ఏపీ స్పందన కోసం ఎదురుచూస్తూనే ఉన్నాం

17 Mar, 2018 02:07 IST|Sakshi

ప్రత్యేక ప్యాకేజీపై కేంద్ర మంత్రి అరుణ్‌ జైట్లీ 

న్యూఢిల్లీ: ప్రత్యేక ప్యాకేజీ నిధులు పంపిణీ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం స్పందన కోసం ఎదురుచూస్తూనే ఉన్నామని కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ అన్నారు. పీటీఐ వార్తా సంస్థతో ఆయన మాట్లాడుతూ.. నిధులిచ్చే విషయంలో తమవైపు నుంచి ఏవిధమైన ఆలస్యం లేదన్నారు. ప్రత్యేక హోదాకు బదులుగా ప్యాకేజీ ఇచ్చే విధివిధానాలపై 2016 సెప్టెంబర్‌లోనే అంగీకారం కుదిరిందని చెప్పారు. అయితే ఈ ఏడాది జనవరిలో నిధుల స్వీకరణ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మాట మార్చిందన్నారు.

నాబార్డు ద్వారా నిధులివ్వాలని కోరిందని, అయితే దీనివల్ల ఆర్థికలోటు ఎక్కువై అప్పులు చేయడానికి ఇబ్బంది వస్తుందని జైట్లీ తెలిపారు. అందువల్లే నాబార్డ్‌ నుంచి నిధుల మళ్లింపునకు స్పెషల్‌ పర్పస్‌ వెహికల్‌ను ఏర్పాటు చేయాలని సూచించామన్నారు. దీనిపై కార్యాచరణతో వస్తామని ఫిబ్రవరి 7న రాష్ట్ర అధికారులు చెప్పారని, ఇప్పటి వరకూ ఎవరూ రాలేదని తెలిపారు. 2015 నుంచి 2020 వరకూ ఏపీకి ఉండే రెవెన్యూ లోటును 14వ ఆర్థిక సంఘం లెక్కించి ఇస్తుందన్నారు.  

మరిన్ని వార్తలు