ఓట్ల కోసమే ముస్లింలపై కపట ప్రేమ: నఖ్వీ

17 Jun, 2018 17:00 IST|Sakshi
కేంద్ర మంత్రి ముఖ్తార్‌ అబ్బాస్‌ నఖ్వీ (పాత ఫొటో)

సాక్షి, న్యూఢిల్లీ : ముస్లింల విశ్వాసం పొందాలంటే తమ ప్రభుత్వం మరిన్ని సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాల్సిన ఆవశ్యకత ఉందని కేంద్ర మైనార్టీ శాఖ మంత్రి ముఖ్తార్‌అబ్బాస్‌ నఖ్వీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఆదివారం ఆయన పీటీఐతో మాట్లాడుతూ... ‘గత 70 ఏళ్లుగా ముస్లింల మెదళ్లలో వారు(కాంగ్రెస్‌ పార్టీ) విషాన్ని నింపారు. ఇప్పుడు ముస్లిం మద్దతు కూడగట్టాలన్నా, మా పార్టీపై వారికి విశ్వాసం కలిగించాలన్నా ప్రభుత్వం ఎంతో చేయాల్సి ఉంది. అయితే గత కొంత కాలంగా బీజేపీ పట్ల వారి వైఖరి మారుతోంది. ముఖ్యంగా బీజేపీ చేపడుతోన్న మహిళా సంక్షేమ కార్యక్రమాల పట్ల ముస్లిం మహిళలు సానుకూల దృక్పథంతో ఉండటం మాకు కలిసి వచ్చే అంశం’ అంటూ వ్యాఖ్యానించారు.

కేవలం ఓట్ల కోసమే కపట ప్రేమ..
కాంగ్రెస్‌ పార్టీ సహా ఇతర పార్టీలన్నీ ముస్లింలను కేవలం ఓటు బ్యాంకుగానే పరిగణిస్తాయి తప్ప వారి సంక్షేమం, అభివృద్ధి పట్ల ఏమాత్రం శ్రద్ధ వహించరని నఖ్వీ ప్రతిపక్షాలను విమర్శించారు. తమ పార్టీ ఓట్ల కోసం తాపత్రయపడదని, కేవలం వారి సంక్షేమం దృష్ట్యా ఎన్నో సంక్షేమ కార్యక్రమాల అమలు, ట్రిపుల్‌ తలాక్‌ రద్దు వంటి చారిత్రక నిర్ణయాలు తీసుకుంటోందని తెలిపారు.

మరిన్ని వార్తలు