మోదీకి పట్టంకట్టిందీ అగ్రవర్ణాల వారే!

5 Jun, 2019 17:03 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : మోదీ అనుకూల పవనాలు స్పష్టంగా కనిపించిన 2014లో జరిగిన లోక్‌సభ ఎన్నికల కంటే ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు రావడానికి కారణాలేమిటీ ? అన్న అంశంపై సామాజిక శాస్త్రవేత్తలు ఇప్పటికీ తర్జనభర్జనలు పడుతున్నారు. దాదాపు అన్ని ఎన్నికల ముందస్తు సర్వేలో బీజేపీకే అత్యధిక సీట్లు వచ్చినప్పటికీ ప్రభుత్వం ఏర్పాటుకు కావాల్సిన 272 సీట్లు రావని తేల్చాయి. బీజేపీ 300 మార్కును దాటుందని ఎగ్జిట్‌ పోల్స్‌లోనే తేలింది. అప్పటి వరకు నిశ్శబ్ద పవనాలు మోదీకి అనుకూలంగా వీచాయి. అవి ఏమిటీ?

‘నేషనల్‌ ఎలక్షన్‌ స్టడీ 2019’ అధ్యయనం వివరాల ప్రకారం ధనవంతులు, అగ్రవర్ణాల వారు, ఎగువ మధ్య తరగతి వాళ్లు ఎక్కువగా బీజేపీకి ఓటు వేశారు. అగ్రవర్ణాల్లో 61 శాతం మంది బీజేపీకే ఓటు వేశారట. ఈ విషయంలో మరే పార్టీ 50 శాతం మార్కును దాటలేదు. అది పార్లమెంట్‌ ప్రాతినిథ్యంలో కూడా కనిపించింది. అంటే పార్లమెంట్‌కు ఎన్నికైన వారిలో ఎక్కువ మంది అగ్రవర్ణాలకు చెందిన వారే ఉన్నారు. మోదీ కేబినెట్‌లో కూడా సగానికిపైగా అగ్రవర్ణాల వారికే చోటు లభించింది. ఆ తర్వాత 44 శాతం మంది ధనవంతులు, అంతే శాతం మంది ఎగువ మధ్యతరగతి వారు బీజేపీకే ఓటు వేశారు. దిగువ తరగతుల వారు, పేదల్లో 36 శాతం మంది మాత్రమే బీజేపీకి ఓటు వేశారు. ఎన్నికల కమిషన్‌ డేటా ప్రకారం పట్లణ ప్రాంతాల్లో 41.1 శాతం సెమీ పట్టణ ప్రాంతాల్లో 32.9 శాతం మంది, గ్రామీణ ప్రాంతాల్లో 37.6 శాతం మంది బీజేపీకి ఓటు వేశారు. 

మొత్తం రాజకీయ పార్టీల్లో ధనిక పార్టీ బీజేపీయే అవడం, ఎన్నికల ప్రచారానికి ఆ పార్టీయే ఖర్చు పెట్టడం కూడా ఆ పార్టీకి లాభించింది. మొత్తం అన్ని పార్టీల ఎన్నికల ప్రచారానికి 60 వేల కోట్ల రూపాయలు ఖర్చు అయిందని ‘ది సెంటర్‌ ఫర్‌ మీడియా సర్వీసెస్‌’ అంచనా వేసింది. అందులో 27 వేల కోట్ల (45–50 శాతం) రూపాయలను బీజేపీ ఒక్కటే ఖర్చు చేయగా, కాంగ్రెస్‌ పార్టీ 15–20 శాతం రూపాయలను మాత్రమే ఖర్చు చేయగలిగిందట. ధనవంతులు, అగ్రవర్ణాల వారు తాము బీజేపీకే ఓటు వేస్తున్నామని మీడియా ముందు చెప్పకపోవడం, ముస్లింలు, దళితులను వ్యతిరేకించే హిందూత్వవాదులే ధనవంతులు, అగ్రవర్ణాల్లో ఎక్కువ ఉండడం వల్ల వారు ఎక్కువ మౌనాన్ని పాటించారని తెలుస్తోంది. అందుకనే మోదీ అనుకూల పవనాలు బయటకు కనిపించలేదు. 

మరిన్ని వార్తలు