెట్టిన విషయం తెలిసిందే. (బడ్జెట్‌ నిరుత్సాహ పరిచింది: విజయసాయి రెడ్డి)


ఇక విభజన చట్టంలో ఇచ్చిన హామీ మేరకు విశాఖపట్నంను ప్రత్యేక రైల్వేజోన్‌గా గత ఏడాది గుర్తించినప్పటికీ.. దానికి సంబంధించి పనులు మాత్రం ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో తేజాస్‌ తరహా రైళ్లు, సెమీ హైస్పీడ్‌ రైళ్లును ప్రవేశపెడతామని నిర్మలా ప్రకటించినా.. ఏపీకి మాత్రం ఒక్క కొత్త రైల్వే ప్రాజెక్టు కూడా కేటాయించినట్టు ప్రసంగంలో లేదు. విభజన చట్టం ప్రకారం విశాఖ-విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్టు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నప్పటికీ.. కేంద్ర నుంచి మాత్రం ఎలాంటి స్పందన రాలేదు. మరోవైపు విశాఖ-చెన్నై పారిశ్రామిక కారిడార్‌ను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా గాలికొదిలేసినట్లే కనిపిస్తోంది.

మరోవైపు రాష్ట్ర విభజనతో తీవ్రంగా నష్టపోయిన ఏపీకి.. రాజధాని నిర్మాణం పూర్తిగా కేంద్రమే భరిస్తుందని ఏపీ విభజన చట్టం స్పష్టంగా చెబుతోంది. కానీ గడిచిన ఐదేళ్లుగా దానికి తగ్గ కేటాయింపులు లేవు. నిధుల సంగతి పక్కనపెడితే..  ఏపీ ప్రత్యేక హోదా ఇవ్వాలని పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని నెరవేర్చాలని వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం పదేపదే డిమాండ్‌ చేస్తున్నా కేంద్రం మాత్రం మౌనం వహిస్తోంది. రాజధాని నిమిత్తం రాజ్ భవన్, సెక్రటేరియట్, హైకోర్టు సహా మౌలిక వసతుల నిర్మాణాలకు నిధులు కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కోరినా.. మోదీ ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. ఇక దుగ్గరాజపట్నం పోర్టు, కడప స్టీల్ ప్లాంట్‌ ఊసేలేకపోవడం ఆంధ్రులను ఆగ్రహానికి గురిచేస్తోంది. రాష్ట్రంలో వెనకబడిన 7 జిల్లాలకు సంబంధించి మొత్తం రూ.24,350 కోట్లు రావాల్సి ఉన్నా, వాటిపై విభజన చట్టంలో స్పష్టంగా చెప్పినా, ఈ బడ్జెట్లో ప్రస్తావించలేదు. (టీడీపీ ఔట్‌.. వైఎస్సార్‌సీపీ ఇన్‌)

కేంద్రం ఏపీకి మొండిచేయి చూపింది.. 
శనివారం లోక్‌సభలో కేంద్ర విత్తమంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రవేశపెట్టిన బడ్జెట్‌పై వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి ఇప్పటికే అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం ఏపీకి మొండిచేయి చూపిందని, కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి బడ్జెట్‌ నిరుపయోగమని పెదవి విరిచారు. ఈ బడ్జెట్లో ఏపీకి జరిగిన అన్యాయాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని, న్యాయం జరిగేలా ప్రయత్నం చేస్తామని చెప్పారు. బడ్జెట్‌కు సంబంధించి పూర్తి వివరాలు అందిన తర్వాత, సమగ్రంగా విశ్లేషించి మళ్లీ స్పందిస్తామని విజయసాయిరెడ్డి వెల్లడించారు.

బడ్జెట్‌ నిరాశజనకంగా ఉంది : బుగ్గన
కేంద్ర బడ్జెట్‌పై ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పందిస్తూ.. రాష్ట్రానికి సంబంధించి బడ్జెట్‌ నిరాశజనకంగా ఉందన్నారు.ప్రత్యేక హోదా ఏపీ ప్రజల హక్కుని.. కానీ ఇప్పటివరకు ప్రత్యేక హోదాకు సంబంధించి కేంద్ర నుంచి ఎలాంటి హామీ రాకపోవడం దురదృష్టకరమన్నారు. ‘వెనకబడిన 7 జిల్లాలకు ప్రత్యేక గ్రాంట్‌ ఇస్తామని చెప్పారు.. కానీ అవి కూడా ఇప్పటివరకు పూర్తిగా రాలేదు. పోలవరానికి సంబంధించిన నిధుల విడుదల కూడా ఆలస్యం అవుతుంది. దుగ్గరాజపట్నం సాంకేతికంగా ఆలస్యమయితే రామాయపట్నం ఇవ్వాలని కోరాం. కానీ కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ప్రత్యేక హోదా కోసం గత ఐదేళ్ల నుంచి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాడుతోంది’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు