‘కేసీఆర్‌ సారు, కేటీఆర్‌ సారు ఉండవు’

21 Jul, 2019 07:29 IST|Sakshi

‘కేంద్ర హోం’తో పోలీస్‌స్టేషన్‌లన్నీ లింక్‌

ఈ నెలాఖరుకల్లా అన్నిపోలీస్‌స్టేషన్లతో ఆన్‌లైన్‌ కనెక్టివిటీ 

2023లో తెలంగాణలో అధికారమే లక్ష్యం : కిషన్‌ రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: దేశ సరిహద్దు భద్రతే కాదు అంతర్గత భద్రతకు కేంద్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యం ఇస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి.కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇందులో భాగంగా ఢిల్లీలోని నార్త్‌బ్లాక్‌లోని హోం మంత్రిత్వ కార్యాలయానికి ప్రతి పోలీసు స్టేషన్‌ను అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఈ ప్రక్రియ 70 శాతం వరకు పూర్తయిందని, ఈ నెలాఖరు వరకు దేశంలోని అన్ని పోలీసు స్టేషన్లతో ఆన్‌లైన్‌ కనెక్టివిటీ పూర్తవుతుందన్నారు. అప్పుడు దేశంలో ఏ పోలీసు స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్‌ నమోదైనా తెలుస్తుందన్నారు. శనివారం హైదరాబాద్‌లో ప్లాజా హోటల్‌లో ఎమ్మెల్సీ ఎన్‌.రాంచందర్‌రావు అధ్యక్షతన ఏర్పాటు చేసిన ‘లంచ్‌ విత్‌ కిషన్‌రెడ్డి’కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదేమీ ప్రెస్‌మీట్‌ కాదని, అందరిని కలువాలనే ఉద్ధేశంతోనే వచ్చానన్న కేంద్ర మంత్రి విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు.  

విద్యార్థిలా నేర్చుకుంటున్నా... 
కేంద్ర హోంశాఖలో అత్యంత కీలకమైన విభాగాలు ఎన్నో ఉన్నాయని, ఒక స్కూల్‌ విద్యార్థిలా రోజు ఆఫీస్‌కు వెళ్తూ వాటిని నేర్చుకుంటున్నానని అన్నారు. టెర్రరిజం ఇప్పుడు తమ ముందున్న ప్రధాన సవాల్‌ అని వెల్లడించారు. మహిళల భద్రతకు కేంద్రం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, అది రాష్టాలకు సంబంధించిన అంశమే అయినా అవసరమైన చట్టాల మార్పులను చేసి కేంద్రం మార్గదర్శకాలు ఇవ్వాల్సి ఉంటుందన్నారు. అత్యాచార కేసుల్లో కఠిన శిక్షల అమలుకు చట్ట సవరణలు చేయబోతున్నామన్నారు. బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడితే కఠిన శిక్ష పడేలా ప్రొటెక్షన్‌ ఆఫ్‌ చిల్డ్రన్‌ ఫ్రమ్‌ సెక్యువల్‌ అఫెన్సెస్‌ యాక్ట్‌ (పోక్సో)లో మార్పులు చేస్తామన్నారు.

ఇప్పటివరకు 12 ఏళ్లలోపు వారిపై అత్యాచారానికి పాల్పడితే ఉరి శిక్ష వేసేలా చట్టం ఉందని, ఇకపై 18 ఏళ్లు లేదా 20 ఏళ్లలోపు వారిపై అత్యాచారానికి పాల్పడినా ఇదే శిక్ష వేసేలా చట్ట సవరణ చేయనున్నామన్నారు. సైబర్‌ సెక్యూరిటీ, పోలీస్‌ ఆధునికీకరణ, షీ టీమ్స్‌ వంటి కార్యక్రమాలకు ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. త్వరలోనే సైబర్‌ సెక్యూరిటీ, సైబర్‌ టెర్రరిజం ప్రివెన్షన్‌ చట్టాలు తీసుకురాబోతున్నామని చెప్పారు. ఈ నెల 26తో పార్లమెంటు సమావేశాలు ముగియాల్సి ఉన్నా వచ్చే నెల 2 వరకు పొడిగించే అవకాశం ఉందన్నారు. దీనిపై ఈ నెల 22న బీఏసీ భేటీలో నిర్ణయం తీసుకోనున్నట్లు మంత్రి చెప్పారు. 

మజ్లిస్‌తో కలసి టీఆర్‌ఎస్‌ రాజకీయాలు.. 
ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, అందుకే తాము గెలిచామని కిషన్‌రెడ్డి వెల్లడించారు. తాము మతం పేరుతో గెలవలేదని జాతీయ వాదంతో గెలిచామన్నారు. ఎన్నికల్లో మతం పేరు ఎప్పుడైనా చెప్పామా అని ప్రశ్నించారు. రాష్ట్రంలో మజ్లిస్‌ను పక్కన పెట్టుకొని టీఆర్‌ఎస్‌ రాజకీయాలు చేస్తోందన్నారు. అభివృద్ధి ఎజెండాగానే తమ కార్యక్రమాలు ఉంటాయన్నారు. హైదరాబాద్‌ టెర్రరిజానికి సేఫ్‌ జోన్‌గా మారిందని చెప్పానని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. టెర్రరిజం బ్రీడింగ్‌ కేంద్రాల్లో హైదరాబాద్‌ కూడా ఒకటని చెప్పానే తప్ప.. దేశానికి సంబంధించిన ఉగ్రవాదమంతా ఇక్కడే ఉందనలేదు అని అన్నారు.

ఎన్‌ఐఏ అరెస్టులే తన వాదనకు సాక్ష్యమన్నారు. దేశంలో అక్రమంగా ఉన్న విదేశీయులందరినీ గౌరవంగా వారి ప్రాంతాలకు పంపిస్తామన్నారు. హైదరాబాద్‌లోనూ ఈ చర్యలు చేపడతామన్నారు. నాగాలాండ్‌ వంటి రాష్ట్రాల్లో ఇప్పటికీ అనుమతి తీసుకొని వెళ్లాల్సిన ప్రాంతాలు ఉన్నాయని, అలాంటి వాటిని మార్చాల్సి ఉందన్నారు. నక్సల్స్‌ విషయంలో రాష్ట్రాలకు అవసరమైన సహకారాన్ని కేంద్ర ప్రభుత్వం అందిస్తోందన్నారు. కాగా, రాజ్‌ భవన్‌లో రాష్ట్ర గవర్నర్‌ ఈఎస్‌ఎల్‌ నరసింహన్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్‌ రెడ్డి శనివారం మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు.

ప్రత్యర్థులే.. శత్రువులుండరు..
ప్రజలు మార్పు కోరుకున్నప్పుడు కేసీఆర్‌.. కారు.. పదహారు.. ఢిల్లీ సర్కారు.. ఇవేవీ ఉండవన్నారు. కేసీఆర్‌ సారు.. కేటీఆర్‌ సారు... అనేది ఎవరు చూడరన్నారు. రాష్ట్రంలో 2023లో బీజేపీ అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. మిషన్‌ 2023లో భాగంగా రాష్ట్రంలో వచ్చే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి రావాలన్నదే అమిత్‌ షా లక్ష్యమని, అందుకోసం కృషి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ పార్టీని యాంటీ నేషనల్‌ పార్టీ అని ఎక్కడా.. ఎప్పుడూ అనలేదన్నారు. కాంగ్రెస్‌ నేతలు రాజకీయంగా మాత్రమే తమకు ప్రత్యర్థులని, శత్రువులు అనే మాట ఎప్పుడూ మాట్లాడబోమని అన్నారు. ఎక్కడో ఒక చోట అత్యాచారం సంఘటన జరిగితే అది మొత్తం సాయుధ బలగాలకు ఆపాదించడం సరికాదని కిషన్‌రెడ్డి వివరించారు.

>
మరిన్ని వార్తలు