ప్రజలకే అధికారం మా పార్టీ సిద్ధాంతం

9 Apr, 2019 13:43 IST|Sakshi
పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతున్న ఉపేంద్ర

దొడ్డబళ్లాపురం: ప్రజలకు అధికారం ఇచ్చి వారి కోసం పనిచేయడమే ప్రజాకీయ పార్టీ సిద్ధాంతమని సినీహీరో,ప్రజాకీయ పార్టీ అధ్యక్షుడు ఉపేంద్ర అన్నారు. రామనగరలో బెంగళూరు గ్రామీణ లోక్‌సభకు పోటీ చేస్తున్న ప్రజాకీయ పార్టీ అభ్యర్థి మంజునాథ్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం కోసం విచ్చేసిన ఆయన ఈ సందర్భంగా సోమవారం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి బ్రిటీష్‌ వాళ్లు దేశం విడిచి వెళ్లినా వారి స్థానంలో రాజకీయ నాయకులు వచ్చారని, రాజకీయ నాయకులు దేశాన్ని దోచుకుంటున్నారన్నారు.

డబ్బు, స్వార్థం, స్వజనపక్షపాతం, దౌర్జన్యంతో రాజకీయాలు నడిచినంత కాలం ప్రజాప్రభుత్వంలో ప్రజలకు అధికారం దక్కదన్నారు. మొదట ప్రజలు మారితే రాజకీయ వ్యవస్థ కూడా మారుతుందన్నారు. రాష్ట్రంలో 28 లోక్‌సభ స్థానాల్లోనూ ప్రజాకీయపార్టీ అభ్యర్థులు పోటీచేస్తున్నారన్నారు. గెలుపు, ఓటములు తమకు ముఖ్యం కాదని, వంద ఓట్లు పడ్డా వందమంది తమ పార్టీని ఆదరించారని సంతోషిస్తా మన్నారు. పార్టీ సిద్ధాంతాలతో తాము రాజీపడే ప్రసక్తే లేదన్నారు. అనివీతి అరికట్టడానికి లోక్‌పాల్‌ అవసరమని, అయితే అదే లోక్‌పాల్‌లోని అధికారులే అవినీతికి పాల్పడరని గ్యారంటీ ఏంటని ప్రశ్నించారు. కావున ప్రజలే అవినీతిని అంతమొందించాలని పిలుపునిచ్చారు.

>
మరిన్ని వార్తలు