టీచర్లకు ఎంత చేసినా టీడీపీకి ఓట్లేయరు

1 Aug, 2018 12:13 IST|Sakshi
పదవీ విమరణ సభలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఉన్నం

ఎమ్మెల్యే ఉన్నం అసహనం

శెట్టూరు: ‘‘టీడీపీ హయాంలో చంద్రబాబు ఉపాధ్యాయులకు చేసిన కార్యక్రమాలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో టీచర్‌ పోస్టులు మా ప్రభుత్వంలోనే వచ్చాయి. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నా టీచర్లు మాత్రం టీడీపీకి ఓట్లెయ్యరు.’’ అని టీడీపీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరి అసహనం వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా శెట్టూరు మండల పరిధిలోని యాటకల్లులో మంగళవారం ఎంఈఓ శ్రీధర్‌ అధ్యక్షతన ఆదర్శ పాఠశాల హెచ్‌ఎం శెట్టి నరసింహులు పదవీ విరమణ సభ నిర్వహించారు. ముఖ్యఅతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏపీటీఎఫ్‌ జిల్లా నాయకుడు రఘురామిరెడ్డి, మరో నాయకుడు నరసింహులు ప్రభుత్వం విద్యను హేతుబద్ధీకరణ పేరుతో పేద ప్రజలకు దూరం చేస్తోందన్నారు.

దీనిని ఖండిస్తూ ఎమ్మెల్యే ఉన్నం టీచర్ల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. ప్రభుత్వ విద్యను పేదలకు దూరం చేస్తోందంటున్నారు కదా.. ఎంత మంది అయ్యవార్లు తమ పిల్లలని ప్రభుత్వ పాఠశాలల్లో చదివిస్తున్నారని ప్రశ్నించారు? ఏదైనా సమస్యలు వస్తే యూనియన్లంటూ ముందుకు వస్తారన్నారు. టీడీపీ హయాంలో సీఎం చంద్రబాబు ఎన్నో లబ్ధి చేకూర్చే పథకాలను తీసుకొచ్చారని.. అయినా టీడీపీకి మాత్రం అయ్యవార్లు ఓట్లెయ్యరన్నారు. ప్రభుత్వంపై ఆరోపణలు మాని ఒక పద్ధతిగా పోరాడండంటూ తన ప్రసంగాన్ని ఆవేశంతో సాగించారు. అంతలోనే మరో ఉపాధ్యాయ సంఘం నాయకుడు వెంకటస్వామి జోక్యం చేసుకుని ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులైన ఎమ్మెల్యేల పిల్లలు ఒకే పాఠశాలలో చదివితే ఇలాంటి అంతరాలు ఉండవన్నారు.

>
మరిన్ని వార్తలు