నటుడు ఉపేంద్ర వివాదాస్పద వ్యాఖ్యలు

7 Jul, 2018 10:01 IST|Sakshi

సాక్షి, యశవంతపుర : రాజకీయాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని భావిస్తున్న ఉత్తమ ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు, నటుడు ఉపేంద్ర రాష్ట్ర బడ్జెట్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. విద్యుత్‌, పెట్రోల్‌ వంటి వాటిపై పన్నులు వేసి సీఎం కుమారస్వామి ప్రభుత్వం పేదలపై నేరుగా భారం మోపిందని విమర్శించారు. కొత్త బడ్జెట్‌తో సామాన్యులకు ప్రభుత్వం పంగనామాలు పెట్టిందంటూ కామెంట్‌ చేశారు. ఈ మేరకు సోషల్‌ మీడియాలో పలు పోస్టులు చేశారు.

20 శాతం బుద్ధిఉన్న మూర్కులు మాత్రమే బడ్జెట్‌పై మాట్లాడుతున్నారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగానే ఇలాంటి సమస్యలపై నోరు విప్పడం లేదని అభిప్రాయపడ్డారు. ‘ఉత్తమ ప్రజాకీయ పార్టీ అనేది రాజకీయ పార్టీనే. మార్పును కోరుకునే ఎవరైనా ఇందులో చేరవచ్చు. ప్రజాకీయ పార్టీ కోసం విలువైన సలహాలు ఇస్తే తప్పకుండా స్వీకరిస్తానని’ ఉపేంద్ర ట్వీట్‌ చేశారు. ఆయన చేసిన మరిన్ని ట్వీట్లు వైరల్‌గా మారాయి.

ఓవైపు రాజకీయ అరంగేట్రం అంటూనే మరోవైపు ఉపేంద్ర మళ్లీ సినిమాల్లో తలమునకలయ్యారు. పార్టీని నడపాలంటే డబ్బులు కావాలని, డబ్బులు కావాలంటే సినిమాలు చేయాలని ఉపేంద్ర ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. అయితే పూర్తిస్థాయి రాజకీయాల్లోకి రాని వ్యక్తులు ఇలా అవగాహనా లేని ఆరోపణలు, విమర్శలు చేస్తారని కూటమి నేతలు అంటున్నారు. ఉపేంద్ర వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం లేదని అధికార నేతలు సూచిస్తున్నారు.

మరిన్ని వార్తలు