రాబంధుల్లాగా దోచుకుంటున్నారు

19 Jul, 2018 18:23 IST|Sakshi
బాధితులతో ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, ఇతర కాంగ్రెస్‌ నేతలు

హైదరాబాద్‌ : నెరేళ్ల సంఘటన జరిగిన ఏడాది కావస్తున్న సందర్భంలో బాధితులతో కలిసి తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్‌ ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి గాంధీ భవన్‌లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..‘  పోయిన ఏడాది జూలైలో సిరిసిల్లలో ఇసుక లారీ కింద పడి గిరిజనుడు చనిపోతే..నిరసన తెలియజేయడానికి వచ్చిన దళితులను పోలీసులు థర్డ్‌ డిగ్రీతో వేధించారు. ఎంత మంది చనిపోయినా కూడా మా అక్రమ సంపాదన మాదే అన్నట్లు కల్వకుంట్ల కుటుంబం తయారైంది. కేసీఆర్‌ కుటుంబం, టీఆర్‌ఎస్‌ నేతలు రాబంధుల్లాగా రాష్ట్రాన్ని దోచుకుంటున్నారు. పోయిన జూలై తర్వాత మరలా అనేక మంది ఇసుక లారీల కింద పడి చనిపోయారు. ఎంత మంది చచ్చినా మాకు అక్కర్లేదు అన్నట్లు కేసీఆర్‌ కుటుంబం ప్రవర్తిస్తున్నది. ఇంత జరిగినా బుద్ధి తెచ్చుకోగపోగా..బాధితులపై ఒత్తిడి తేవడం, వారికే లంచాలు ఇవ్వడం లాంటివి ప్రభుత్వం చేస్తుంది’  అని ఆరోపించారు.

‘కేసీఆర్‌ కుమారుడు స్థానిక ఎమ్మెల్యే అయ్యి ఉండి కూడా కేటీఆర్‌ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఈ విషయంలో బాగా ప్రమేయం ఉన్న ఎస్పీకి ప్రమోషన్‌ ఇచ్చారు. ఇప్పటి వరకు ఛార్జ్‌షీట్‌ వెయ్యలేదు. కేసు డ్రాప్‌ కూడా చెయ్యలేదు.  మీ కాలం దగ్గర పడ్డది కాబట్టే.. మీ చేష్టలు ఇలా ఉన్నాయి. నేరేళ్ల బాధిత కుటుంబాలను కాంగ్రెస్‌ ఆదుకుంటుంది. హైకోర్టులో కూడా వీళ్లపై కేసు పెండింగ్‌లో ఉంది. అక్కడ కూడా వీరికి న్యాయం జరగడం లేదు. ఏడాది తర్వాత కూడా న్యాయం జరగలేదు అని చెప్పడానికి మా ప్రయత్నం చేస్తున్నామని’  ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి వివరించారు.

నేరేళ్ల బాధితులు

మాకు కాంగ్రెస్‌ వల్ల కొంచెం న్యాయం జరుగుతుందని ఆశ పడుతున్నాం. అక్కడ తిరుగుతున్న లారీలన్నీ కేసీఆర్‌ కుటుంబానికి చెందినవే. ఎంత మంది చచ్చిపోయినా కనీసం లారీ డ్రైవర్లు, ఓనర్ల మీద కేసు పెట్టడం లేదు. షాక్‌ ఇచ్చి చిత్రహింసలకు గురిచేశారు. ఆ సమయంలో బెటాలియన్‌ మొత్తం అక్కడే ఉంది. ఎస్పీ, పశువులాగా ప్రవర్తించాడు. ఇదంతా చేయించింది కేటీఆరే.
 బానయ్య, మాజీ సర్పంచ్‌

పోలీసు శాఖలోకి వెళ్దామనుకున్నా..పోలీసుల తీరు చూసి సిగ్గేస్తోంది. దేనికీ పనికి రాకుండా కొట్టారు. మేము టెర్రరిస్టులం కాదు. ఏడాది గడిచినా కూడా మాకు న్యాయం జరగలేదు.
- హరీష్‌

మరిన్ని వార్తలు