మళ్లీ గెలిపిస్తే.. మొత్తం ఊడ్చేస్తారు

20 Mar, 2019 07:54 IST|Sakshi

యూపీఎస్సీ మాజీ ఇన్‌చార్జ్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కేఎస్‌ చలం

విశాఖలో హుద్‌హుద్‌ కంటే భూబకాసురుల వల్లే తీవ్ర నష్టం

ఐదేళ్లలో ఈ ప్రాంతానికి ఏ మేలు జరగలేదు

ఇక్కడి వనరులు, సంపద దోచేసి ఎన్నికల్లో ఖర్చుపెడుతున్నారు

విద్య, వైద్య వ్యవస్థలను నాశనం చేశారు

ఈ ఐదేళ్లూ ఏం చేశారు..

ఎన్నికలకు ముందు అకౌంట్లలో డబ్బులేయడం తాయిలమే?

నా ఓటునూ తొలగించారు.. ఐటీకి ఆద్యులే డేటా చౌర్యానికి పాల్పడ్డారు

విశాఖను రెండో రాజధానిగా ప్రకటించి హైకోర్ట్‌ బెంచ్‌ ఏర్పాటు చేయాలి

‘హుద్‌హుద్‌ సృష్టించిన బీభత్సం కంటే నవ్యాంధ్రలోని ఏకైక మహానగరం విశాఖపట్టణానికి ఈ ఐదేళ్లలో భూబకాసురులు కోలుకోలేనంత నష్టం చేకూర్చారు. ఉత్తరాంధ్రను పూర్తిగా దగాచేశారు. మళ్ళీ ఈ పాలకులే వస్తే ఇక్కడి వనరులు మొత్తాన్ని ఊడ్చేస్తారు. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేనివిధంగా సహజ, ఇంధన వనరుల్ని.. సంపదలను నిలువునా దోచేశారు.’

‘రాష్ట్రంలో ప్రాథమిక రంగాలైన విద్య, వైద్య వ్యవస్థల్ని నాశనం చేశారు. పసుపు కుంకుమ పేరిట సరిగ్గా ఎన్నికలకు ముందు బ్యాంక్‌ అకౌంట్లలో డబ్బులు జమ చేయడమేంటి...? ఇది ఎన్నికల తాయిలం కాదా? ఒకవేళ మహిళలకు ఆర్ధిక సాయం చేయాలనుకుంటే ఐదేళ్ళ నుంచి ఎందుకు చేయలేదు? ఐటీకి ఆద్యులమని చెప్పుకుంటున్న వాళ్లే డేటా చౌర్యానికి కూడా ఆద్యులని చెప్పుకోవాలి. ఎంత దౌర్భాగ్యమంటే చివరికి నా ఓటు కూడా తొలగించారు’ అని యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌(యూపీఎస్సీ) మాజీ ఇన్‌చార్జ్‌ చైర్మన్, ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ చైర్మన్‌ కేఎస్‌ చలం ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజన అనంతరం సుదీర్ఘ కోస్తాతీరమున్న నవ్యాంధ్ర సన్‌ రైజ్‌ స్టేట్‌గా మారుతుందని అనుకున్నాం.. కానీ ఏపీని పాలకులు ‘సన్‌’ రైజ్‌ స్టేట్‌గా మార్చేశారని ఆయన సాక్షితో వ్యాఖ్యానించారు.

సాక్షి :విశాఖ కేంద్రంగా జరిగిన భూకుంభకోణంపై మీ విశ్లేషణ?
చలం: అంత భూ దోపిడీ చరిత్రలో ఎప్పుడూ జరిగి ఉండదు. రూ.లక్ష కోట్ల భూ కుంభకోణమని పత్రికలే రాశాయి. సమైక్య రాష్ట్రం విడిపోగానే ఏపీలో ఏకైక మహానగరంగా ఉన్న విశాఖపై పడి దోచుకున్నారు. ప్రభుత్వ భూముల్ని ప్రైవేటు భూములుగా మార్చేసి అమ్మేసుకున్నారంటే.. అసలు నేరస్తులు ఎవరో అందరికీ తెలుసు. అందుకే ఒక్కరిపై కూడా చర్యలు తీసుకోలేదు. ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్‌) నివేదిక ఏమైంది... ఆ సిట్‌ ఎవరిని విచారించింది? ఎవరిపై చర్యలు తీసుకుంది? నాకు తెలిసి భూ కుంభకోణాలతో వచ్చిన డబ్బునే ఈ ఎన్నికల్లో వెదజల్లనున్నారు. ఇక్కడి డబ్బునే ఇటీవల తెలంగాణ ఎన్నికలకు, ఇతర రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలకు ఖర్చు పెట్టారు.

సాక్షి : ఉత్తరాంధ్రకు ఐదేళ్ల కాలంలో ఏం ఒరిగింది?
చలం:ఐదేళ్ల కాలంలో ఉత్తరాంధ్రకు ఏ మేలు జరగలేదు. విభజన చట్టం మేరకు రావాల్సిన ప్రాజెక్టులేమీ రాలేదు. చివరికి ఇక్కడి వనరులనే దోచిపెట్టారు. ఐటీ అభివృద్ధి కేవలం ప్రకటనలకే పరిమితమైంది. ఐటీ సెజ్‌ పేరిట నిబంధనలకు విరుద్ధంగా సేకరించిన అటవీ భూములను ప్రైవేటు కంపెనీలకు నామమాత్ర ధరకు కట్టబెట్టేశారు. సర్కారు చివరి రోజుల్లో ఆదాని కంపెనీకి  వేల కోట్ల విలువైన 200 ఎకరాల భూమిని దోచిపెట్టేశారు. ఇది చాలా అన్యాయం.. ఇంత భూ దోపిడీ భారతదేశంలో ఎక్కడా జరిగి ఉండదు. సీఆర్‌జెడ్‌లోకి వచ్చే భూములనూ అడ్డగోలుగా ధారాదత్తం చేశారు. ఇక కేంద్రపాలకులు రైల్వే జోన్‌ ఇచ్చిన తీరు చూస్తే ఎవరికైనా ఆగ్రహం వస్తుంది?

సాక్షి :  విచ్చలవిడి మైనింగ్‌ అనుమతులపై మీరేమంటారు?
చలం: మన్యంలోని గనులను పాలకులు ఆదాయమార్గంగా మార్చుకున్నారు. అనధికారికంగా విచ్చలవిడిగా తవ్వేశారు. ఇప్పటికే బ్లూ గ్రానైట్‌ మన్యంలో దొరకడం లేదు. విశాఖ జిల్లాలో నాకు తెలిసి ఈ మధ్యకాలంలోనే 25 వేల ఎకరాల కొండ భూములు దోచేశారు. ఇక పీపీపీ( పబ్లిక్‌ ప్రైవేట్‌ పార్టనర్‌షిప్‌) పేరిట విలువైన భూముల్ని కార్పొరేటు కంపెనీలకు కట్టబెట్టారు. రైతుల నుంచి ఏపీఐఐసీ భూములు తీసుకుని కోట్లు ఖర్చు చేసి అభివృద్ధి చేశాక, ఆ తర్వాత వాటిని అతి తక్కువ ధరకు ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తున్నారు.

సాక్షి :ప్రభుత్వం చెప్పుకుంటున్న నదుల అనుసంధానం గురించి మీరేమంటారు?
చలం: నదుల అనుసంధానమా.. ఎక్కడ జరిగింది? ఉత్తరాంధ్ర నీటినే పట్టిసీమకు తరలిస్తున్నారు. ఉత్తరాంధ్రలో 16 నదులున్నాయి. ప్రధానంగా ఎగువ ప్రాంతంలోని సీలేరు, శబరి నుంచి వచ్చే మిగులు జలాలతోనే గోదావరి నిండుతోంది. ఆ నీటినే పట్టిసీమలోకి ఎత్తిపోస్తున్నారు. సీలేరు, శబరి, ఉపనదుల నీటిని ఈ ప్రాంతంలో వినియోగించిన తర్వాతే మిగిలిన జలాలను తరలించే పరిస్థితి రావాలి. ఉత్తరాంధ్రలో పది లక్షల ఎకరాలకు పూర్తిస్థాయిలో నీటిని అందించలేకపోతున్నారు.

సాక్షి : ఈ ఐదేళ్ళలో వలసలు పెరిగాయా.. తగ్గాయా?
చలం: నవ్యాంధ్ర వచ్చిన తర్వాతే వలసలు పెరిగాయని సర్వే చెబుతోంది. విచ్చలవిడి కాలుష్య కారక పరిశ్రమల వల్ల తీరంలో మత్స్యసంపద తగ్గిపోవడంతో సుమారు 18 లక్షల మంది ప్రజలు వలస వెళ్తున్నారు.

సాక్షి :రాష్ట్ర ఆదాయం పెరిగిందని సర్కారు చెప్పుకుంటోంది... గతంలో ప్లానింగ్‌ బోర్డు సభ్యుడిగా, ప్రస్తుతం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌ ఫర్‌ సోషల్‌ జస్టిస్‌ చైర్మన్‌గా ఉన్న మీరు ఎలా విశ్లేషిస్తారు?
చలం: రాష్ట్రం ఏ రంగంలోనూ అభివృద్ధి చెందలేదు. రాష్ట్ర ఆదాయాన్ని లెక్కించే విధానం మారడం, అమరావతితో రియల్‌ ఎస్టేట్‌ రంగం ముందుకెళ్లడం వల్ల వృద్ధి రేటు పెరిగిందని చూపిస్తున్నారు. ఏ రంగంలో వృద్ధి చెందామో పాలకులు బహిరంగంగా లెక్కలతో చెప్పగలరా?

సాక్షి :ఇతర రాష్ట్రాలు అసూయ పడేలా రాష్ట్రం అభివృద్ధి చెందిందని బాబు చెబుతున్నారు?
చలం: ఇతర రాష్ట్రాలా... అంతెందుకు...  మన పక్క రాష్ట్రం ఒడిశా కంటే మనం వెనుకపడి ఉన్నాం. అక్షరాస్యతలో మన కంటే ఒడిశా ముందుంది.. అదొక్కటే కాదు చాలారంగాల్లో వెనుకబడి ఉన్నాం.

సాక్షి :ప్రస్తుత విద్యారంగం పరిస్థితులపై మీ విశ్లేషణ?
చలం:రాష్ట్రంలో విద్యారంగమంటే ప్రభుత్వం కేవలం నారాయణ, చైతన్య కాలేజీలనే చూపిస్తోంది. ఓ రకంగా వాళ్ళకు తాకట్టు పెట్టేసింది. ఇంతకంటే దౌర్భాగ్యం లేదు. ఇప్పటికే రాష్ట్రంలోని చాలా సర్కారు స్కూళ్లు, హాస్టళ్లు మూతపడుతున్నాయి. ప్రాథమిక రంగాలైన విద్య, వైద్య వ్యవస్థలను నాశనం చేశారు. శ్రీకాకుళంలో వైఎస్సార్‌ ఏర్పాటు చేసిన అంబేడ్కర్‌ యూనివర్సిటీని పట్టించుకోవడం లేదు. ఇప్పటివరకు యూజీసీ గుర్తింపు లేదు. శ్రీకాకుళంలో గిరిజన వర్సిటీ ఏర్పాటు చేస్తామన్నారు. అదీ లేదు. ఇక అతిపెద్ద ఆంధ్ర వర్సిటీని కులాల కుంపటిగా మార్చేశారు.

సాక్షి : టీడీపీ సర్కారు ప్రచారాలపై?
చలం: ఉత్తరాంధ్రకైతే గోరంత కూడా చేయలేదనే నేనంటాను. ఇక ప్రచారమంటారా దాని గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. జన్మభూమిని టీడీపీ ప్రచార కార్యక్రమంలా మార్చేశారు.

సాక్షి : సీఎం తనకు నలభై ఏళ్ల సీనియారిటీ ఉందని చెప్పుకుంటారు కదా. ఆ సీనియారిటీ ఏం పనికొచ్చిందని భావిస్తున్నారు..
చలం:దేశంలోనే సీనియర్‌ నాయకుడు అని చెప్పుకునేందుకు ఆయనకు ఏమాత్రం అర్హత లేదు. హుద్‌ హుద్‌ వల్ల నష్టపోయిన విశాఖకే ప్రభుత్వం ఏమీ చేయలేదు. విశాఖలో దాదాపు చెట్లన్నీ కూలిపోయినా... రైల్వేస్టేషన్‌ ఏరియాలోని ఓ మర్రిచెట్టు ఆకుకూడా రాలకుండా బతికిందని, దాన్ని కాపాడాలని నేను స్వయంగా లేఖ రాశాను. దాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. విభజన తర్వాత తీరప్రాంతం ఎక్కువున్న ఏపీ సన్‌రైజ్‌ స్టేట్‌ అవుతుందని భావించాం. కానీ ‘సన్‌’రైజ్‌ స్టేట్‌ అయింది.

సాక్షి : విజన్‌ 2020తో రాష్ట్రం ఏమైనా వృద్ధి సాధించిందా?
చలం: అస్సలు లేదు. విజన్‌ 2020ని ఆర్భాటంగా ప్రకటించిన సర్కారు ఏ నాడైనా సమీక్షించిందా.. లేదే..

సాక్షి : వైఎస్‌ హయాంపై... ఒక్క మాట!
చలం:వైఎస్సార్‌ హఠాన్మరణంతోనే అభివృద్ధి ఆగిపోయిందని నేను భావిస్తాను. ప్రజల ప్ర‘గతి’ తప్పింది. ఇది ఎవ్వరైనా ఒప్పుకోవాల్సిన మాటే.

సాక్షి :యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ చైర్మన్‌గా చేసిన మీరు ఎంతో మంది ఐఏఎస్‌లకు శిక్షణ ఇచ్చారు కదా... ఇప్పుడు ఐఎఎస్‌లు ఎలా ఉంటున్నారు..
చలం: ఇప్పుడు చాలామంది ఐఎఎస్‌లలో నిబద్ధత, నిజాయితీ ఎక్కడుంది?. అధికార పార్టీ నేతలకు సేవకులుగా చేస్తున్నారు. చాలామంది సివిల్‌ సర్వెంట్లు ఏళ్ల తరబడి ఒక్క చోటే తిష్ట వేస్తున్నారు.

సాక్షి : డేటా చౌర్యంపై...
చలం: ఐటీకి ఆద్యులం మేమే అని చెప్పుకుంటున్న వాళ్ళే డేటా చౌర్యానికి కూడా ఆద్యులని చెప్పుకోవాలి. ఎంత దౌర్భాగ్యమంటే చివరికి నా ఓటు కూడా తొలగించేశారు. ఆంధ్రవిశ్వవిద్యాలయానికి చెందిన చాలా మంది మాజీ ప్రొఫెసర్లు మా  ఓట్లు కూడా గల్లంతయ్యాయని నాతో చెబుతున్నారు. విద్యావంతుల ఓట్లే ఇలా గల్లంతయ్యే పరిస్థితి బహుశా దేశంలో ఎక్కడా ఉండి ఉండదు.

సాక్షి : అమరావతి రాజధానిపై...
చలం: ఇక మార్చడానికి వీల్లేదు కాబట్టి రాజధాని గురించి కొత్తగా చెప్పుకునేదేమీ లేదు. కొన్ని సామాజికవర్గాల ప్రాబల్యం కోసం అమరావతిని ఎంచుకున్నారు. కనీసం ప్రకాశం జిల్లాలో ఏర్పాటు చేసినా బాగుండేది. కనీసం విశాఖను రెండో రాజధానిగా ప్రకటించి హైకోర్ట్‌ బెంచ్‌ ఏర్పాటు చేస్తే బాగుండేది.

సాక్షి : రాష్ట్రంలో ప్రస్తుత ప్రభుత్వ పాలనపై మీ విశ్లేషణ ఏంటి?
చలం: ఈ పాలన గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. పసుపు కుంకుమ పేరిట సరిగ్గా ఎన్నికలకు ముందు బ్యాంకు అకౌంట్లలో డబ్బులు జమ చేయడం ఏంటి...? ఇది ఎన్నికల తాయిలం. ఒకవేళ మహిళలకు సాయం చేయాలనుకుంటే ఐదేళ్ల నుంచి ఎందుకు చేయలేదు.. చివరిలో ఇలా చేయడమేంటో నాకు అర్థం కావడం లేదు. కేంద్ర ప్రభుత్వం కూడా అంతే...  

మరిన్ని వార్తలు