ప్రకాశ్‌ రాజ్‌కు కేంద్ర మంత్రి సలహా!

9 Oct, 2017 14:29 IST|Sakshi

సాక్షి, బెంగళూరు: ప్రధాని నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు సంధించిన ప్రముఖ నటుడు ప్రకాశ్‌ రాజ్‌కు కేంద్రమంత్రి సదానంద గౌడ్‌ ఓ సలహా ఇచ్చారు. ప్రధాని మోదీ మౌనానికి నిరసనగా తన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానన్న ప్రకాశ్‌ రాజ్‌ ఇంకా కొత్త అవార్డులు తీసుకోవడమేమిటని ప్రశ్నించారు.

ప్రకాష్‌రాజ్‌కు ఇటీవల ప్రతిష్టాత్మక ‘శివరామ్‌ కారంత్‌’  అవార్డును ప్రకటించిన సంగతి తెలిసిందే. దేశ వ్యతిరేక వ్యాఖ్యలు చేసిన ఆయనకు ఈ అవార్డు ఇవ్వరాదంటూ ఇటీవల హిందూత్వ సంస్థలు గగ్గోలు రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రమంత్రి సదానంద గౌడ్‌ స్పందిస్తూ.. ’అతను చాలామంచి నటుడు. కానీ భావజాలపరంగా అతను వామపక్షాలకు మద్దతు పలుకుతున్నాడు. ప్రజలు మాత్రం వామపక్షాలకు దూరంగా ఉంటున్నాయి. తనకు వచ్చిన అవార్డులను తిరిగి ఇచ్చేస్తానన్న నటుడు కొత్తగా అవార్డులు తీసుకోకూడదు. ఇది నా వ్యక్తిగత అభిప్రాయం’ అని అన్నారు.

సీనియర్‌ జర్నలిస్ట్‌ గౌరీ లంకేశ్‌ హత్యపై ప్రధాని మోదీ మౌనం వహించడాన్ని తప్పుబడుతూ ప్రకాశ్‌ రాజ్‌  విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. ప్రధాని మోదీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ తన కన్నా పెద్ద నటులు అని ఆయన వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. గౌరీ లంకేశ్‌ హత్య ఘటనపై మోదీ మౌనాన్ని నిరసిస్తూ తన జాతీయ అవార్డులను తిరిగి ఇచ్చేస్తానని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలపై సోషల్‌ మీడియాలో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అనంతరం ప్రకాశ్‌ రాజ్‌ ట్విట్టర్‌లో వివరణ ఇస్తూ.. జాతీయ అవార్డులన తిరిగి ఇవ్వడానికి తానేమైనా పిచ్చోడినా అని ట్వీట్‌ చేశారు.

మరిన్ని వార్తలు