ఢిల్లీ అసెంబ్లీలో ఎమ్మెల్యే ‘ఉగ్ర’ వ్యాఖ్యలు

7 Aug, 2018 03:19 IST|Sakshi

న్యూఢిల్లీ: అధికార ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేపై బీజేపీ ఎమ్మెల్యే అనుచిత వ్యాఖ్యలు ఢిల్లీ అసెంబ్లీలో కలకలం రేపాయి. సోమవారం అసెంబ్లీలో మంచినీటి సమస్యపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యే ఓపీ శర్మ మాట్లాడుతూ..తన నియోజకవర్గంలో నీటి సమస్యకు అధికారులే కారణమని ఆరోపించారు. దీనిపై ఆప్‌ సభ్యుడు అమానతుల్లా ఖాన్‌ అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఓపీ శర్మ అనుచితంగా మాట్లాడారు.

‘తప్పు చేస్తే ఉగ్రవాదుల మాదిరిగా నువ్వూ జైలుకు పోతావ్‌. ఉగ్రవాదిలా ఎందుకు మాట్లాడుతున్నావ్‌? ఉగ్రవాదిలా ఎందుకు ప్రవర్తిస్తున్నావ్‌? నాతో పెట్టుకోకు. ఫన్నీఖాన్‌లాగా ఉండకు. కూర్చో’ అంటూ దూషించారు. ఈ వ్యాఖ్యలు శాసనసభ ప్రతిష్టకు భంగకరమంటూ ఆప్‌ సభ్యులు ఆందోళనకు దిగారు. మత విద్వేషాలను రెచ్చగొట్టి దేశాన్ని ముక్కలు చేసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యత్నిస్తోందని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఆరోపించారు.

>
మరిన్ని వార్తలు