అవినీతి.. అస్థిరత.. వ్యతిరేకభావం

21 Jan, 2019 03:33 IST|Sakshi

వాటి కలబోతే మహాకూటమి

నాలుగున్నరేళ్లలో దేశం వేగంగా అభివృద్ధి చెందింది 

బీజేపీ కార్యకర్తలతో మోదీ

ముంబై/ మర్గోవా: కోల్‌కతా వేదికగా సంఘీభావం తెలిపిన ప్రతిపక్ష నేతలది అవినీతి, వ్యతిరేకభావం, అస్థిరతలతో కూడిన మహాకూటమి అని ప్రధాని మోదీ అభివర్ణించారు. పేద వర్గాలకు పది శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ తాము తీసుకున్న వచ్చిన చట్టంతో ప్రతిపక్షాలకు నిద్ర కరువైందన్నారు. గతంలో బలహీనంగా ఉన్న భారత్‌ బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారిందని చెప్పారు. ఆదివారం ఆయన మహారాష్ట్రలోని కొల్హాపూర్, హట్కనంగ్లే, మాధా, సతారా, దక్షిణ గోవా లోక్‌సభ నియోజకవర్గాల బూత్‌ స్థాయి కార్యకర్తలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు. మహాకూటమి నేతలది ధనబలం కాగా తమది ప్రజాబలం అన్నారు.

తమ కూటమి 125 కోట్ల భారతీయుల ఆకాంక్షలు, ఆశలు, కలలతో ముడిపడి ఉందన్నారు. ‘కోల్‌కతా సభా వేదికపై ఉన్న వారంతా బడా నేతల కుమారుడు/కుమార్తె లేదా తమ కుమారుడు/కుమార్తెను రాజకీయాల్లోకి తేవాలని ఆశపడే వారే. తమ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం పై నమ్మకం లేని వారు ఇప్పుడు ప్రజాస్వామ్యంపై బహిరంగంగా ఉపన్యాసాలిస్తున్నారు’ అని దెప్పి పొడిచారు. ఎన్నికల్లో అన్ని రకాల అక్రమాలకు పాల్పడటమే వారి లక్ష్యమన్నారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో పరాజయం తప్పదని ముందుగానే ఊహించిన ప్రతిపక్షాలు ఈవీఎంలను సాకుగా చూపాలనుకుంటున్నాయి. పెట్టుబడిదారులు, కుంభకోణాలు, అవినీతి, అపనమ్మకం, అస్థిరతల కలయికే మహాకూటమి’ అని ఎద్దేవా చేశారు.  

బలహీనం నుంచి అభివృద్ధివైపు పయనం
గత ప్రభుత్వాల పాలనతో బీజేపీ నాలుగున్నరేళ్ల పాలనను పోలుస్తూ ప్రధాని.. ‘బీజేపీ అధికారంలోకి వచ్చే సమయానికి దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనంగా ఉంది. విద్యుత్‌ కొరత, ఆర్థిక సంక్షోభాలతో కొట్టుమిట్టాడుతోంది. కుంభకోణాల గురించిన వార్తలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో భారత్‌ పేరు వినబడేది. ఇప్పుడు కుంభకోణాల(స్కాంల) ప్రస్తావనే లేదు. కేవలం కొత్త పథకాల(స్కీంల) గురించే చర్చ జరుగుతోంది. గత నాలుగున్నరేళ్లలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా మారింది. ప్రపంచం ఇప్పుడు భారత్‌ను నమ్మకం, విశ్వాసంతో చూస్తోంది.  అప్పట్లో దేశంలోని 98 శాతం మందికి టాయిలెట్‌ సౌకర్యం అందుబాటులోకి వచ్చింది’ అని తెలిపారు.

పేదలకు రిజర్వేషన్లతో విపక్షాలకు నిద్ర కరువు
ఆర్థికంగా బలహీన వర్గాల వారికి విద్య, ప్రభుత్వ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్న ప్రభుత్వ సంకల్పంతో ప్రతిపక్ష నేతలకు నిద్ర కరువైందని ప్రధాని వ్యాఖ్యానించారు. ‘మా నిర్ణయానికి తగు కారణం లేనట్లయితే, వాళ్లకు అశాంతి కరువయ్యేది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలు, పుకార్లను వ్యాప్తి చేసేందుకు రంగంలోకి దిగేవాళ్లు. వాళ్లు అలా చేయడం లేదంటే దానర్ధం.. దేశ ప్రజల కోసం ప్రభుత్వం మంచి పని చేసిందనే కదా’ అని అన్నారు. రిజర్వేషన్ల కారణంగా సీట్ల కొరత తలెత్తకుండా ఈ విద్యా సంవత్సరం నుంచే విద్యా సంస్థల్లో సీట్ల సంఖ్యను పది శాతం పెంచుతున్నట్లు వివరించారు. ‘ప్రతి ఒక్కరూ సమాన అవకాశాలు పొందాలన్నదే తమ అభిమతం.  ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ప్రభుత్వం రిజర్వేషన్లపై చట్టం చేసిందన్న ప్రతిపక్షాల విమర్శలపై ఆయన మాట్లాడుతూ.. ఈ నిర్ణయాన్ని తాము ఎప్పుడు ప్రకటించినా వాళ్లు ఇలాంటి ఆరోపణలే చేసే వారని వ్యాఖ్యానించారు.

>
మరిన్ని వార్తలు