‘సమితుల’ రద్దు కోసం సత్యాగ్రహం 

3 Oct, 2017 02:49 IST|Sakshi

     నేడు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమాలు 

     చురుగ్గా పాల్గొనాలంటూ పార్టీ శ్రేణులకు పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ లేఖ

సాక్షి, హైదరాబాద్‌: ‘రైతు సమన్వయ సమితులు రద్దు కావాలి, గ్రామ పంచాయతీలు బలపడాలి’అన్న నినాదంతో మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సత్యాగ్రహం చేస్తున్నట్లు పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనాలంటూ కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులకు సోమవారం బహిరంగ లేఖ రాశారు. తెలంగాణ ప్రభుత్వం అధికార దుర్వినియోగం చేస్తూ ప్రజలను కష్టాల సుడిగుండంలోకి నెడుతుందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలో తొక్కి ఏకపక్షంగా ముందుకు వెళ్తున్నారని, అన్ని స్థాయిల్లో ఇతర పార్టీల ప్రజాప్రతినిధులను అక్రమంగా చేర్చుకుంటున్నారని, ఇతర పార్టీల ఉనికి లేకుండా చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

తాజాగా తమ నిరంకుశ చర్యలకు పరాకాష్టగా జీవో 39ని ప్రభుత్వం తెచ్చిందని.. ఈ జీవో ఆధారంగా గ్రామ, మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో రైతు సమన్వయ సమితులను ఏర్పాటు చేస్తున్నారని చెప్పారు. మంత్రులు సభ్యులను నామినేట్‌ చేస్తూ.. టీఆర్‌ఎస్‌ కార్యకర్తలను నింపుతున్నారని ఆరోపించారు. దీనివల్ల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు మెంబర్లు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, మండలాధ్యక్షులు, జిల్లా పరిషత్‌ అధ్యక్షులు, నీటి వినియోగదారుల సంఘాల చైర్మన్లు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల అధ్యక్షులు, పాలక వర్గాల సభ్యుల పాత్ర నామమాత్రం కానుందని వివరించారు. భూ రికార్డుల ప్రక్షాళన, అమ్మకాలు, కొనుగోళ్లలో కూడా రైతు సమన్వయ సమితులు జోక్యం చేసుకుని ప్రజలను బ్లాక్‌ మెయిల్‌ చేస్తాయని, అవినీతికి పాల్పడతాయని, భూ రికార్డులను చేతిలో పెట్టుకుని గ్రామీణ ప్రజలను, ఇతర పార్టీల, సంఘాల కార్యకర్తలను, వ్యక్తులను బెదిరించి లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తాయని అనుమానం వ్యక్తం చేశారు.

గ్రామాలపై టీఆర్‌ఎస్‌ గుత్తాధిపత్యాన్ని కట్టబెట్టడానికే ఈ సమితులు ఉపయోగపడే ముప్పుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిరంకుశ చర్యలను అడ్డుకోకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందుల్లో కూరుకుపోతారని, కాంగ్రెస్‌ నాయకులుగా, కార్యకర్తలుగా ప్రజల పక్షాన నిలబడటం బాధ్యతన్నారు.  

మరిన్ని వార్తలు