ఉప్పులేటి కల్పనకు అచ్చిరాని టీడీపీ..

26 May, 2019 20:46 IST|Sakshi

సాక్షి, విజయవాడ: 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ నుంచి గెలుపొందిన ఎమ్మెల్యేలు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి ఆ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో  చేరారు. దీనిపై అప్పట్లోనే తీవ్ర విమర్శలు వ్యక్తమయ్యాయి. ప్రస్తుతం ఎన్నికలు రావడంతో పార్టీ ఫిరాయించిన వారిని, వారి వారసులను కూడా ప్రజలు తిరస్కరించారు. ఐదేళ్లు వైఎస్సార్‌ సీపీలోనే ఉండి, తరువాత ఎన్నికల బరిలోకి దిగిన వారికీ ప్రజలు బ్రహ్మరథం పట్టారు. 

అచ్చిరాని టీడీపీ
ఉప్పులేటి కల్పన 2009లో పామర్రు నుంచి టీడీపీ తరుఫున పోటీ చేసి ఓడిపోయారు. 2014లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే రెండేళ్లు గడిచిన తరువాత టీడీపీలోకి వెళ్లిపోయారు. తిరిగి 2019లో టీడీపీ తరఫున తిరిగి పామర్రు నుంచి పోటీ చేసి పరాజయం పాలయ్యారు. కాగా రాజకీయాల్లోకి నూతనంగా అడుగుపెట్టిన కైలే అనిల్‌ కుమార్‌ చేతిలో 30,873 ఓట్ల తేడాతో ఓడిపోయారు. టీడీపీ కల్పనకు అచ్చిరాలేదని ఆ పార్టీ వర్గాలే అభిప్రాయ పడుతున్నాయి. 

ఖాతూన్‌కు తప్పని ఓటమి
విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే జలీల్‌ఖాన్‌ రాజకీయ జీవితం ముగిసిపోతున్న దశలో 2014లో వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి ఆయనకు టిక్కెట్‌ ఇచ్చి గెలిపించారు. అయితే ఏడాది దాటిన తరువాత ఆయన టీడీపీలోకి చేరారు. ఎన్నికల్లో ఆయనకు బదులుగా ఆయన కుమార్తె ఖాతూన్‌కు చంద్రబాబు నాయుడు సీటు  కేటాయించారు. నియోజకవర్గ ప్రజలకు ఖాతూన్‌ కంటే జలీల్‌ఖాన్‌ను చూసి ఓటేయాలని కోరారు. అయితే ఖాతూన్‌ వైఎస్సార్‌ సీపీ అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్‌ చేతిలో 7,671 ఓట్ల తేడాతో ఓడిపోయారు. వాస్తవంగా ఖాతూన్‌ ఓడిపోయిందనే దాని కంటే జలీల్‌ఖానే పరాజయం చెందారని నియోజకవర్గంలోనూ, టీడీపీలోనూ వినిపిస్తోంది.

జనసేనలోకి  వెళ్లి దెబ్బతిన్నారు...
వైఎస్సార్‌ సీపీ నాయకుడు భాస్కరరావు భార్య రేవతి నూజివీడు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌గా పనిచేస్తున్నారు. ఆయన మేకా ప్రతాప్‌ అప్పారావుకు కుడిభజంగా ఉండేవారు. అటువంటి భాస్కరరావు వైఎస్సార్‌ సీపీని వీడి జనసేన తీర్థం పుచ్చుకుని ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేశారు. ఆయనకు కేవలం 5,464 ఓట్లు మాత్రమే వచ్చాయి. రాష్ట్రంలో జనసేన తుడిచిపెట్టుకుపోయింది. భాస్కరరావు స్వయంకృతాపరాధమే ఆయన కుటుంబ రాజకీయ జీవితం ఇబ్బందుల్లో పడిందని నియోజకవర్గంలో వినపడుతోంది.


 

మరిన్ని వార్తలు