‘ఉన్నావో రేప్‌’ ఎటుపోతుంది?

31 Jul, 2019 14:35 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ‘దేశంలో మహిళలపై ఎలాంటి అత్యాచారాలను సహించం. మహిళలకు ఎక్కువ భద్రతను కల్పిస్తాం. అందుకు ఇప్పటికే హోం శాఖలో ప్రత్యేక భద్రతా విభాగాన్ని ఏర్పాటు చేశాం. మహిళలపై రేప్‌లు జరిగితే వాటిని నిర్దిష్ట కాలపరిమితిలో విచారించేలా చూస్తాం. అందుకు ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులను మరింతగా విస్తరింపచేస్తాం. ఫోరెన్సిక్‌ సౌకర్యాలను పెంచుతాం’ 2019 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా భారతీయ జనతా పార్టీ విడుదల చేసిన 45 పేజీల మానిఫెస్టోలో మహిళల గురించి పేర్కొన్న పేరా. ఈ మానిఫెస్టోలో మహిళల భద్రత గురించి 37 సార్లు ప్రస్తావించారు. 

మరి, దేశవ్యాప్తంగా సంచలం సృష్టించిన ఉన్నావో రేప్‌ కేసులో ఏం జరిగిందీ ? ఏం జరుగుతోంది ? ఉత్తరప్రదేశ్‌లో భారతీయ జనతా పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ తనను కిడ్నాప్‌ చేసి తనపై అత్యాచారం జరిపినట్లు ఓ టీనేజ్‌ అమ్మాయి 2017లో ఆరోపించారు. రకరకాల ఒత్తిళ్ల వల్ల ఈ విషయాన్ని బయటకు రాకుండా అధికార యంత్రాంగం తొక్కిపెట్టింది. చివరకు 2018లో ఈ విషయమై ఫిర్యాదు చేయాలని కుటుంబ సభ్యులతో కలిసి బాధితురాలు నిర్ణయించుకున్నారు. వారంతా పోలీసు స్టేషన్‌కు వెళితే ఫిర్యాదు తీసుకోవడానికి పోలీసులు తిరస్కరించారు. దీంతో వారు లక్నోలోని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ నివాసం ముందు ఆత్మాహుతికి ప్రయత్నించారు. అప్పడు అక్కడి సిబ్బంది వారి ప్రయత్నాన్ని అడ్డుకున్నారు. ఆ మరుసటి రోజే ఆ అమ్మాయి తండ్రి పోలీసు స్టేషన్‌ లాకప్‌లో మరణించారు. పోలీసులే కాకుండా, సెంగార్‌ సోదరుడు కూడా పోలీసు స్టేషన్‌కు వచ్చి కొట్టడం వల్ల అమ్మాయి తండ్రి మరణించినట్లు నాడు వార్తలు వచ్చాయి.

అమ్మాయి తండ్రిని కొట్టారనడానికి ప్రత్యక్ష సాక్షిగా ఉన్న వ్యక్తి కూడా ఆ తర్వాత పది రోజుల్లో అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించారు. జబ్బు వల్ల అతను చనిపోయినట్లు అధికార యంత్రాంగం పేర్కొంది. అటాప్సీ చేయించాల్సిందిగా సాక్షి బంధువులు డిమాండ్‌ చేశారు. నేటి వరకు అది జరగలేదు. కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌పై అత్యాచార ఆరోపణలను నాడు బీజేపీ ఎమ్మెల్యే సురేంద్ర సింగ్‌ తీవ్రంగా ఖండించారు. ముగ్గురు పిల్లల తల్లిని ఏ మగాడు రేప్‌ చేయరంటూ బుకాయించారు. బాధితురాలికి అసలు పిల్లలే లేరు. ఆ తర్వాత ఓ ఎన్నికల ప్రచార సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోపాటు నిందితుడు కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ భార్య పాల్గొన్నారు. మీడియాలో ఈ ఫొటోలను చూసిన బాధితురాలి కుటుంబం ఇక తమకు న్యాయం జరిగే అవకాశం లేదని భావించి నేరుగా కోర్టును ఆశ్రయించారు. ఈ కారణంగా కుల్దీప్‌ సింగ్‌ జైలుకు వెళ్లాల్సి వచ్చింది. ఆయన జైల్లో ఉండగానే 2019 లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. బీజేపీ ఎంపీ సాక్షి మహరాజ్‌ జైలుకు వెళ్లి సెంగార్‌ను కలుసుకుని పరామర్శించారు. తన విజయం వెనక కుల్దీప్‌ సింగ్‌ సెంగార్‌ పాత్ర ఎంతో ఉందని ఆయన ప్రజల సమక్షంలో సెంగార్‌కు కతజ్ఞతలు తెలిపారు. 

ఉన్నావో రేప్‌ సంఘటనకు సంబంధించిన ఈ పరిణామాలన్నింటినీ ప్రజలు దాదాపు మరచిపోయారు. రేప్‌ బాధితురాలు, తన న్యాయవాది, ఇద్దరు తన ఆంటీలతో కలిసి కారులో వెళుతుండగా ఆదివారం నాడు ఓ ట్రక్కు వచ్చి ఢీకొనడం, ఆ సంఘటనలో బాధితురాలు, లాయర్‌ తీవ్రంగా గాయపడడం, బాధితురాలి ఇద్దరి సమీప బంధువులు మరణించడంతో ఉన్నావో రేప్‌ మరోసారి సంచలనం అయింది. ట్రక్కు నెంబర్‌ కనిపించకుండా నేమ్‌ ప్లేట్‌కు రంగేసి ఉండడం, అనూహ్యంగా ట్రక్కు కారుపైకి దూసుకెళ్లడం, ఈ విషయమై మీడియా పెద్ద ఎత్తున గోల చేయడంతో ఈ యాక్సిడెంట్‌ వెనక కుల్దీప్‌ సింగ్‌ హస్తం ఉండవచ్చంటూ పోలీసులు కేసు నమోదు చేశారు.

మరిన్ని వార్తలు