నిమ్స్‌లో దీక్ష విరమించిన లక్ష్మణ్‌..!

3 May, 2019 11:23 IST|Sakshi

హైదరాబాద్‌: ఇంటర్‌ పరీక్షా ఫలితాల్లో ప్రభుత్వ, ఇంటర్‌ బోర్డు వైఫల్యాన్ని నిరసిస్తూ, విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌ గత 5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తున్నారు. సోమవారం ఉదయం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రారంభమైన ఆయన దీక్ష శుక్రవారం నిమ్స్‌ ఆస్పత్రిలో ముగిసింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి హన్సరాజ్‌ గంగారాం ఆహిర్‌ లక్ష్మణ్‌ను పరామర్శించి ఆయనతో దీక్ష విరమింపజేశారు.

బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద దీక్ష చేపట్టిన లక్ష్మణ్‌ను అదేరోజు అరెస్ట్‌ చేసిన పోలీసులు నిమ్స్‌కు తరలించిన సంగతి తెలిసిందే. అయితే, విద్యార్థులకు న్యాయం జరిగేవరకు పోరాటం ఆపేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఆస్పత్రిలోనే దీక్షను కొనసాగిస్తానని పేర్కొన్నారు. కాగా, లక్ష్మణ్‌ను పరామర్శించిన వారిలో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు, బీజేపీ తెలంగాణ ఇన్‌చార్జి కృష్ణదాస్‌, ఎంపీ దత్తాత్రేయ ఉన్నారు.

(చదవండి : అరెస్ట్‌లను ఖండించిన మురళీధర్‌ రావు)

కేంద్రమంత్రి హన్సరాజ్‌ మాట్లాడుతూ..
5 రోజులుగా నిరవధిక నిరాహార దీక్ష చేస్తుండటంతో లక్ష్మణ్‌ ఆరోగ్యం క్షీణించింది. ఆయన ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా దీక్ష విరమింపజేశాం. ఇంటర్‌ ఫలితాల్లో అవకతవకల కారణంగా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడటం దురదృష్టకరం. విద్యార్థుల కుంటుంబాలకు మా సానుభూతి ఉంటుంది. తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దని కేంద్రం తరపున విద్యార్థులకు నా విజ్ఞప్తి. విద్యాశాఖ మంత్రి జగదీశ్‌ రెడ్డి, ఇంటర్‌ బోర్డు కార్యదర్శి అశోక్‌ను వెంటనే తొలగించాలని డిమాండ్‌ చేస్తున్నాం. ఈ వ్యవహారాన్ని సిట్టింగ్‌ జడ్జితో విచారణ చేయించాని తెలంగాణ సర్కార్‌ను కోరుతున్నా.

ఉద్యమం ఉధృతం..
9 లక్షల మంది విద్యార్థుల భవితవ్యానికి సంబంధించిన సమస్యపై టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఖరి దారుణంగా ఉంది. పరీక్షల్లో ఫెయిలైన పిల్లలు, వారి తల్లిదండ్రుల ఆందోళనపై కేసీఆర్‌ ప్రభుత్వం కనీసం స్పందించడం లేదు. ఒక జాతీయ పార్టీగా బాధితుల పక్షాన నిలబడ్డాం. వారి నిరసనలకు మద్దతు తెలుసుతున్నాం. లక్ష్మణ్‌తో అమిత్‌షా ఫోన్‌లో మాట్లాడారు. ఆయన దీక్షను హన్సరాజ్‌తో విరమింపజేయాలని వర్తమానం పంపారు. విద్యార్థుల పోరాటాలపై భరోసానివ్వడంతో లక్ష్మణ్‌ దీక్ష విరమించారు. వారికి న్యాయం జరిగేదాకా పోరాటం ఆపేది లేదు. ఉద్యమం ఇంకా తీవ్రం చేస్తాం. ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను పరామర్శిస్తాం. 119 అసెంబ్లీ కేంద్రాల్లో దీక్షలు చేసి టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తాం. ఢిల్లీకి వెళ్లి, హోంమంత్రి, రాష్ట్రపతిని కూడా కలుస్తాం.
-బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధరరావు 

Read latest Politics News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా