అంతమాత్రాన ఏడుస్తూ కూర్చోను : ఊర్మిళ

8 Apr, 2019 11:42 IST|Sakshi

ముంబై : ‘బాలీవుడ్‌ నుంచి వచ్చాను కదా అని నాకు మెదడు లేదని అనుకుంటున్నారేమో. ఇష్టం వచ్చినట్లు చేస్తే సహించేది లేదు. ఇండస్ట్రీలో భాగమైనందుకు నేను ఇప్పటికీ గర్వంగా ఫీలవుతున్నా’ అని ముంబై నార్త్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి ఊర్మిళా మటోంద్కర్‌ వ్యాఖ్యానించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా అంధేరీలో ఏర్పాటు చేసిన ‘యూత్‌ మీట్‌’కు పాటిదార్‌ ఉద్యమ నాయకుడు హార్ధిక్‌ పటేల్‌తో కలిసి ఆమె హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేవలం తమ స్వార్థ ప్రయోజనాల కోసం బీజేపీ యువతను వినియోగించుకుందని విమర్శించారు. మోదీ ప్రభుత్వం యువతకు ఎటువంటి ప్రయోజనాలు చేకూర్చలేదని మండిపడ్డారు. రాజకీయాల్లోకి ప్రవేశించగానే కొంతమంది తనను విపరీతంగా ట్రోల్‌ చేశారని.. అయితే అంతమాత్రాన ఏడుస్తూ కూర్చోనని పేర్కొన్నారు. ఇటువంటి వేదికలపై ఆ విషయాలను ప్రస్తావించి సానుభూతి పొందాలనుకోవడం లేదని.. ఎంపీగా గెలిచితీరతానే నమ్మకం ఉందని ఊర్మిళ చెప్పుకొచ్చారు.

కాగా ముంబై నార్త్‌ నియోజకవర్గంలో గుజరాతీలు అధిక సంఖ్యలో ఉన్న నేపథ్యంలో ఊర్మిళ, ముంబై నార్త్‌ వెస్ట్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి తరపున ప్రచారం చేసేందుకు హార్ధిక్‌ పటేల్‌ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ 2014లో యూత్‌కు మోదీ పట్ల బాగా క్రేజ్‌ ఉండేది. కానీ అధికారంలోకి రాగానే హామీలను తుంగలో తొక్కి ఆయన యువతను మోసం చేశారు. ఇందుకు తగిన సమాధానం చెప్పే రోజు దగ్గర్లోనే ఉంది’ అని ప్రధాని మోదీపై విమర్శలు గుప్పించారు. ఇక వికీపీడియాలోని ఊర్మిళ ప్రొఫైల్‌ పేజీలో ఆమె పేరు, మతం, తల్లిదండ్రుల వివరాలు, కుటుంబ నేపథ్యాన్ని మార్చేసి కొంతమంది ఆకతాయిలు తప్పుడు వివరాలను అప్‌లోడ్‌ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై ఊర్మిళ కుటుంబ సభ్యులు మండిపడగా, బీజేపీ సోషల్‌మీడియా విభాగం ఈ నీచమైన ప్రచారానికి దిగిందని కాంగ్రెస్‌ విమర్శించింది. ఊర్మిళ ప్రస్తుత పేరు మరియమ్‌ అక్తర్‌ మిర్‌ అనీ, 2015లో ఆమె కశ్మీరీ వ్యాపారవేత్త మొహసీన్‌ అక్తర్‌ మిర్‌ను పెళ్లిచేసుకున్నారంటూ ట్రోల్‌ చేశారు.

మరిన్ని వార్తలు