అల్లర్ల కేసు నిందితులను జైల్లో కలిసిన కేంద్ర మంత్రి

8 Jul, 2018 19:38 IST|Sakshi

పట్నా : వ ముస్లిం వ్యక్తిని చంపిన కేసులో జైలుకు వెళ్లివచ్చిన వ్యక్తులకు ఘనస్వాగతం పలికి కేంద్రమంత్రి జయంత్‌ సిన్హా విమర్శలు ఎదుర్కొంటున్న వివాదం మరవకముందే మరో కేంద్ర మంత్రి  వివాదంలో చిక్కుకున్నారు. అల్లర్ల కేసులో జైల్లో ఉన్న విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌ దళ్‌ కార్యకర్తలను కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ ఆదివారం కలిశారు. బిహార్‌లోని నవడా జైలులో ఉన్న బజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ కార్యకర్తలను కలిసిన ఆయన.. సుమారు 30 నిమిషాల పాటు వారితో ముచ్చటించి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు.

అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. వీహెచ్‌పీ, బజరంగ్‌ దళ్‌ ​కార్యకర్తలను అరెస్ట్‌ చేయడం దారుణమన్నారు. 'జీతూ జీ, కైలాష్ జీని అరెస్ట్‌  చేయడం దురదృష్టకరం. 2017లో శ్రీరామనవమి సందర్భంగా ఉద్రక్తతలు తలెత్తినప్పుడు వారు పరిస్థితులను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అక్బర్‌పూర్‌లో దుర్గామాత విగ్రహాన్ని విధ్వసం చేసినప్పుడు కూడా ఉద్రిక్తతలను తొలగించే ప్రయత్నమే చేశారు. అలాంటి వారిని అల్లరి మూకలు అని ఎలా నిందిస్తారు ’ అని నిందితులను సమర్థించారు.  హిందువులను అణిచివేయడం ద్వారా మత సామరస్యాన్ని కాపాడగలమని రాష్ట్ర ప్రభుత్వం అనుకుంటే అది దురదృష్టకరమని పేర్కొన్నారు. బిహార్‌లో జేడీయూ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం కొనసాగుతున్న విషయం తెలిసిందే.

ఈ తరహా ధోరణిని విడనాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నా అని గిరిరాజ్‌ అన్నారు. 2017 అల్లర్ల కేసులో బజరంగ్‌ దళ్ కన్వీనర్ జితేంద్ర ప్రతాప్‌ను ఈ నెల 3న అరెస్టు చేశారు. దీనిపై ఆ మరుసటి రోజే జితేంద్ర ప్రతాప్ మద్దతుదారులు రోడ్లపైకి వచ్చి నిరసనలకు దిగడంతో ఐదుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. కాగా గిరిరాజ్‌ ఆరోపణలను ముఖ్యమంత్రి నితీష్‌ కుమార్‌ తిప్పికొట్టారు. మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టేవారిని ఉపేక్షించేది లేదన్నారు. అవినీతి, నేరాలు, మతోన్మాదం విషయాల్లో ప్రభుత్వం రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తమ ప్రభుత్వం ఏ ఒక్క నేరస్థునికి రక్షణ కల్పించదని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు