అప్పుడు టికెట్‌ పోయింది; ఇప్పుడేమో..

31 May, 2019 11:49 IST|Sakshi

భువనేశ్వర్‌ : ప్రధాని నరేంద్ర మోదీ జెంబో క్యాబినెట్‌లో బీజేపీ ఎంపీ ప్రతాప్‌చంద్ర సారంగి సహాయ మంత్రిగా స్థానం దక్కించుకున్నారు. మోదీతో పాటు గురువారం ఆయన పదవీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ క్రమంలో ఆయనకు సంబంధించిన కొన్ని ఆసక్తికర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశా మోదీగా పేరొందిన ప్రతాప్‌చంద్రకు 2009 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ టికెట్‌ ఇచ్చినప్పటికీ ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగారు. అయితే పార్టీపై వ్యతిరేకత వల్లనో లేదా ప్రత్యర్థుల ఎత్తుల కారణంగానో ప్రతాప్‌చంద్ర ఇలా చేయలేదు. ఆయన అనుసరించే అతి సాధారణ జీవనశైలే ఇందుకు కారణం. ఆర్భాటాలకు పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వని ప్రతాప్‌చంద్ర ఎన్నికల సమయంలోనూ బస్సులోనే ప్రయాణించేవారు. ఇందులో భాగంగా పార్టీ టికెట్‌ను బ్యాగులో పెట్టుకుని బస్సు ఎక్కగా దొంగలు బ్యాగ్‌ను కొట్టేశారు. దీంతో టికెట్‌ కూడా పోయింది. ఈ క్రమంలో నామినేషన్‌ గడువు సమీపించడంతో స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేసి విజయం సాధించారు. ప్రజల నమ్మకం, విశ్వాసం చూరగొంటే జెండా, గుర్తుతో సంబంధం లేకుండా గెలుపొందవచ్చని నిరూపించారు.

కాగా ఆరెస్సెస్‌ ప్రచారక్‌గా గుర్తింపు పొందిన ప్రతాప్‌చంద్ర సారంగి ఒడియాతో పాటు సంస్కృత భాషలో కూడా అనర్గళంగా మాట్లాడగలరు. ఎదుటివారు ఎంతటి వారైనా తన వాగ్ధాటితో మెప్పించగల చతురులు.  2004, 2009 అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీజేడీ హవాను తట్టుకుని ఎమ్మెల్యేగా గెలుపొందారు. గ్రామాల్లో సైకిల్‌పై తిరుగుతూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వారితో మమేకమయ్యే ప్రతాప్‌చంద్ర.. 2019 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలోనూ అదే పంథా అనుసరించారు. బీజేపీ టికెట్‌ సంపాదించిన ఆయన ఆటోలో ప్రచారం నిర్వహిస్తూ సామాన్యులకు చేరువయ్యారు. అదే విధంగా ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీ కూడా ప్రతాప్‌చంద్రకు మద్దతుగా ప్రచార సభలో పాల్గొని ఆయనకు అండగా నిలిచారు.

చదవండి : మోదీ కేబినెట్‌ @ 58

ఈ క్రమంలో సంపన్నులు, మీడియా చానళ్లు, రాజకీయ నేపథ్యం ఉన్న ప్రత్యర్థి అభ్యర్థులను మట్టికరిపించి బాలాసోర్‌ నుంచి తొలిసారి ఎంపీగా గెలుపొందారు. ప్రధాని నరేంద్ర మోదీ జంబో కేబినెట్‌లో సహాయ మంత్రిగా పదవి దక్కించుకుని పలువురి దృష్టిని ఆకర్షించారు. ఇక ప్రధాని నరేంద్ర మోదీతో పాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, రాజ్‌నాథ్‌ సింగ్, నితిన్‌ గడ్కారీ, ఎస్‌.జయశంకర్‌ సహా మొత్తం 58 మంది గురువారం మంత్రులుగా ప్రమాణం చేసిన సంగతి తెలిసిందే. వీరిలో 25 మంది కేబినెట్‌ మంత్రులు కాగా.. స్వతంత్ర హోదా కలిగిన మంత్రులు 9 మంది, సహాయ మంత్రులు 24 మంది ఉన్నారు.

>
మరిన్ని వార్తలు